తాడేపల్లి: మేనకోడలు అంజలి వివాహం పట్ల తనకున్న ప్రేమను, ఆమె భవిష్యత్తుపై ఉన్న ఆకాంక్షలను వ్యక్తం చేస్తూనే, కుటుంబ భద్రత, గోప్యతకు సంబంధించిన ఆందోళనలను వివరిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి షర్మిలకు లేఖ రాశారు. అంజలి జీవితాంతం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొంటూనే, బెంగళూరులోని తన నివాసంలో వివాహం నిర్వహించడం వల్ల తలెత్తే భద్రతాపరమైన సమస్యలను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ లేఖను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీడియాకు విడుదల చేసింది. అంజలి సంతోషం కావాలి.. భద్రతను విస్మరించలేను గత ఏడేళ్లలో ఎన్ని పరిణామాలు చోటుచేసుకున్నా అంజలి సంతోషంగా ఉండాలని, ఆమె వివాహం జీవితాంతం మధురమైన జ్ఞాపకంగా మిగలాలని వైయస్ జగన్ తన లేఖలో ఆకాంక్షించారు. అంజలి పట్ల తనకు ఎంతో ప్రేమ ఉందని, ఆమెకు మంచి జరగాలన్నదే తన కోరిక అని వివరించారు. అయితే, తాను ప్రస్తుతం నివసిస్తున్న బెంగళూరు ఇంట్లో వివాహం నిర్వహిస్తే అతిథులు, క్యాటరింగ్ సిబ్బంది, అలంకరణ బృందాలు, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు సహా పెద్ద సంఖ్యలో వ్యక్తులు రాకపోకలు సాగిస్తారని పేర్కొన్నారు. ఇంటి ప్రాంగణం, పరిసర ప్రాంతాల ఫొటోలు, వీడియోలు బయటకు వెళ్లడం వల్ల తనతో పాటు కుటుంబ సభ్యుల భద్రత, గోప్యతకు సమస్యలు తలెత్తవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. మరో వేదికను ఎంచుకోవాలని విజ్ఞప్తి తన అభ్యంతరాలను ఇప్పటికే పలువురి ద్వారా తెలియజేసినప్పటికీ, బెంగళూరు నివాసంలోనే వివాహం నిర్వహించాలనే నిర్ణయం కొనసాగడం తనకు బాధ కలిగించిందని జగన్ లేఖలో పేర్కొన్నారు. ఈ నిర్ణయం తీసుకోవడం తనకు సులభం కాదని, అంజలి పట్ల ప్రేమాభిమానాలు ఉన్నప్పటికీ కుటుంబ భద్రతను నిర్లక్ష్యం చేయలేనని వివరించారు. కన్వెన్షన్ సెంటర్ లేదా ప్రత్యేక వివాహ వేదికను ఎంచుకోవడం ఇష్టం లేకపోతే, హైదరాబాద్‌లోని తన లోటస్ పాండ్ నివాసంలో వివాహం నిర్వహించుకోవచ్చని ప్రత్యామ్నాయాన్ని సూచించారు. అంజలి వివాహం ఆనందంగా, ప్రత్యేకంగా జరగాలని తాను కోరుకుంటున్నానని, అందుకు తనవంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని జగన్ తెలిపారు. అదే సమయంలో తన పరిస్థితిని, భద్రతపై ఉన్న ఆందోళనలను కూడా అర్థం చేసుకోవాలని షర్మిలకు విజ్ఞప్తి చేశారు. అంజలి భవిష్యత్తుపై శుభాకాంక్షలు తెలుపుతూనే, కుటుంబ భద్రతకు సంబంధించిన అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నది ఈ లేఖలోని ప్రధాన సందేశం. వైయస్ జగన్ రాసిన లేఖ ఇలా.. తేదీ: 09 అక్టోబర్ 2026 ప్రియమైన శర్మి, అంజలి వివాహం గురించి తెలిసి నాకు చాలా సంతోషంగా ఉంది. గత ఏడేళ్లలో ఎన్ని పరిణామాలు జరిగినప్పటికీ, అంజలి జీవితాంతం సంతోషంగా, ప్రేమానురాగాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే, నా అభ్యంతరాలను పట్టించుకోకుండా, బెంగళూరులోని నా నివాసంలోనే వివాహం నిర్వహించాలని మీరు ఇంకా భావిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. నేను నివసిస్తున్న ఇంటి ప్రాంగణంలో వివాహం నిర్వహించడం వల్ల భద్రతాపరమైన తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఇప్పటికే పలువురి ద్వారా మీకు తెలియజేశాను. వివాహం వంటి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు ఇంటికి వస్తారు. వివిధ సేవలు అందించే సిబ్బంది, క్యాటరింగ్ సిబ్బంది, పూలు మరియు అలంకరణ బృందాలు, ఈవెంట్ నిర్వహణ సిబ్బంది, వీడియో చిత్రీకరణ చేసే వారు, ఫొటోగ్రాఫర్లు, అతిథులు ఇలా ఎంతోమంది ఇంట్లోకి వస్తూ పోతుంటారు. వారిలో చాలామంది మనకు తెలియని వ్యక్తులే ఉంటారు. ఇంతమంది రాకపోకలు సాగించడం, ఇంటి ప్రాంగణం, పరిసర ప్రాంతాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయట ప్రచారంలోకి రావడం తీవ్రమైన భద్రతాపరమైన ఆందోళనలకు దారితీస్తుంది. ఈ నిర్ణయం తీసుకోవడం నాకు అంత సులభం కాలేదని దయచేసి అర్థం చేసుకోండి. జిలి పెరిగి పెద్దవడాన్ని నేను చూశాను. ఆమెకు జీవితంలో అన్నీ మంచే జరగాలని కోరుకుంటున్నాను. అయినప్పటికీ, భద్రత, గోప్యతకు సంబంధించిన ప్రమాదాలను విస్మరించలేం. హర్ష లేదా వర్ష వివాహాల విషయంలోనూ నేను ఇలాగే వ్యవహరించేవాడిని. ప్రస్తుతం నేను ఇక్కడే నివసిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమం వల్ల అనవసరమైన ప్రచారంతో పాటు భద్రతాపరమైన సమస్యలు కూడా తలెత్తుతాయి. చివరికి ఇది నా ఇల్లు. ఇక్కడ నేను, నా కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉండేలా చూసుకోవడం నా బాధ్యత. గోప్యత, భద్రతకు సంబంధించిన వాస్తవమైన సమస్యలను పలువురి ద్వారా మీకు తెలియజేసినప్పటికీ, నా అభ్యంతరాలను, ఆందోళనలను పట్టించుకోకుండా మీరు ముందుకు సాగడం నాకు బాధ కలిగించింది. కాబట్టి, మరోసారి నా పరిస్థితిని అర్థం చేసుకుని, వివాహానికి వేరే వేదికను ఎంచుకోవాలని కోరుతున్నాను. రాజా వివాహం విషయంలో చేసినట్లుగా కన్వెన్షన్ సెంటర్‌ను లేదా ప్రత్యేక వివాహ వేదికను ఎంచుకోవడం మీకు ఇష్టం లేకపోతే, హైదరాబాద్‌లోని నా లోటస్ పాండ్ నివాసాన్ని ఉపయోగించుకోవచ్చని కూడా నేను ప్రతిపాదించాను. ఆ అవకాశం ఇప్పటికీ ఉంది. జిలి వివాహం ఆమె జీవితంలో ఎంతో మధురమైన జ్ఞాపకంగా మిగలాలని నేను నిజంగా కోరుకుంటున్నాను. ఆ రోజు ప్రత్యేకంగా ఉండేందుకు నా వంతుగా చేయగలిగిన ప్రతి ప్రయత్నమూ చేస్తాను. అయితే, ఈ విషయంలో నా కోణం నుంచి కూడా మీరు ఆలోచించాలని కోరుతున్నాను. ఇట్లు, వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి