అనాలోచిత వ్య‌వ‌స్థే అయితే స‌చివాల‌యాలను ర‌ద్దు చేసే ద‌మ్ముందా? 

ప్ర‌భుత్వానికి మాజీ మంత్రి క‌న్న‌బాబు స‌వాల్ 

కాకినాడ‌లోని త‌న క్యాంప్ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్, మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు 

జ‌గ‌న్ మీద కోపంతో స‌చివాల‌య ఉద్యోగుల‌ను వ‌ర్గ శ‌త్రువులుగా చూస్తున్నారు

ప్రజలకు పాలనను చేరువ చేసిన గ్రామ సచివాలయాలను బలహీనపరుస్తున్నారు

గ్రామ సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం 

జాబ్ చార్టులు, సర్వీస్ రూల్స్, పదోన్నతులు అన్నీ జగన్ హయాంలోనే కల్పించాం

17 కేటగిరీల ఉద్యోగాలకు సర్వీస్ రూల్స్‌కు సంబంధించిన జీవోలు చూసుకోవాలి

డిమాండ్ల సాధ‌న కోసం ఉద్య‌మించే ఉద్యోగులపై కేసులు, సస్పెన్షన్లు సిగ్గుచేటు

గ్రామ స‌చివాల‌య ఉద్యోగుల ప‌క్షాన వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం చేస్తుంది

మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు స్ప‌ష్టీక‌ర‌ణ 

కాకినాడ:  జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన స‌చివాల‌య వ్యవస్థ పనికిరాదని చెబుతున్న ప్రభుత్వం, నిజంగా అది అనాలోచిత వ్యవస్థే అని భావిస్తే దాన్ని పూర్తిగా రద్దు చేసే ధైర్యం ఉందా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు స‌వాల్ చేశారు. కాకినాడలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్న సచివాలయ ఉద్యోగులపై ఉక్కుపాదం మోపుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సచివాలయ ఉద్యోగులపై కేసులు పెట్టి, 140 మందికి పైగా సస్పెండ్ చేసిందని ఆరోపించారు. చివరకు మహిళా ఉద్యోగులను కూడా పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి వేధించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చంద్ర‌బాబు నేతృత్వంలోని వెన్నుపోటు కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చి నియంతలా వ్యవహరిస్తోందని  తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యోగుల పట్ల చంద్రబాబుకి మొదటి నుంచీ చులకన భావనే ఉందని, వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ మాదిరిగానే స‌చివాల‌య ఉద్యోగుల‌ను కూడా వ‌ర్గ శత్రువులుగా చూస్తూ అణచివేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగులకు సంబంధించిన జాబ్ చార్ట్‌లు, సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానెల్స్‌ను నాటి వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే స్పష్టంగా రూపొందించామని కన్నబాబు స్పష్టం చేశారు. అవేమీ తెలియకుండా ఎల్లో మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేయిస్తూ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. గ్రామ సచివాలయాలను నిర్వీర్యం చేసి ప్రజలను మళ్లీ పాత ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పే పరిస్థితి తీసుకురావ‌ద్దని కుర‌సాల క‌న్న‌బాబు డిమాండ్ చేశారు. 

ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే... 

వైయ‌స్ఆర్‌సీపీ హయాంలోనే స‌ర్వీస్ రూల్స్‌

జగన్ గారి ప్రభుత్వం 2019లో రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి, ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. సచివాలయ ఉద్యోగులకు కేవలం ఉద్యోగాలు ఇవ్వడం మాత్రమే కాకుండా వారి విధులు, బాధ్యతలు, జాబ్ చార్టులు, సర్వీస్ అంశాలకు సంబంధించి వ్యవస్థను రూపొందించాం. ఉద్యోగుల సేవా విషయాలు సంబంధిత శాఖల సర్వీస్ రూల్స్ ప్రకారమే కొనసాగించే విధానం పెట్టాం. నియామక సమయంలో రెండేళ్ల ప్రొబేషన్‌ను నిర్దేశించాం. సర్వీస్ రూల్స్‌కు సంబంధించిన అవసరమైన మార్పులు, కొత్త నిబంధనలు రూపొందించాలని అప్పుడే సంబంధిత శాఖలకు ఆదేశాలు ఇచ్చాం. 17 కేటగిరీల ఉద్యోగాలకు సర్వీస్ రూల్స్‌కు సంబంధించిన జీవోలు కూడా జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇచ్చింది. ఉద్యోగుల ప్రమోషన్లు, రెగ్యులరైజేషన్, పే రివిజన్ వంటి అంశాలను దశలవారీగా పరిష్కరించే వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఆ విషయాలన్నీ జరగలేదన్నట్లు ప్రభుత్వం మాట్లాడటం వాస్తవాలను వక్రీకరించడమే. ఉద్యోగులకు జాబ్ చార్టులు, సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్స్ లేవని చెబుతున్న వారు అప్పటి ప్రభుత్వ ఉత్తర్వులను బయటపెట్టి ప్రజలకు సమాధానం చెప్పాలి.

ఉద్యోగుల‌పై రెడ్ బుక్ ప్ర‌యోగించ‌డం దారుణం

గ్రామంలోనే ప్రభుత్వ సేవలు అందేలా ఏర్పాటు చేసిన సచివాలయాలను బలహీనపరిచి, ఉద్యోగుల సంఖ్యను తగ్గించి, బాధ్యతలను మార్చి, ప్రజలకు అందుతున్న సేవలను దెబ్బతీయడం ఎందుకు? జగన్ గారి మీద రాజకీయ కక్ష ఉంటే అది రాజకీయంగా చూసుకోవాలి కానీ, ఆయన ఏర్పాటు చేసిన ప్రజలకు ఉపయోగపడే వ్యవస్థలను ధ్వంసం చేయడం ద్వారా ప్రజలకు నష్టం చేయకూడదు. సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని అడిగితే వారిపై రెడ్‌బుక్ ప్రయోగించడం, కేసులు పెట్టడం, సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్య పద్ధతి కాదు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల్సింది ప్రభుత్వం కానీ, వారిని భయపెట్టడం కాదు. గ్రామ సచివాలయాలు అనాలోచిత వ్యవస్థ అని కూటమి ప్రభుత్వం భావిస్తే, దానిని రద్దు చేసే ధైర్యం ఉందా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. రద్దు చేసే ధైర్యం లేకపోతే, జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థను ఎందుకు క్రమంగా నిర్వీర్యం చేస్తున్నారు? 

ప్ర‌జ‌ల‌కు చేరువైన వ్య‌వ‌స్థ‌ను నిర్వీర్యం చేసే కుట్ర‌

సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు గ్రామస్థాయిలోనే ప్రజలకు పెన్షన్లు, రేషన్ కార్డులు, సంక్షేమ పథకాలు, రెవెన్యూ, వ్యవసాయం, ఆరోగ్యం, పారిశుద్ధ్యం తదితర సేవలను సమన్వయంతో అందించాలనే లక్ష్యంతో పనిచేశాం. వలంటీర్ వ్యవస్థతో అనుసంధానం చేసి ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి వద్దకే తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. ఇప్పుడు గ్రామ సచివాలయాల పరిస్థితి ఏంటి? ప్రజలకు గతంలో మాదిరిగా సేవలు అందుతున్నాయా? సచివాలయ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో విధులు, బాధ్యతలు, పదోన్నతి అవకాశాలు కల్పిస్తున్నారా? ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. తుపాన్లు, వరదలు వచ్చినప్పుడు కూడా గ్రామస్థాయి యంత్రాంగాన్ని ఉపయోగించి ప్రజలకు సహాయం అందించే వ్యవస్థను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు అదే వ్యవస్థను బలహీనపరిస్తే అత్యవసర పరిస్థితుల్లో గ్రామస్థాయిలో ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుంది? పేర్లు మార్చడం, వ్యవస్థలను నిర్వీర్యం చేయడం పాలన కాదని ప్రభుత్వం గుర్తించాలి. సచివాలయ వ్యవస్థపై రాజకీయ కక్ష ఉంటే అది ప్రభుత్వ నిర్ణయం కావచ్చు కానీ, దాని భారం ప్రజలపై పడకూడదు.

ఉద్యోగుల ప‌దోన్న‌తుల‌పై స్ప‌ష్ట‌మైన రోడ్ మ్యాప్ ప్ర‌క‌టించాలి

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా వారిపై కేసులు పెట్టడం, సస్పెన్షన్లు విధించడం, వారి ఆందోళనలను అణచివేయడం వెంటనే ఆపాలి. జాబ్ చార్టులు, సర్వీస్ రూల్స్, పదోన్నతులు, ప్రొబేషన్, రెగ్యులరైజేషన్, పే రివిజన్ వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన రోడ్‌మ్యాప్ ప్రకటించాలి. గ్రామ సచివాలయ ఉద్యోగులకు భవిష్యత్తుపై భరోసా కల్పించాలి. జగన్ గారి నేతృత్వంలోని నాటి వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రజలకు ఉపయోగపడే విధంగా కొనసాగిస్తారా, లేక రాజకీయ కారణాలతో దానిని నిర్వీర్యం చేస్తారా అన్నది ప్రభుత్వం స్పష్టం చేయాలి. నిజంగా ఈ వ్యవస్థ అనాలోచితమై, పనికిరానిదే అని ప్రభుత్వం భావిస్తే దానిని రద్దు చేసే ధైర్యం ఉందా? రద్దు చేయకుండా అదే వ్యవస్థను బలహీనపరుస్తూ ఉద్యోగులను, ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం మాత్రం సమర్థనీయం కాదు. గ్రామ సచివాలయ ఉద్యోగుల హక్కుల కోసం, ప్రజలకు చేరువైన పాలన కోసం వైయ‌స్ఆర్‌సీపీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని క‌న్న‌బాబు హెచ్చ‌రించారు.

Back to Top