ఎన్టీఆర్ జిల్లా: గంపలగూడెం మండలం సొబ్బాల గ్రామంలో ఎంపీటీసీ నామినేషన్ వేసేందుకు వెళ్తున్న వైయస్ఆర్‌సీపీ దళిత కార్యకర్తలు దారెల్లి సందీప్, గద్దల రవీంద్రపై టీడీపీకి చెందిన అగ్రవర్ణ నాయకులు దాడి చేసి, ఇంట్లోకి పిలిచి కట్టేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటన కలకలం రేపింది. బాధితులు తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, వైయస్ఆర్‌సీపీ తిరువూరు నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాస్ వారిని పరామర్శించి ఘటనను తీవ్రంగా ఖండించారు. పాత కేసులు ఉన్నాయని, వాటిని పరిష్కరించుకుందామని పిలిచి కార్యకర్తలను కట్టేసి దారుణంగా కొట్టడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని నల్లగట్ల స్వామిదాస్ స్పష్టం చేశారు. జరిగిన ఘటనను పోలీసులకు వివరించిన బాధితులను తిరిగి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, రాత్రి ఆసుపత్రికి తీసుకెళ్తామని చెప్పి మళ్లీ స్టేషన్‌కు తీసుకెళ్లి, దెబ్బలు ఏమీ లేవంటూ ఇంటికి పంపించారని పేర్కొన్నారు. దళితులపై దాడులను సహించేది లేదు తప్పు చేసిన వారిని చట్టప్రకారం శిక్షించాలి తప్ప, బాధితుల పట్ల పోలీసులు సైతం ఈ విధంగా వ్యవహరించడం రాజ్యాంగ విరుద్ధమని స్వామిదాస్ మండిపడ్డారు. కూటమి నాయకుల తరఫున పోలీసులు కక్ష తీర్చుకుంటున్నారా అని ప్రశ్నించారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ, కూటమి నాయకులు చెప్పినట్లు నడుచుకుంటామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో దళిత కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడం, నామినేషన్ల ప్రక్రియకు ఆటంకాలు కలిగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని నల్లగట్ల స్వామిదాస్ స్పష్టం చేశారు. దళితులపై దాడులకు పాల్పడిన వారితో పాటు బాధితుల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరించిన పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కూటమి నాయకులను హెచ్చరించారు.