తాడేపల్లి: కర్నూలు మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నాయకులు ఎం.ఎ. అబ్దుల్ గఫూర్ గారు, సీపీఎం రాష్ట్ర నాయకురాలు పి. నిర్మల గార్ల పెద్ద కుమారుడు కిరణ్ అమెరికాలో ఆకస్మికంగా మృతి చెందడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ఉన్నత విద్యను అభ్యసించి, అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రముఖ సంస్థలో సీనియర్ డేటా సైంటిస్ట్‌గా పనిచేస్తూ మంచి భవిష్యత్తు కలిగిన కిరణ్ అకాల మరణం అత్యంత బాధాకరమని శ్రీ వైయస్ జగన్ పేర్కొన్నారు. కన్నకొడుకును కోల్పోయిన ఎం.ఎ. అబ్దుల్ గఫూర్ గారు, పి. నిర్మల గార్ల దుఃఖం వర్ణనాతీతమని, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని వారికి, కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు. కిరణ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, అబ్దుల్ గఫూర్ గారు, నిర్మల గారు, వారి కుటుంబ సభ్యులకు వైయస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.