అనంతపురం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడులు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఘటనలపై మాజీ మంత్రి శైలజానాథ్, వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ జిల్లా కలెక్టర్ ఆనంద్‌ను కలిసి వివరించారు. ఎన్నికల సమయంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేలా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతపురం నగరంలోని 39వ డివిజన్‌లో వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు ఆనంద్, శ్రీకాంత్‌లపై మాజీ డిప్యూటీ మేయర్ గంపన్న వర్గీయులు చేసిన దాడి ఘటనను సాకే చంద్రశేఖర్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. డివిజన్ పరిధిలో టీడీపీ నేతలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వివరించారు. గతంలో సాకే గంపన్న, ఆయన కుమారులు, అనుచరులు చేసిన దౌర్జన్యాలనూ కలెక్టర్‌కు తెలియజేశారు. శింగనమల నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చోటుచేసుకుంటున్న పరిణామాలను మాజీ మంత్రి శైలజానాథ్ కలెక్టర్‌కు వివరించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు, ఓటర్లు ఎలాంటి భయాందోళనలు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఆనంద్ ఎన్నికలు సజావుగా జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సాకే చంద్రశేఖర్ జిల్లా ఎస్పీ జగదీష్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను కాపాడి, ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం కల్పించాలని కోరారు.