జైలు నుంచి ఎమ్మెల్యే విరుపాక్షి విడుదల

హైకోర్టు బెయిల్‌తో ఊరట.. తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారన్న విరుపాక్షి

కర్నూలు: ఆలూరు వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే విరుపాక్షి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శనివారం కర్నూలు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనతో పాటు తమ్ముడు శ్రీరాములు, కుమారుడు చంద్రశేఖర్, మరో 25 మంది విడుదలయ్యారు. వైయ‌స్ఆర్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్‌వీ మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి తదితర నాయకులు జైలు వద్దకు చేరుకుని విరుపాక్షికి స్వాగతం పలికారు.

అక్రమ కేసులతో నిర్బంధించారన్న విరుపాక్షి

విడుదల అనంతరం ఎమ్మెల్యే విరుపాక్షి మాట్లాడుతూ, తనను 69 రోజుల పాటు జైలులో నిర్బంధించారని, తనపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసులు పెట్టారని ఆరోపించారు. ఆగస్టు 1న చిప్పగిరి పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం తదితర అభియోగాలతో కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.

కష్టకాలంలో జగన్ అండగా నిలిచారు

నేను కష్టకాలంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాకు, నా కుటుంబానికి అండగా నిలిచారు. నా కుటుంబానికి, పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. కార్యకర్తను పరామర్శించడానికి వెళ్లిన నాపై కేసులు పెట్టి జైలుకు పంపించారు అని విరుపాక్షి అన్నారు.

వాల్మీకుల సంక్షేమంపై వివక్ష చూపుతున్నారు

వాల్మీకులను ఎస్సీ జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చి, వారిని ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారని విరుపాక్షి విమర్శించారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో వాల్మీకులకు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు.

పోలీసులపై న్యాయపోరాటం చేస్తాం

తనపై నమోదైన కేసుల వెనుక చంద్రబాబు, నారా లోకేశ్, ఆలూరు టీడీపీ ఇన్‌ఛార్జి వైకుంఠ జ్యోతి తదితరుల పాత్ర ఉందని విరుపాక్షి ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్లతో కేసులు నమోదు చేసిన పోలీసులపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

Back to Top