రిజ‌ర్వేష‌న్ల‌పై ఎస్సీ, ఎస్టీల‌కు స్ప‌ష్ట‌త ఇవ్వాలి

మేయ‌ర్లు, జెడ్పీ చైర్మ‌న్లు, కార్పొరేట‌ర్‌, మున్సిప‌ల్ చైర్మ‌న్ల స్థానాల‌పై ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న చేయాలి

మాజీ మంత్రి సాకె శైల‌జానాథ్ డిమాండ్‌

అనంత‌పురం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సాకె శైల‌జానాథ్ 

ఎస్సీలకు 16.66 శాతం, ఎస్టీలకు 7.5 శాతం రిజర్వేషన్లను ఖచ్చితంగా అమలు చేయాలి

బీసీల‌కు 34 శాతం రిజ‌ర్వేష‌న్ల హామీని చ‌ట్ట‌బ‌ద్ధంగా నెర‌వేర్చాలి 

సామాజిక న్యాయం మాటల్లో కాకుండా ఆచ‌ర‌ణ‌లో చూపించాలి

కుల గణన, సర్వేల పేరుతో రిజర్వేషన్లను కుదించే కుట్రలను స‌హించేది లేదు

ప‌్రభుత్వానికి మాజీ మంత్రి సాకె శైల‌జానాథ్ హెచ్చ‌రిక  

అనంత‌పురం: స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఎస్సీ, ఎస్టీలకు దక్కాల్సిన వాటాపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని, ఎస్సీలకు 16.66 శాతం, ఎస్టీలకు 7.5 శాతం రిజర్వేషన్లను ఖచ్చితంగా అమలు చేయాలని మాజీ మంత్రి సాకె శైల‌జానాథ్ డిమాండ్ చేశారు. అనంత‌పురం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ మేయర్లు, చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల స్థానాల్లో ఎస్సీ, ఎస్టీలకు బలహీన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికీ తావుండకూడదని స్పష్టం చేశారు. సామాజిక న్యాయం మాటల్లో కాకుండా ఆచరణలో కనిపించాలని, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బలహీన వర్గాలకు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులను పాలకులు కాలరాస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కుల గణన, సర్వేల పేరుతో రిజర్వేషన్లను కుదించే కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. అధికారంలో ఉన్న నాయకులు డబుల్ ఇంజిన్ సర్కార్ అని గొప్పలు చెప్పుకుంటూనే దళితులు, ఆదివాసీల హక్కులను తుంగలో తొక్కుతున్నారని సాకె శైల‌జానాథ్ ధ్వజమెత్తారు. 

ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే...

బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై ఎందుకు చొర‌వ చూప‌డం లేదు?: 

స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీలకు దక్కాల్సిన వాటా ఎంత, వారికి న్యాయం చేస్తారా లేదా అన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంగా చెప్పాలి. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎస్సీలకు 16.66 శాతం, ఎస్టీలకు 7.5 శాతం రిజర్వేషన్లను ఖచ్చితంగా అమలు చేయాలి. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని వైఎస్సార్‌సీపీ కోరుతుంటే, వాటిని అడ్డుకునే ప్రయత్నాలు చేసి ఇప్పుడు బీసీలకు ఎంతో మేలు చేసినట్లు ప్రచారం చేసుకోవడం ఎంతవరకు సమంజసం? బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జనాభా ప్రాతిపదికన దక్కాల్సిన న్యాయమైన వాటాను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తమిళనాడు తరహాలో ప్రత్యేక చట్టం తీసుకొచ్చి, అవసరమైన రాజ్యాంగ సవరణల ద్వారా రిజర్వేషన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఎందుకు చొరవ చూపడం లేదు? కులగణన, కమిషన్ నివేదికల పేరుతో రిజర్వేషన్ల కేటాయింపులు చేస్తున్నప్పుడు వాటి వివరాలను ప్రజలకు, సంబంధిత వర్గాలకు పూర్తిగా వెల్లడించాలి. రాజ్యాంగం కల్పించిన హక్కులు ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడవు, ప్రతి వర్గానికి దక్కాల్సిన వాటా దక్కే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగుతుంది.

ఎన్నిక‌లు నిష్ప‌క్ష‌పాతంగా జ‌రిపించే బాధ్య‌త ఎస్ఈసీ దే..:

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలోనూ పారదర్శకత, నిష్పక్షపాత విధానం తప్పనిసరిగా ఉండాలి. చనిపోయినవారు, వలస వెళ్లినవారు, ఓటర్ల జాబితాలో రెండుసార్లు పేర్లు ఉన్నవారికి సంబంధించిన సమస్యలపై ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలి. అధికార పార్టీ నాయకుల జోక్యం ఉందనే ఆరోపణలపై సంబంధిత అధికారులు విచారణ జరిపి, ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు నమ్మకం కలిగించాలి. మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల స్థానాల్లో ఎస్సీ, ఎస్టీలకు దక్కాల్సిన రిజర్వేషన్ల వివరాలను ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించాలి. బలహీన వర్గాలకు న్యాయం చేయకుండా రిజర్వేషన్లపై గొప్పలు చెప్పుకోవడం వల్ల ప్రయోజనం లేదు, ఆచరణలో వారి హక్కులను కాపాడినప్పుడే సామాజిక న్యాయానికి అర్థం ఉంటుంది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుతో పాటు ఎస్సీలకు 16.66 శాతం, ఎస్టీలకు 7.5 శాతం రిజర్వేషన్ల డిమాండ్‌పై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు న్యాయమైన ప్రాతినిధ్యం, రాజ్యాంగబద్ధమైన హక్కులు సాధించే వరకు వైఎస్సార్‌సీపీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని సాకె శైల‌జానాథ్ హెచ్చరించారు.

Back to Top