ఏయూలో దోపిడీకి కూటమి భారీ ప్లాన్ 

ఏకంగా వంద కోట్ల నిధుల స్వాహాకు స్కెచ్ 

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ ఫైర్ 

విశాఖపట్నం వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ. 

తొలుత రూ.95 కోట్లతో అంచనాలు 

నాలుగు నెలల్లోనే రూ.210 కోట్లకు పెంపు

నిబంధనలకు విరుద్ధంగా 121 శాతం అంచనా వ్యయం పెంపుపై సర్వత్రా అనుమానాలు

కొండా రాజీవ్ వెల్లడి 

నాసిరకం పనుల రికార్డు ఉన్న ఏపీఈడబ్ల్యూఐడీసీకే మళ్లీ బాధ్యతలా?

విద్యార్థి మరణం, వర్షంలో హాస్టళ్ల లీకేజీలు పట్టవా?

సూటిగా ప్రశ్నించిన కొండా రాజీవ్ 

స్పష్టత ఇవ్వకపోతే ప్రజా ఉద్యమం తప్పదు

ప్రెస్ మీట్ లో రాజీవ్ హెచ్చరిక

విశాఖపట్నం : దేశానికి ఉపరాష్ట్రపతులను, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను, మేధావులను అందించిన ప్రతిష్టాత్మక ఆంధ్రా విశ్వవిద్యాలయం (ఏయూ), వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంలో అవినీతి అడ్డాగా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ ధ్వజమెత్తారు. "దోచుకో–దాచుకో–పంచుకో" అన్న ఏకైక అజెండాతో సాగుతున్న కూటమి పాలనలో వర్సిటీ అభివృద్ధి నిధులు సైతం పక్కదారి పడుతున్నాయని ఆయన ఆరోపించారు. విశాఖలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కొండా రాజీవ్, ఏయూలో జరుగుతున్న అక్రమాలపై ఆధారాలతో సహా నిలదీశారు. 
ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏమన్నారంటే... 

నాలుగు నెలల వ్యవధిలోనే రూ.115 కోట్ల అంచనాల పెంపు: 
ఆంధ్రా యూనివర్సిటీలో నిర్మాణ పనుల్లో భాగంగా గతంలో వర్సిటీ సివిల్ ఇంజనీరింగ్ విభాగం రూ.95 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేయగా, కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఆ అంచనాలను ఏకంగా రూ.210 కోట్లకు పెంచడం వెనుక భారీ కుంభకోణం దాగి ఉంది.  24 జూన్ 2026 నాటి అధికారిక రికార్డుల ప్రకారమే... మెగా సెంట్రల్ మెస్ నిర్మాణం అంచనా.. రూ.14.50 కోట్లు, గర్ల్స్ హాస్టల్ నిర్మాణం అంచనా.. రూ.34.80 కోట్లు, 
 బాయ్స్ హాస్టల్ నిర్మాణం అంచనా, రూ.45.78 కోట్లు కాగా... అక్టోబర్ 2026 నాటికి వర్సిటీ ఏర్పాటు చేసిన బోర్డుల ప్రకారం మెగా మెస్ వ్యయం.. రూ.42.40 కోట్లకు పెంచగా.. గర్ల్స్ హాస్టల్ వ్యయాన్ని రూ.73 కోట్లకు, బాయ్స్ హాస్టల్ వ్యయం, రూ.94.50 కోట్లకు పెంచారు. కేవలం నాలుగు నెలల్లోనే అంచనా వ్యయం 121 శాతం ఎలా పెరిగింది?. సాధారణంగా స్టాండర్డ్ షెడ్యూల్ రేట్ల (SSR) ప్రకారం అంచనాలు రూపొందిస్తే 15 శాతానికి మించి వ్యత్యాసం ఉండదు. అటువంటిది అదనంగా పెంచిన రూ.115 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి?". 

స్వంత ఇంజనీరింగ్ విభాగాన్ని పక్కనబెట్టి ఏపీఈడబ్ల్యూఐడీసీకి ఎందుకు?: 
బ్రిటిష్ కాలం నాటి ఘన చరిత్ర కలిగిన ఏయూ సివిల్ ఇంజనీరింగ్ విభాగాన్ని పక్కనబెట్టి పనులను ఏపీఈడబ్ల్యూఐడీసీ (APEWIDC)కి కట్టబెట్టడం వెనుక ఉన్న మతలబు ఏమిటీ?. 
2014–19 మధ్య చంద్రబాబు హయాంలో ఇదే ఏపీఈడబ్ల్యూఐడీసీ చేపట్టిన రూసా-1 (RUSA-1) పనుల్లో ఫౌండేషన్లు బలహీనంగా ఉన్నాయని, నాసిరకం నిర్మాణాలు జరిగాయని స్వయంగా అప్పటి వైస్ ఛాన్సలర్ ఫిర్యాదు చేసిన రికార్డులు ఉన్నా, మళ్లీ వారికే పనులు అప్పగించడం వెనుక కాంట్రాక్టులు ఎవరికి కట్టబెట్టాలన్న దాని పై ముందస్తు వ్యూహం దాగి ఉంది. 

హాస్టళ్ల నిర్వహణ గాలికి.. వందల కోట్ల ప్రకటనలు నీటిమూటలే!:
 యూనివర్సిటీ లో కనీస మౌలిక వసతుల లేవు.  క్యాంపస్ డిస్పెన్సరీలో ఆక్సిజన్ అందక ఒక విద్యార్థి మరణించడం, తుపాను సమయంలో వర్షాలకు హాస్టళ్లు కారడంతో విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలపడం కూటమి పాలనలో వర్సిటీ దుస్థితికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. 

నిధుల మళ్లింపు ఆరోపణలు: 
శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.500 కోట్ల నిధులు ఇప్పటివరకు విడుదల కాలేదు, పైగా వర్సిటీకి చెందిన సుమారు రూ.300 కోట్ల నిధులను స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు మళ్లించారన్న అంశంపై ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోంది. దీనిపై సమాధానం చెప్పాలి. 

వైయ‌స్ఆర్‌సీపీ  పాలనలో... :
2019–2024 మధ్య వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రెడ్డి హయాంలో ఏయూ దేశంలోనే 3వ స్థానంలో నిలిచి, ఏడేళ్ల కాలపరిమితితో 'న్యాక్ A++' గ్రేడ్ సాధించింది. నేడు కూటమి పాలనలో ఏయూలో అధ్వాన్న పరిస్థితులు నెలకొన్నాయి. 

ఎంక్వైరీ కమిషన్ వేయాలి-లేదంటే ఉద్యమం తప్పదు: 
ఈ నేపథ్యంలో 2014 నుంచి నేటి వరకు జరిగిన అన్ని నిర్మాణాలపై స్వతంత్ర నిపుణుల కమిటీతో విచారణ జరిపించడంతో పాటు... పనుల నాణ్యతా పరీక్షలను బహిర్గతం చేయాలని రాజీవ్ గాంధీ డిమాండ్ చేశారు. మరోవైపు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, స్థానిక ప్రజా ప్రతినిధులు పెంచిన అంచనాలపై స్పష్టమైన ప్రకటన  చేయకపోతే విద్యార్థి, ప్రజా సంఘాలతో కలిసి విశాఖ వేదికగా పెద్దఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.

Back to Top