న‌గ‌రిలో టీడీపీకి షాక్‌

గంగమాపురంలో  50 కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక 

నగరి: చిత్తూరు జిల్లా న‌గ‌రిలో అధికార టీడీపీకి షాక్ త‌గిలింది. విజయపురం మండలం గంగమాపురం గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీకి చేరికలు జరిగాయి. టీడీపీ మండల నాయకుడు చంద్రశేఖర్ నాయుడు ఆధ్వర్యంలో ఆయన అనుచరులు మురుగయ్య, చంగయ్య, రోజా, సభాపతి, లక్ష్మి, మునెమ్మ, సురేష్‌, గోవిందస్వామి తదితరులు సుమారు 50 మంది మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ నాయకురాలు ఆర్కే రోజా సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రోజా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారని, కులం, మతం, పార్టీ అనే తేడా లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించారని పార్టీలో చేరిన నాయకులు పేర్కొన్నారు. విద్య, వైద్యం, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, వృద్ధాప్య పింఛన్ల ద్వారా పేద కుటుంబాలకు అండగా నిలిచారని గుర్తుచేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. వైయ‌స్‌ జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావడంతో పాటు, నగరి నియోజకవర్గంలో రోజాను ఎమ్మెల్యేగా గెలిపించుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

 గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి: ఆర్కే రోజా

వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వంలో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం, విద్యార్థులకు మెరుగైన విద్య, రైతులు, మహిళలు, వృద్ధుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చామని ఆర్కే రోజా తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి ఐక్యంగా కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో విజయపురం మండల పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Back to Top