నందికొట్కూరు షాదీఖానాను 90 శాతం పూర్తి చేసింది వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వమే

ప్రమాణానికి టీడీపీ నేత‌లు సిద్ధ‌మా?: డా. సుధీర్‌ దారా

 నందికొట్కూరు: నందికొట్కూరులోని షాదీఖానా నిర్మాణాన్ని టీడీపీ ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పడం అవాస్తవమని వైయ‌స్ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డా. సుధీర్‌ దారా పేర్కొన్నారు. షాదీఖానా నిర్మాణంలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ పాత్రపై టీడీపీ నేతలతో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్‌ చేశారు. తాము ఎక్కడైనా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, టీడీపీ నేతలు కూడా సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు.

1998లో టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి స్పీకర్‌ ఫరూక్‌ షాదీఖానాకు శిలాఫలకం వేశారని, అనంతరం 2014లో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మరోసారి శిలాఫలకం వేసినా నిర్మాణం ముందుకు సాగలేదని సుధీర్‌ దారా తెలిపారు. 2019లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం బైరెడ్డి సిద్ధార్థరెడ్డి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లడంతో రూ.1.50 కోట్లు మంజూరయ్యాయని, వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే షాదీఖానా నిర్మాణం 90 శాతం పూర్తయిందని పేర్కొన్నారు.

మున్సిపల్‌ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో హడావిడిగా షాదీఖానాను ప్రారంభించి రాజకీయ లబ్ధి పొందేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని సుధీర్‌ దారా విమర్శించారు. ముస్లిం మైనారిటీలను ఎన్నికల సమయంలోనే గుర్తు చేసుకోవడం సరికాదని అన్నారు.

Back to Top