తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని రూరల్ మండలం అరుళ్ల పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్న వార్తలతో స్థానికంగా ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో వైయస్ఆర్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వడ్డీ రఘురామ్ నాయుడు పులి సంచరిస్తున్న ప్రాంతాన్ని సందర్శించి, గ్రామస్థులతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పులి ఎక్కడ కనిపించింది, ఏయే ప్రాంతాల్లో సంచరిస్తోంది, ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటనే వివరాలను గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి పులి కదలికలను గుర్తించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. పులి సంచారంపై నిరంతరం నిఘా ఉంచి, గ్రామస్థులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. ప్రజలు భయాందోళనలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని, పులి కనిపించినప్పుడు దాని దగ్గరకు వెళ్లడం, గుంపులుగా వెంబడించడం వంటి చర్యలకు పాల్పడవద్దని రఘురామ్ నాయుడు సూచించారు. పులి కదలికలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేయాలని కోరారు. ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.