వెన్నుపోటు పార్టీ ఒక విష సంస్కృతికి బీజం

అది వారికే శాపం కావడం కచ్చితంగా ఖాయం

కాసు మహేష్‌రెడ్డి ధ్వజం

పల్నాడు జిల్లా నరసరావుపేటలో తన నివాసంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి.

అధికారం ఎప్పుడూ, ఎవరికి శాశ్వతం కాదు

ఆ విషయాన్ని వెన్నుపోటు పార్టీ గుర్తుంచుకోవాలి

ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికల్లో అక్రమాలు

మీకు స్వేచ్ఛగా ఎన్నికలు జరిపే ధైర్యం లేదు

అందుకే చట్టం మార్చి మీరే సొంతంగా రాసుకోండి

ప్రెస్‌మీట్‌లో కాసు మహేష్‌రెడ్డి చురక

నరసారావుపేట: రాష్ట్రంలో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేస్తోందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి ధ్వజమెత్తారు. ఓటమి భయంతో రాష్ట్రంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో స్థానిక ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని, పోలీసులను శిఖండిలా అడ్డు పెట్టుకుని వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అక్రమ అరెస్టులు, బైండోవర్లు, దొంగ కేసులతో బెదిరింపులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) కూడా పాలకుల కనుసన్నల్లోనే వ్యవహరిస్తోందని ఆక్షేపించారు.
    అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, నేడు అధికార పక్షం మొదలుపెట్టిన ఈ విష సంస్కృతి, కచ్చితంగా రేపు వారికే శాపంగా మారుతుందని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు వంత పాడుతున్న పోలీసు అధికారులపై రేపు తాము అధికారంలోకి రాగానే తప్పకుండా ’సిట్‌’ వేసి విచారణ జరుపుతామని నరసారావుపేటలో మీడియాతో మాట్లాడిన కాసు మహేష్‌రెడ్డి స్పష్టం చేశారు.
ప్రెస్‌మీట్‌లో కాసు మహేష్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

చట్టం మార్చి మీరే రాసేసుకోండి.. ఎన్నికలెందుకు?:
    స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం లేదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్, కలెక్టర్లు, ఎస్పీలు అంతా ప్రభుత్వం నియమించినవారే కాబట్టి వారి కనుసన్నల్లోనే ఈ తంతు నడిపిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతిభద్రతలు కాపాడుతూ ఎన్నికలు జరిపే ఉద్దేశం లేనప్పుడు అసెంబ్లీలో పంచాయతీరాజ్, మున్సిపాలిటీ చట్టాలను సవరించి తీర్మానం చేసేయండి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలే మండల ప్రెసిడెంట్లు, సర్పంచులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు అని చట్టం రాసుకుంటే అయిపోతుంది కదా? అప్పుడు అధికార పక్షానికి ఈ పాట్లు, ప్రజల్లో ఇంతగా అభాసుపాలు కావాల్సిన అవసరం ఉండదు.

పోలీసులే మద్యం బాటిళ్లు పెట్టి కేసులు బనాయిస్తున్నారు:
    పోలీసులను శిఖండిలా ముందుపెట్టి ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా హౌస్‌ అరెస్టులు చేయడం, బైండోవర్ల పేరిట వేధించడం చరిత్రలో ఎన్నడైనా చూశామా? దాచేపల్లిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇంట్లో పోలీసులే రహస్యంగా మద్యం బాటిళ్లు పెట్టించి, మళ్లీ పోలీసులే వచ్చి ’ఇదిగో మద్యం దొరికింది’ అని తప్పుడు కేసులు పెట్టారు. ఆ మద్యం ఎక్కడుందో స్వయంగా పోలీసులే వెతికి చూపిస్తుంటే అభ్యర్థి నిశ్చేష్టుడయ్యాడు.
    గురజాలలో అభ్యర్థిని నామినేషన్‌ రోజు ప్రివెంటివ్‌ అరెస్టు చేశారు, మరుసటి రోజు కూడా నామినేషన్‌ వేయకుండా అడ్డుకునే యత్నం చేశారు. చివరకు దాచేపల్లిలో కోర్టుకెళ్లి నామినేషన్‌ వేస్తే, ఎన్నికల అధికారి స్వయంగా డిపాజిట్‌ కట్టినట్లు రసీదుపై సంతకం పెట్టి ఇచ్చిన తర్వాత.. ఇప్పుడు స్క్రూటినీలో డిపాజిట్‌ కట్టలేదని అక్రమంగా నామినేషన్‌ తిరస్కరిస్తున్నారు. ఇంతకంటే బరితెగింపు మరొకటి ఉంటుందా?.

ఎన్నికల సంఘం పాత్ర శేషన్‌ లా ఉండాలి.. చెంచాలా కాదు:
    రాజ్యాంగబద్ధమైన ఎన్నికల వ్యవస్థ స్వతంత్రంగా పని చేయాలి. ఎన్నికల సంఘం అధికార పార్టీకి చెంచాలా వ్యవహరిస్తుందా లేక టి.ఎన్‌. శేషన్‌లా నిలబడి నిష్పక్షపాతంగా పనిచేస్తుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఐదు కోట్ల మంది ప్రజల ఓటు హక్కును, రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ గారు కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాసే హక్కు ఎవరికీ లేదు. ఎన్నికల కమిషన్‌ ఇప్పటికైనా మేల్కొని రాబోయే మండల, పంచాయతీ ఎన్నికలనైనా స్వేచ్ఛగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి.

అధికారం శాశ్వతం కాదు.. పోలీసులపై ’సిట్‌’ దర్యాప్తు తప్పదు:
    అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారి అక్రమాలకు పాల్పడుతున్న కొందరు పోలీసు అధికారులు తాము రెండేళ్లు ఎంజాయ్‌ చేసి వెళ్లిపోవచ్చని అనుకుంటున్నారు. మీరేమీ అమెరికా వెళ్లిపోరు, ఇక్కడే ఉంటారు. రేపు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే ఈ అక్రమాలు, అక్రమ కేసులన్నింటిపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో (సిట్‌) విచారణ జరిపిస్తాం. ఈరోజు అక్రమ హౌస్‌ అరెస్టులకు వెళ్లిన కానిస్టేబుళ్లే రేపు 164 స్టేట్‌మెంట్లు ఇచ్చి అప్రూవర్లుగా మారి నిజాలు బయటపెడతారు. అధికారులు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి కానీ, అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తకూడదు.

ఇవి ఏకగ్రీవాలు కావు.. ముమ్మాటికీ రాజకీయ ఆత్మహత్యలే:
    రాజకీయాల్లో ప్రత్యర్థుల హత్యలు ఉండవు, నాయకులు చేసుకునే ఆత్మహత్యలే ఉంటాయి అని పెద్దలు చెబుతుంటారు. ఈరోజు టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గురజాల నియోజకవర్గంలో చేస్తున్నది అచ్చంగా రాజకీయ ఆత్మహత్యే. ఏకగ్రీవాలు చేసుకుని తామేదో సాధించామని విర్రవీగుతున్నారు కానీ, ప్రజలు వీరి అరాచకాలను చూసి తీవ్రంగా అసహ్యించుకుంటున్నారు. ఎన్నికలు జరిగితే రోడ్లు, తాగునీరు వంటి పనులతో పాటు ప్రభుత్వ పథకాలు అందుతాయని ఆశపడ్డ ప్రజల హక్కులను కాలరాశారు. రానున్న ఎన్నికల్లో గురజాలలో వైఎస్సార్సీపీ 30 నుంచి 40 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని కాసు మహేష్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Back to Top