తాడేపల్లి: విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో సామాన్య భక్తులకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో కూటమి ప్రభుత్వం, దేవాదాయ శాఖ ఘోరంగా విఫలమయ్యాయని మాజీ ఎమ్మెల్యే మల్లా విష్టు మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఉత్సవాల తొలిరోజే ఏర్పాట్లలోని లోపాలు పూర్తిగా బయటపడ్డాయని, పాలకుల అసమర్థత వల్ల గంటల తరబడి క్యూలైన్లలో భక్తులు, మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల సమస్యలను ప్రభుత్వానికి నివేదించే ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా ప్రతినిధులను కొండపైకి అనుమతించకుండా ఆంక్షలు విధించడం దుర్మార్గమని మండిపడ్డారు. దేవస్థానం నిధులతో ఇన్‌ఫ్లూయెన్సర్లను పెట్టి సొంత డబ్బా కొట్టుకుంటున్నారే తప్ప, క్యూలైన్లలో ఉన్న సామాన్య భక్తులకు మంచినీరు, పాలు, వైద్య సదుపాయాలు అందించడంలో విఫలమైన అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల మధ్య సమన్వయ లోపం, ప్రజాప్రతినిధుల అహం వల్ల సామాన్య ప్రజలు నలిగిపోతున్నారని ఆరోపిస్తూ.. ఈ వైఫల్యాలపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, దేవాదాయ శాఖ మంత్రి, ప్రభుత్వ పెద్దలు తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మీడియా సమస్యను, భక్తుల ఇబ్బందులను తక్షణమే పరిష్కరించకపోతే వైఎస్సార్‌సీపీ ప్రత్యక్ష ఆందోళనకు దిగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే.. క్యూలైన్లలో మంచినీరు లేదు.. పాలు, బిస్కెట్లంటూ తప్పుడు ప్రచారాలు: అమ్మవారి దర్శనం కోసం రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సామాన్య భక్తులను గంటల తరబడి క్యూలైన్లలో నిలబెట్టి నానా అవస్థలు పెడుతున్నారు. తీరా చూస్తే కనీసం తాగడానికి గుక్కెడు మంచినీళ్లు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో యంత్రాంగం ఉంది. 'వేడివేడి పాలు ఇస్తాం.. బిస్కెట్లు పంచుతాం' అంటూ పేపర్లలో గొప్పలు చెప్పుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో భక్తులకు ఏమీ అందడం లేదు. క్యూలైన్లలో తొక్కిసలాట జరిగి ఓ చిన్నారి తలకు దెబ్బ తగిలింది, ఓ మహిళ చెయ్యి తెగి రక్తమోడింది. ఇదా చంద్రబాబు నాయుడు చెప్పే సుపరిపాలన? భక్తుల భద్రతను గాలికొదిలేసి ప్రభుత్వం ఏం చేస్తోంది? వీఐపీలకే ప్రాధాన్యం.. సామాన్య భక్తులకు అడుగడుగునా అడ్డంకులు: ఇంద్రకీలాద్రిపై ప్రోటోకాల్, వీఐపీల వాహనాలకు కొండపైకి ఇష్టానుసారంగా అనుమతులు ఇస్తున్నారు. వీఐపీల సేవలో అధికార యంత్రాంగం మునిగితేలుతుంటే, గంటల తరబడి ఎండనపడి లైన్లలో వేచి చూస్తున్న వృద్ధులు, మహిళలు, భవానీ దీక్షాధారులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. బీపీ మాత్రలు వేసుకోవడానికి నీళ్లు లేక, ఆహారం అందక రోగులు సైతం అల్లాడిపోతున్నారు. అమ్మవారి సన్నిధిలో సామాన్యులను ఇంతలా అవమానిస్తారా?" మీడియాపై ఆంక్షలు – ఇన్‌ఫ్లూయెన్సర్లకు ప్రజాధనం ధారాదత్తం: దేశవిదేశాల్లోని కోట్లాదిమంది భక్తులకు నవరాత్రి ఉత్సవాలను, అమ్మవారి వైభవాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపే మీడియా ప్రతినిధులను కొండపైకి రాకుండా అడ్డుకోవడం అత్యంత హేయమైన చర్య. రాత్రి 11 గంటలకు అరకొరగా పాసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కెమెరామెన్లకు, రిపోర్టర్లకు వాహన పాసులు ఇవ్వకుండా రోడ్డుపై నిరసనలు తెలిపే దుస్థితి తెచ్చారు. అదే సమయంలో దాదాపు 80 నుంచి 100 మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు ఆలయ నిధుల నుంచి వేల రూపాయలు చెల్లించి కొండపైకి ఆహ్వానించారు. భక్తుల కానుకలతో ప్రభుత్వానికి అనుకూల ప్రచారం చేయించుకోవడానికే ఇన్‌ఫ్లూయెన్సర్లను తెచ్చారా? క్యూలైన్లలో భక్తుల ఇబ్బందులు బయటకు రాకూడదనే మీడియాను కట్టడి చేస్తున్నారా? ఇన్‌ఫ్లూయెన్సర్లకు ఎంతమందికి అనుమతులిచ్చారు? వారి కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో జిల్లా కలెక్టర్ స్పష్టం చేయాలి. అధికారుల మధ్య సమన్వయ లోపం – ఎంపీ, కలెక్టర్ విభేదాలు: స్థానిక పార్లమెంట్ సభ్యుడికి, జిల్లా కలెక్టర్‌కు మధ్య ఉన్న విబేధాలు, ఈగోల వల్ల ఈరోజు సామాన్య భక్తులు మూల్యం చెల్లించుకుంటున్నారు. కేంద్ర మంత్రి, ఎంపీ వచ్చిన కార్యక్రమానికి కలెక్టర్ రారు.. కలెక్టర్ ఉన్న చోటుకి ఎంపీ రారు. వీరిద్దరి మధ్య సమన్వయం లేక పాలన గందరగోళంగా మారింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మంత్రులంతా కొండపైనే ఉండి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించేవారు. నేడు మంత్రుల పర్యవేక్షణ ఎక్కడ? అధికారుల సమన్వయం ఏమైంది? ప్రచార ఆర్భాటం కోసం వ్యాపారులపై భారం: దుర్గగుడి నవరాత్రులు నిర్వహించడమే అధికార యంత్రాంగానికి ఒక పెద్ద బాధ్యత. అలాంటిది అదనంగా విజయవాడ ఉత్సవాల పేరుతో ఆర్భాటాలు తెచ్చి వ్యాపారులపై తీవ్ర భారం మోపుతున్నారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి ఒక్క రూపాయి కేటాయించలేదు. దసరా ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించాలనే డిమాండ్‌పై ప్రభుత్వం ఇప్పటికీ స్పందించడం లేదు. గతంలో వైయస్. జగన్ ప్రభుత్వం ఆలయ అభివృద్ధి, మహా మండపం, అన్నదానం కోసం రూ.80 కోట్లు కేటాయించి భక్తులకు పెద్దపీట వేసింది. తక్షణమే పరిష్కరించకుంటే ప్రత్యక్ష ఆందోళన: ఈ నేపధ్యంలో మీడియా ప్రతినిధుల పాసుల వివాదాన్ని, క్యూలైన్లలో భక్తుల తాగునీరు, ఆహార, వైద్య సమస్యలను అధికార యంత్రాంగం తక్షణమే పరిష్కరించాలని మల్లాది విష్టు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భక్తుల పక్షాన కొండపైనే ప్రత్యక్ష ఆందోళనకు దిగడం ఖాయమని హెచ్చరించారు.