బీసీ రిజ‌ర్వేష‌న్లపై ఇప్ప‌టికీ  చంద్రబాబు పచ్చి మోసం

మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ధ్వ‌జం

రాజ‌మండ్రిలోన త‌న క్యాంప్ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి,  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 
తూర్పు గోదావ‌రి జిల్లా అధ్య‌క్షుడు చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌

తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్‌లో బీసీ బిల్లును ఎందుకు చేర్చడం లేదు?

బీసీలకు జరిగిన అన్యాయంపై మంత్రులు సమాధానం చెప్పాలి

చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ డిమాండ్ 

రాజ‌మండ్రి రూర‌ల్‌:  కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి, బీసీల రిజర్వేషన్ల హామీని అమలు చేయడం కోసం చ‌ట్ట సవరణకు అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వైఎస్సార్సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సూటిగా ప్రశ్నించారు. రాజమండ్రిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో తన అనుయాయుల ప్రయోజనాల కోసం చట్టాలు తెచ్చుకోగలిగిన చంద్రబాబుకు, తనను అధికారంలోకి తెచ్చిన బీసీల కోసం అవే చట్టబద్ధమైన చర్యలు చేపట్టడానికి ఎందుకు మనసు రాలేదని నిలదీశారు. ఎన్నికల సమయంలో 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని నమ్మబలికిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక ఆ హామీని నీరుగార్చి బీసీలకు తీవ్రమైన వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. గతంలో జగన్ గారి ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు ఎక్కడా అన్యాయం జరగకుండా అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తే, నేడు వెన్నుపోటు పార్టీ కూట‌మి ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని దుయ్యబట్టారు. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక, ఎంపిరికల్ డేటా, రిజర్వేషన్లపై న్యాయస్థానాల తీర్పుల విషయంలో ప్రభుత్వం అనుసరించిన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీసీలకు న్యాయం చేయడానికి కేంద్రంలో తనకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించకుండా, హామీలను అమలు చేయడంలో చంద్రబాబు వెనకడుగు వేస్తున్నారని ఆక్షేపించారు. అశాస్త్రీయ విధానాలతో బలహీన వర్గాల హక్కులను కాలరాస్తున్న పాలకులకు బీసీ సమాజం త్వరలోనే తగిన గుణపాఠం చెబుతుందని చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ హెచ్చరించారు.

ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే...

త‌మిళ‌నాడు త‌ర‌హాలో ఎందుకు చేయడం లేదు?:  
గతంలో చంద్రబాబు తన రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే బిర్రు ప్రతాప్ రెడ్డి వంటి వారి ద్వారా కోర్టుల్లో పిటిషన్లు వేయించి, బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేలా కుట్రలు చేశాడు. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న ఈ ప్రభుత్వం తమిళనాడు తరహాలో బీసీ రిజర్వేషన్లపై చట్టసవరణ చేసి 9వ షెడ్యూల్‌లో చేర్చే అవకాశం ఉన్నప్పటికీ ఆ పని ఎందుకు చేయడం లేదు? అబద్ధాలతో రాజకీయాలు చేస్తూ, అధికారం దక్కించుకున్న తర్వాత ప్రజలను వంచించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ప్రజాస్వామ్యంలో అబద్ధాల ద్వారా అధికారాన్ని సాధించి, బలహీన వర్గాల జీవితాలతో ఆడుకుంటే సమాజానికి క్యాన్సర్‌లాంటి ప్రమాదం పొంచి ఉంటుంది. అచ్చెన్నాయుడు, పార్థసారధి, అనగాని సత్యప్రసాద్ వంటి బీసీ మంత్రులు, నాయకులు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి తమ ప్రభుత్వాన్ని నిలదీయాలి. త్వరలోనే ఈ రిజర్వేషన్ల మోసానికి సంబంధించి మరిన్ని సంచలన విషయాలతో మరోసారి ప్రత్యేక ప్రెస్‌మీట్ పెట్టి చంద్రబాబు డ్రామాలను పూర్తిగా ఎండగడతాం. 

ప్ర‌జ‌ల‌ను చంద్ర‌బాబు త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాడు: 
చంద్రబాబు బీసీలకు వెన్నుపోటు పొడిచారు.. ఈ చరిత్రలో ఆ మచ్చ మిగిలిపోతుంది. ఎన్నికలకు ముందు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి, ఇప్పుడు 24 శాతం, 27 శాతం అంటూ భిన్నమైన వాదనలు వినిపించడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే. 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయడంపై న్యాయపరమైన పరిమితులు ఉన్న నేపథ్యంలో, శాస్త్రీయమైన కుల గణాంకాలు, ఎంపిరికల్ డేటా, డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా ముందుకు వెళ్లాల్సి ఉండగా, ప్రభుత్వం ఆ ప్రక్రియను సక్రమంగా పూర్తి చేయలేదు. కమిషన్ నివేదికను పూర్తిగా ఆమోదించకుండా, అందులోని కొన్ని అంశాలను మాత్రమే తీసుకుని జీవో జారీ చేయడం వల్లే న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు తగిలాయి. పార్ల‌మెంట్‌ను ప్ర‌త్యేకంగా సమావేశ ప‌రిచి అమరావతికి చట్టబద్ధత తీసుకురాగా, బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం రాజ్యాంగపరమైన పరిష్కారం ఎందుకు తీసుకురాలేక పోయారో చంద్రబాబు స‌మాధానం చెప్పాలి. 

అబ‌ద్ధాల‌తో పాల‌న క్యాన్స‌ర్ క‌న్నా ప్ర‌మాదం:  
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రిజర్వేషన్ల పరిమితుల కారణంగా ఎక్కడైనా తగ్గుదల ఏర్పడిన సందర్భాల్లో పార్టీ పరంగా బీసీలకు అదనపు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఆ మేర‌కు మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ పదవుల్లో బీసీలకు గణనీయమైన అవకాశాలు కల్పించడం జ‌రిగింది. చంద్రబాబు ప్రభుత్వం అబద్ధపు ప్రచారంతో అధికారంలోకి వచ్చి, ఇప్పుడు హామీల అమలులో ద్రోహానికి పాల్పడుతోంది.  అబద్ధాలతో అధికారం సాధించి, అబద్ధాలతోనే పాలన సాగిస్తే సమాజానికి క్యాన్సర్‌లాంటి ప్రమాదం. బీసీ మంత్రులు తమ ముఖ్యమంత్రిని నిలదీసి, బీసీల హక్కుల కోసం కేంద్రంతో పోరాడాలి. రిజర్వేషన్ల అంశంపై న్యాయనిపుణులు, బీసీ సంఘాలు సమగ్రంగా చర్చించాలి. తమిళనాడు తరహాలో రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చే దిశగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ డిమాండ్ చేశారు.

Back to Top