ఆత్మకూరులో నామినేషన్ల పరిశీలన వేళ ఉద్రిక్తత

వైయ‌స్ఆర్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థి డాక్టర్‌ ప్రియాంక నామినేషన్‌ పత్రాలు చించివేత

మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆందోళన 

నంద్యాల జిల్లా : ఆత్మకూరు మున్సిపల్‌ కార్యాలయం వద్ద నామినేషన్ల పరిశీలన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైయ‌స్ఆర్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థి డాక్టర్‌ ప్రియాంక నామినేషన్‌ పత్రాలను టీడీపీ నాయకుడు యుగంధర్‌రెడ్డి చించివేశారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మున్సిపల్‌ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు.

ఈ క్రమంలో శిల్పా చక్రపాణి రెడ్డి వర్గీయులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మాజీ ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నించారని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు పేర్కొన్నాయి. నామినేషన్ల పరిశీలన సమయంలో దాడులకు దిగడం, చైర్మన్‌ అభ్యర్థి నామినేషన్‌ పత్రాలను చించివేయడం ప్రజాస్వామ్య ప్రక్రియకు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ ఘటనతో ఆత్మకూరు పట్టణ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఘటనపై మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నామినేషన్ల పరిశీలనను నిష్పాక్షికంగా నిర్వహించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

Back to Top