నామినేషన్లు వేయించలేని దుస్థితిలో పోలీస్‌ వ్యవస్థ 

దర్శిలో నామినేషన్లు అడ్డుకున్న పోలీసుల తీరు సిగ్గుచేటు

ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి «ఫైర్‌

ఒంగోలులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి

నామినేషన్లు వేయనీయకుండా ఎన్నికలు నిర్వహించడం దేనికి?

సూటిగా ప్రశ్నించిన బూచేపల్లి శివప్రసాదరెడ్డి

దర్శి డీఎస్పీ వ్యవహరించిన తీరు అమానుషం

నామినేషన్‌ వేయిస్తామని నమ్మించి మోసం చేశారు

నన్ను హౌస్‌ అరెస్ట్‌ చేసి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై లాఠీచార్జి

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇప్పట్నుంచే బెదిరింపులు

స్థానికంగా లేని వ్యక్తులపై చాలామందిపై అక్రమ కేసులు

ప్రెస్‌మీట్‌లో బూచేపల్లి శివప్రసాదరెడ్డి వెల్లడి

ఒంగోలు: వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ అరాచక పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అవుతోందని, ఒక అభ్యర్థికి రక్షణ కల్పించి నామినేషన్‌ వేయించలేని స్థితిలో పోలీసు వ్యవస్థ ఉండటం సిగ్గుచేటని ప్రకాశం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికలు సజావుగా జరిగితే కూటమి ప్రభుత్వం అన్ని చోట్లా ఓడిపోతుందనే భయంతోనే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోలేక చంద్రబాబు  ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ఉపయోగించి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను, ఇన్‌చార్జ్‌లను కట్టడి చేస్తూ సీట్లను బలవంతంగా కైవసం చేసుకోవాలని చూస్తోందని తెలిపారు.
    దర్శి మున్సిపాలిటీలో అక్టోబర్‌ 17న నామినేషన్లు వేయడానికి వెళ్లిన తమ అభ్యర్థులపై దాడి చేసి, నామినేషన్‌ పత్రాలను చించివేసి అడ్డుకున్నారని బూచేపల్లి శివప్రసాదరెడ్డి వెల్లడించారు. అక్కడ పోలీస్‌ ఉన్నతాధికారులు ఉన్నా, అభ్యర్థులకు నామినేషన్‌ వేసే అవకాశం కల్పించకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని గుర్తు చేశారు. అభ్యర్థులను ఆర్‌ఓ దగ్గరకు తీసుకెళ్లి నామినేషన్లు వేయిస్తామని పోలీసులు నమ్మించి మోసం చేశారని.. చివరకు తనను హౌస్‌ అరెస్టు చేశారని ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన బూచేపల్లి శివప్రసాదరెడ్డి తెలిపారు.

ప్రెస్‌మీట్‌లో బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

దర్శి డీఎస్పీ తీరు అత్యంత అమానుషం: 
    దర్శిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడమే కాకుండా, మా పార్టీ కార్యకర్తలపై లాఠీచార్జి చేసి భయభ్రాంతులకు గురి చేశారు. దర్శి డీఎస్పీ వ్యవహరించిన తీరు అత్యంత అమానుషం. అభ్యర్థులకు రక్షణ కల్పించి నామినేషన్‌ కార్యాలయానికి తీసుకెళ్లి నామినేషన్లు వేయిస్తామని పోలీసులు మమ్మల్ని నమ్మించి చివరకు మోసం చేశారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని స్థానికంగా లేని వ్యక్తులపై కేసులు బనాయిస్తూ ప్రతిపక్ష అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నామినేషన్లతో సంబంధం లేని పోసిం మధుసూదన్‌రెడ్డితో పాటు, అమెరికా నుంచి వచ్చిన గూడ శ్రీధర్‌రెడ్డి సహా, ఎడమగండి గోపీనాథ్‌రెడ్డి, చింతలపూడి శ్రీనివాసరెడ్డి, బత్తుల వెంకటేశ్వర్లు, బండి గోపాల్‌రెడ్డి తదితరులపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు.
    ముఖ్యంగా ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తారనే భయంతో, ఘటన జరిగిన సమయంలో అక్కడ లేని గూడ శ్రీధర్‌రెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు. కనిగిరిలోనూ నామినేషన్ల పరిశీలన సమయంలో మా అభ్యర్థులను, వారి పత్రాలను అడ్డుకుంటున్న టీడీపీ వర్గాలు, పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు వెనక్కి తగ్గవు. ఎన్ని అడ్డంకులు సష్టించినా ధైర్యంగా ఎదుర్కొని ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడతాం.

ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధంగా ఎన్నికలు:
    రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న తీరు పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉంది. అసలు పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా, నామినేషన్లు కూడా వేయనీయకుండా అడ్డుకుంటే ఎన్నికలు నిర్వహించడం ఎందుకు? రాష్ట్ర ఎన్నికల సంఘం, అధికార కూటమి, పోలీసు యంత్రాంగం కుమ్మక్కై ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్ర పోలీసు వ్యవస్థపై నమ్మకం లేని పరిస్థితుల్లోనే మా పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ గారు న్యాయస్థానాల ద్వారా కేంద్ర బలగాలను కోరాల్సి వచ్చింది. దర్శిలో జరిగిన ఘటనలపై సమగ్ర విచారణ జరిపి, నామినేషన్లకు అడ్డంకులు సృష్టించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. స్థానికంగా లేని వ్యక్తులపై కేసులు పెట్టడం, కార్యకర్తలపై లాఠీచార్జి చేయడం, అభ్యర్థులను నామినేషన్లకు వెళ్లకుండా అడ్డుకోవడం వంటి ఘటనలపై నిష్పాక్షిక విచారణ జరగాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకుని ప్రతి అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పించాలి. అవసరమైతే కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలి. ఇంకా రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ తీరుపై సీబీఐ విచారణ జరపాలని బూచేపల్లి శిపప్రసాదరెడ్డి డిమాండ్‌ చేశారు.

Back to Top