తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థపై చంద్రబాబుకు అడుగడుగునా ఏహ్యభావం ఉందని, అది ప్రతీ సందర్భంలో ఆయన బయటపెట్టుకుంటూనే ఉన్నారని, తాజాగా విజయవాడలో ధర్నా చేస్తున్న ఉద్యోగులపై దాడులు, సస్పెన్షన్లతో వేధింపులు ఇందులో భాగమని మాజీ మంత్రి, తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. సచివాలయాలు తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు.. ఉద్యోగులకు జాబ్ ఛార్ట్ ఇవ్వలేదని, ప్రమోషన్ ఛానల్ ఇవ్వలేదని నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం చెబుతున్న అబద్ధాలకు స్థానిక ఎన్నికల్లో ఉద్యోగులతో పాటు ప్రజలు కూడా బుద్ధి చెప్తారని చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తేల్చిచెప్పారు. ప్రెస్ మీట్లో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఇంకా ఏమన్నారంటే.. సచివాలయ ఉద్యోగుల పట్ల దారుణంగా చంద్రబాబు వైఖరి ఈ ప్రభుత్వం ఉద్యోగులు, ప్రజలు, ప్రశ్నించే వారి పట్ల దారుణంగా వ్యవహరిస్తోంది. అసలు ప్రజలు, వారి అవసరాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సచివాలయ ఉద్యోగులు వారి హక్కుల కోసం ఓ ధర్నా చేస్తే , వారిని ఓ క్రిమినల్స్ లా పరిగణించింది. గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం మేరకు పల్లెలు పాలనకు పట్టుగొమ్మలని భావించి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో గ్రామ సచివాలయాలను, అలాగే వార్డు సచివాలయాలను కూడా తీసుకుని వచ్చారు. పాలన ప్రతీ మెట్టుకూ చేరాలని చేసిన ప్రయత్నమే ఈ వ్యవస్థ. అందులో లక్షా 34 వేల మంది ఏకకాలంలో ఉద్యోగాలు పొందారు. కరోనా లాంటి విపత్కర పరిస్ధితుల్లో ప్రజలకు భరోసా ఇచ్చిన వ్యవస్థ ఇది. 2000 సంవత్సరం ఆగస్టు 28లో బషీర్ బాగ్ లో రైతుల పట్ల అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జరిపిన దమనకాండ గుర్తుచేసుకుంటే ఆయన అధికారంలో ఉంటే ఎలా ఉంటాడో అర్దమవుతుంది. తమ సమస్యల కోసం ధర్నా చేసిన సచివాలయ ఉద్యోగుల విషయంలో ఈ ప్రభుత్వం, అందులో ఉన్న పెద్దలు, ఈ ప్రభుత్వానికి కాపు కాసే టీవీ ఛానళ్ల వైఖరి నిన్నటి ఘటనతో తేటతెల్లమైంది. ఈ వ్యవస్థ మీద ముందు నుంచీ చంద్రబాబుకు ద్వేష భావం ఉంది. ఈ ఉద్యోగుల్లో బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలు దాదాపు 85 వేల మంది వరకూ ఉన్నారు. వారి మీద చంద్రబాబుకు ఎప్పటి నుంచో ఏహ్యభావం ఉంది. అది మరోసారి బయటపెట్టుకున్నారు. సచివాలయ ఉద్యోగులు హక్కుల కోసం అడిగితే మీరు అనుసరిస్తున్న విధానం సమాజం ఏ విధంగానూ హర్షించదు. సచివాలయ ఉద్యోగులు అవసరం లేదన్నట్లుగా, వారిని ఎలా తగ్గించాలా అని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. దేశానికే ఆదర్శవంతమైన వ్యవస్థ తెచ్చిన జగన్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దేశానికే ఆదర్శవంతమైన ఓ వ్యవస్థను రాష్ట్రంలో నెలకొల్పారు. దీన్ని ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా చూసి తమ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ప్రయత్నించారు. స్వర్ణ ఉద్యోగులని చెప్పడం ద్వారా వారు బంగారం అని చంద్రబాబు ఎలాగో గుర్తించారు. అయినా వారిపై కక్షసాధింపులకు దిగుతున్నారు. సచివాలయాల ఉద్యోగ నియామకాల్లో ఏదో జరిగిపోయిందని ఏడేళ్ల తర్వాత ఇప్పుడు టీవీల్లో వారిపై ఆరోపణలు చేయిస్తున్నారు. సచివాలయాల వ్యవస్ధలో భాగంగా తెచ్చిన వాలంటీర్ల సేవల్ని కరోనాలో అందరూ మెచ్చుకుంటే... భర్తల్లేని భార్యల ఇంటికెళ్లి తలుపులు కొడతారంటూ చంద్రబాబు గతంలో దారుణంగా ప్రచారం చేయించారు. వాలంటీర్ల వల్ల 33 వేల మంది అమ్మాయిలు అదృశ్యం అయ్యారని మరో వ్యక్తి పవన్ కళ్యాణ్ ప్రచారాలు చేసి, ఇప్పుడు కనీసం 30 మంది యువతుల్ని కూడా వెనక్కి తీసుకురాలేకపోయారు. ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేసేసి అధికారంలోకి వచ్చాక అన్నీ వదిలేశారు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల విషయంలోనూ ప్రభుత్వ తీరు అలాగే ఉంది. సచివాలయ ఉద్యోగులపై చేసిన దమనకాండకు త్వరలోనే ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్ధితులు రాబోతున్నాయి. సచివాలయాలపై ప్రతీ అంశంలోనూ జీవోలున్నాయి సచివాలయాల ఉద్యోగులకు జాబ్ చార్ట్ లేదంటున్న మంత్రులకు అసలు కనీస అవగాహన ఉందా ?, మీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో విజయవాడలో వరదలు వస్తే సచివాలయ ఉద్యోగులతో పాటు వాలంటీర్లను కూడా వాడుకున్నారు. ఇప్పుడు మాత్రం జాబ్ ఛార్ట్ లేదని, రూల్స్ రూపొందించలేదని మా మీద ఆరోపణలు చేస్తున్నారు. ఉద్యోగులకు 90 శాతం రాష్ట్ర ఆదాయం వెళ్లిపోతుందని చెప్పి ఇప్పటికే తప్పించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రం అప్పుల కుప్ప అయిపోయిందని, శ్రీలంక అయిపోయిందని, నేనైతే సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 30 నెలల్లో 4 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఉద్యోగుల మీద ప్రజలకు ద్వేషం కలిగించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. సంపద సృష్టి పేరుతో మీరు చేసిన మోసం ప్రజలకు అర్దమైంది. గ్రామ సచివాలయాల ఏర్పాటు కోసం, ఉద్యోగుల నియామకం కోసం గతంలో మేం 110, 217 జీవోలు ఇచ్చాం. ఈ తర్వాత 2019 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వివిధ జీవోల ద్వారా సచివాలయంలో పనిచేసే ప్రతీ ఉద్యోగికీ జాబ్ ఛార్ట్ లు వేర్వేరుగా ఇచ్చాం. అలాగే ఆ తర్వాత ప్రొబేషన్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు ప్రమోషన్ కోసం మరో జీవో ఇచ్చాం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, ఇవన్నీ మరుగున పడేసి అబద్ధాల ప్రచారానికి ప్రభుత్వం దిగుతోంది. ఎలాగో అనాలోచిత నిర్ణయాలను సరిచేస్తాం అంటున్నారు కాబట్టి, సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తారా చెప్పాలి. ఈ వ్యవస్థ మీద మీ కుట్రల్ని ప్రజలు తెలుసుకోవట్లేదు అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మేం సచివాలయ వ్యవస్థ అమల్లోకి తెచ్చాం. ఆ తర్వాత వరుసగా దాన్ని బలోపేతం చేసుకుంటూ వెళ్లాం. ఐదేళ్లలో దాదాపు 12 కోట్ల ప్రజా వినతుల్ని వీటి ద్వారా పరిష్కరించాం. అలాంటి వ్యవస్థను తొలి రోజు నుంచే దెబ్బకొట్టేందుకు చంద్రబాబు కుట్రలు చేశారు. 500 పైగా సేవలు ప్రజలకు అందించేందుకు మేం తెచ్చిన ఈ వ్యవస్ధలో సేవల్ని వరుసగా కుదించుకుంటూ వచ్చారు. హేతుబద్ధీకరణ పేరుతో ఉద్యోగుల్ని విభజించి ఇతర శాఖలకు పంపేశారు. ఇలా ఒక్కో రకంగా ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసుకుంటూ వెళ్లారు. ఇప్పుడు ఏకంగా వారిపై దాడులు చేయిస్తున్నారు. మీ వేధింపులతో ఇప్పటికే ఎంతో మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. మీ అణచివేత ఎంత గట్టిగా ఉంటే, తిరుగుబాటు కూడా అంతే గట్టిగా వస్తుందని గుర్తుంచుకోవాలని చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చంద్రబాబును హెచ్చరించారు.