విజయవాడ: ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో మీడియా ప్రతినిధులను కొండపైకి అనుమతించకపోవడం, సామాన్య భక్తుల సమస్యలను గాలికొదిలేయడంపై మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట దాటినా మీడియాను పైకి అనుమతించకుండా అడ్డుకోవడం అత్యంత దుర్మార్గమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపై జరుగుతున్న అవకతవకలు, అధికారుల వైఫల్యాలు, భక్తుల ఆగ్రహం బయటకు రాకూడదనే ఉద్దేశంతోనే ఈ ఆంక్షలు విధించారని ఆరోపించారు. ప్రభుత్వానికి భజన చేసే కొద్దిమంది ఇన్‌ఫ్లుయెన్సర్లకు, అనుకూల మీడియా ఛానల్స్‌కు మాత్రమే కొండపైకి వెళ్లేందుకు పాసులు జారీ చేసి, ప్రధాన స్రవంతి మీడియాను అడ్డుకోవడం శోచనీయమన్నారు. జిల్లా కలెక్టర్ పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఉదయం నుంచి మీడియా ప్రతినిధులు ధర్నా చేస్తున్నా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ మంత్రి, ఇన్‌ఛార్జ్ మంత్రి, పాలకమండలి, ఈవో, కమిషనర్ ఎవరూ నోరు మెదపకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రభుత్వం, అధికారులు మీడియాను చూసి ఎందుకు భయపడుతున్నారో సమాధానం చెప్పాలని నిలదీశారు. కొండపై వీఐపీల కార్లు యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తుంటే, సామాన్య భక్తులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. భగభగ మండే ఎండలో గంటల తరబడి క్యూలైన్లలో నిల్చున్న భక్తులకు కనీసం తాగునీరు, మజ్జిగ, ప్రసాదం లేదా పండ్లు కూడా పంచే పరిస్థితి లేకపోవడం శోచనీయమన్నారు. తెల్లవారుజామున లైన్లలో నిల్చున్న వృద్ధులు ఉదయం 10 గంటలైనా లైన్లు కదలక అల్లాడిపోతున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మవారి ఆలయానికి అంతటి స్తోమత లేదా అని అధికారులను ప్రశ్నించారు. దసరా ఉత్సవాలు పది రోజుల పాటు జరిగే భారీ పండుగ అని, ప్రతి న్యూస్ ఛానల్‌కు షిఫ్టుల వారీగా సిబ్బంది, రిపోర్టర్లు ఉంటారని గుర్తుచేశారు. వాస్తవాలను వెలుగులోకి తెచ్చే మీడియా సిబ్బందికి పాసులు నిరాకరిస్తూ, అర్హత లేని వారికి ఇష్టారాజ్యంగా పాసులు పంచుతున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు ఎవరికి ఎన్ని పాసులు ఇచ్చారో లెక్కలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. లోపాలను ఎత్తిచూపే మీడియా గొంతు నొక్కే ప్రయత్నం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని హెచ్చరించారు. అధికారుల నిర్వాకం, తీవ్రమైన ఆంక్షల వల్ల భక్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని, దీంతో ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందని పేర్కొన్నారు. విజయవాడ నగర ప్రజలు సైతం దసరా రోజుల్లో దర్శనానికి రావాలంటే భయపడి, ఉత్సవాలు ముగిసిన తర్వాత వెళ్దామనే పరిస్థితికి వచ్చారని అన్నారు. అమ్మవారి ఆలయం ఎవరి సొంత జాగీరు కాదని, అది ప్రతి ఒక్కరి దేవస్థానమని స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులు ప్లకార్డులు పట్టుకుని రోడ్డెక్కి ధర్నా చేయాల్సిన దుస్థితి రావడం గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి మీడియాను తక్షణమే అనుమతించాలని, లోపాలను సరిదిద్దుకుని సామాన్య భక్తులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. మీడియాకు స్వేచ్ఛ కల్పించి, న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలబడి పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.