స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల అంశం, ఎస్‌ఐఆర్ అంశాలపై న్యాయపరమైన పరిణామాలు కొనసాగుతున్నప్పటికీ, ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చన్న అంచనాతో పార్టీ ముందస్తు సిద్ధత కొనసాగించాలని పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ సూచించారని సజ్జల తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులకు అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాలు, ఎన్‌ఓసీలు, పన్నులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలని చెప్పారు. గత కొద్ది రోజులుగా సర్వర్ సమస్యల కారణంగా ఈ సర్టిఫికెట్లు అందడంలో ఇబ్బందులు ఉన్నట్టు సమాచారం వస్తోందని పేర్కొన్నారు. అభ్యర్థులు గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేయాలని, దరఖాస్తులు స్వీకరించకపోతే లేదా సర్వర్ పనిచేయకపోతే ఆ పరిస్థితిని వీడియో రూపంలో నమోదు చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్లను కలిసి సమస్యపై వినతిపత్రాలు అందించి, తప్పనిసరిగా అక్నాలెడ్జ్‌మెంట్ తీసుకోవాలని చెప్పారు. సర్టిఫికెట్ల జారీ ఆలస్యమైతే లేదా దరఖాస్తులను స్వీకరించకపోతే, రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఆధారాలను సేకరించి స్టేట్ ఎలక్షన్ కమిషన్‌కు మరోసారి ప్రాతినిధ్యం ఇవ్వడంతో పాటు అవసరమైతే కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధం కావాలని తెలిపారు. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటి నుంచే కసరత్తు చేయాలి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించి గతంలో చేసిన విధంగానే, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీ చైర్‌పర్సన్ స్థానాలకు సంబంధించి కూడా ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలని సజ్జల సూచించారు. రిజర్వేషన్లపై స్పష్టత రాకముందే సామాజిక వర్గాల వారీగా సాధ్యమైన అభ్యర్థులను గుర్తించాలని, వీలైతే పేర్లను కూడా సిద్ధం చేయాలని చెప్పారు. రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత నోటిఫికేషన్‌కు చాలా తక్కువ సమయం ఉండే అవకాశం ఉన్నందున, ముందుగానే ప్రత్యామ్నాయ అభ్యర్థులను సిద్ధం చేసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో వార్‌రూమ్‌లు, నియోజకవర్గ స్థాయిలో టీమ్‌లు ఎన్నికల సమయంలో గ్రామ స్థాయి నుంచి పార్టీ కేంద్ర కార్యాలయం వరకు సమన్వయంతో పనిచేసే వ్యవస్థ ఉండాలని సజ్జల సూచించారు. జిల్లా స్థాయిలో లీగల్ వార్‌రూమ్, నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి, 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా నామినేషన్లకు అడ్డంకులు, పోలీసు కేసులు, బైండ్ ఓవర్ కేసులు లేదా ఇతర ఇబ్బందులు ఎదురైతే వెంటనే జిల్లా, రాష్ట్ర స్థాయి లీగల్ టీమ్‌ల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అవసరమైన చోట ఎలక్షన్ కమిషన్, కోర్టులను వెంటనే ఆశ్రయించేలా వ్యవస్థ సిద్ధంగా ఉండాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించాలి ఎన్నికల సమయంలో సమస్యలు తలెత్తే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌ల భద్రత, సీసీ కెమెరాలు, అవసరమైన భద్రతా ఏర్పాట్లపై ముందుగానే పరిశీలన చేయాలని చెప్పారు. ఎన్నికల ప్రతి దశలో ఎదురయ్యే సమస్యలను ముందే అంచనా వేసి, వాటిని ఎలా ఎదుర్కోవాలో ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. జిల్లా అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లు, నియోజకవర్గ సమన్వయకర్తలు పరస్పరం సమన్వయంతో పనిచేసి, అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయానికి పంపాలని కోరారు. నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చన్న అంచనాతో ఇప్పటి నుంచే అన్ని స్థాయిల్లో సిద్ధంగా ఉండాలి. సర్టిఫికెట్లు, అభ్యర్థుల ఎంపిక, లీగల్ సపోర్ట్, ఎన్నికల నిర్వహణ—ప్రతి అంశంలో ముందస్తు ప్రణాళికతో పనిచేయాలి” అని సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ నేతలకు సూచించారు. టెలికాన్ఫరెన్స్‌లో పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కోఆర్డినేషన్), రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు (కోఆర్డినేషన్) పాల్గొన్నారు.