తిరువూరు: వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ తిరువూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి నల్లగట్ల స్వామిదాస్ కోరారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద గ్రామ రెవెన్యూ సహాయకులు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం 25వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఆయన దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉద్యోగుల ఇబ్బందులు సెప్టెంబర్ 16 నుంచి వీఆర్ఏలు తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని స్వామిదాస్ అన్నారు. పే స్కేల్ అమలు, నామినీలకు వీఆర్ఏ పోస్టుల కల్పన, గ్రేడ్-2 సెక్రటేరియట్ కింద పదోన్నతులు, పదోన్నతుల కోటాను 30 శాతం నుంచి 70 శాతానికి పెంపు వంటి డిమాండ్లను వెంటనే పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. హామీలను అమలు చేయాలి యువగళం పాదయాత్ర సమయంలో వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడం లేదని స్వామిదాస్ విమర్శించారు. మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడాలని అన్నారు. ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టి, వారి ఆందోళనకు ముగింపు పలకాలని స్వామిదాస్ కోరారు. ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు గజ్జల సీతారామయ్య, పరసా శ్రీనివాసరావు, వెలుగొటి ఆదినారాయణ, కలసాని నాగేశ్వరరావు, పరసా నెహ్రూ, కొంగల రవీంద్ర, రామవరపు ప్రసాద్, మంచల మల్లేశ్వరరావు, సింగపోగు రాంబాబు, తీగల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.