తాడేపల్లి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులకు లీగల్ సెల్ రక్షణ కవచంలా నిలవాలని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. నామినేషన్ దాఖలు నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలో అభ్యర్థులకు పూర్తి న్యాయపరమైన అండ అందించాలని సూచించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన పార్టీ లీగల్ సెల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని లీగల్ సెల్ సాధారణ అనుబంధ విభాగంగా కాకుండా, ఎన్నికల ప్రక్రియను న్యాయపరంగా పర్యవేక్షించే వ్యవస్థగా పనిచేయాలని సజ్జల సూచించారు. 2024 ఎన్నికల అనంతరం పార్టీ కార్యకర్తలు తప్పుడు కేసులు, దాడులు, వేధింపులు ఎదుర్కొన్న సందర్భాల్లో లీగల్ సెల్ అండగా నిలిచిందని అభినందించారు. ఎన్నికల సమయంలోనూ కార్యకర్తలకు భరోసా కల్పించేలా ముందస్తు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని కోరారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అభ్యంతరాలు ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తికాకముందే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం తొందరపడుతోందని సజ్జల విమర్శించారు. తుది ఓటర్ల జాబితా అందుబాటులోకి రాకముందే ఎన్నికలకు వెళ్తే కొత్తగా ఓటు హక్కు పొందినవారి హక్కులకు విఘాతం కలిగే అవకాశం ఉందని అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ నివేదికను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, రిజర్వేషన్ల శాతం నిర్ణయానికి ప్రాతిపదిక ఏమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. నామినేషన్ దశ నుంచే అప్రమత్తత ఎన్నికల్లో నామినేషన్ దశ కీలకమని, కుల ధ్రువీకరణ పత్రాలు, ఎన్‌ఓసీలు, ఇతర అవసరమైన ధ్రువపత్రాల విషయంలో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందుగానే సిద్ధం కావాలని సజ్జల సూచించారు. అభ్యర్థులతో పాటు ప్రత్యామ్నాయ అభ్యర్థులను కూడా సిద్ధంగా ఉంచాలని, ప్రతి గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు న్యాయవాదుల వివరాలను సేకరించి అందుబాటులో ఉంచాలని చెప్పారు. జిల్లా స్థాయిలో లీగల్ వార్‌రూమ్‌లు, నియోజకవర్గ స్థాయిలో టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సమస్యలు తలెత్తిన వెంటనే రాష్ట్ర కార్యాలయానికి సమాచారం చేరేలా సమన్వయ వ్యవస్థ ఉండాలని, అవసరమైతే రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని లేదా న్యాయస్థానాలను ఆశ్రయించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. సున్నిత ప్రాంతాలు, నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లపై ముందుగానే దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి ఘటనకు ఆధారాలు సేకరించాలి ఎన్నికల సమయంలో అధికారులు, పోలీసులు లేదా ఇతరుల నుంచి చట్టవిరుద్ధ చర్యలు ఎదురైతే వాటిని ఆధారాలతో నమోదు చేయాలని సజ్జల చెప్పారు. ప్రతి ఫిర్యాదు, ఘటనకు సంబంధించిన వివరాలను డిజిటల్ రూపంలో భద్రపరచి, అవసరమైనప్పుడు న్యాయపరమైన చర్యలకు ఉపయోగించాలని సూచించారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చే సమాచారాన్ని సమన్వయంతో సంబంధిత వేదికల ద్వారా ప్రజలకు తెలియజేయాలని అన్నారు. అభ్యర్థులకు న్యాయవాదులు వెన్నుముకగా నిలవాలి: చెవిరెడ్డి వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తలు కేసులు, అరెస్టులు, వేధింపులు ఎదుర్కొన్న సమయంలో లీగల్ సెల్ అండగా నిలిచిందన్నారు. పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన న్యాయవాదులకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలని కోరారు. మరో ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ, నామినేషన్ పత్రాల తయారీ నుంచి దాఖలు వరకు అభ్యర్థులకు న్యాయవాదులు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్ సర్టిఫికెట్లు, ఇతర అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేయించాలని, నామినేషన్ పత్రాలను స్కాన్ చేసి భద్రపరచాలని అన్నారు. ఏదైనా నామినేషన్ తిరస్కరణకు గురైతే వెంటనే న్యాయపరంగా స్పందించాలని పిలుపునిచ్చారు. 24 గంటల న్యాయసహాయం అందుబాటులో ఉండాలి: మలసాని లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కుల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. నామినేషన్లు, స్క్రూటినీ, పోలీస్ స్టేషన్లలో ఎదురయ్యే సమస్యలు, రౌడీ షీట్లు, బైండోవర్ కేసుల విషయంలో న్యాయవాదులు చురుకుగా వ్యవహరించాలని సూచించారు. జిల్లా, నియోజకవర్గ కమిటీలను త్వరగా పూర్తి చేసి, అవసరమైన న్యాయసహాయం 24 గంటలూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శులు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పూడి శ్రీహరి, లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు పాల్గొన్నారు.