చట్టం చేయకుండా రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారు చంద్రబాబూ? 

బీసీలను అమాయకులుగా భావించొద్దు.. జీవోతో నాటకం ఆపండి 

చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ  

రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలోని క్యాంపు కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ తూర్పుగోదావ‌రి జిల్లా అధ్య‌క్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ  

34% బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్తామనడం రాజకీయ నాటకమే 

చట్టం చేయకుండా జీవో ఇస్తే కోర్టులో నిలబడదని చంద్రబాబుకు తెలుసు

డెడికేటెడ్ కమిషన్ నివేదికను ఎందుకు బహిర్గతం చేయలేదు?

కూట‌మి ప్ర‌భుత్వాన్ని నిల‌దీసిన చెల్లుబోయిన‌

గత ప్రభుత్వం నిర్వహించిన కులగణన లెక్కలు ప్రభుత్వం వద్దే ఉన్నాయి

కులగణన లెక్కలను కమిషన్‌కు అందిస్తే 34% రిజర్వేషన్లకు న్యాయపరమైన సమర్థనకు అవకాశం

బీసీలపై చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని ఒప్పించి చట్టబద్ధత కల్పించాలి

అమరావతి కోసం చట్టం చేయించిన చంద్రబాబు.. బీసీల కోసం ఎందుకు అదే ప్రయత్నం చేయడం లేదు?

స్థానిక సంస్థల ఎన్నికల కోసం 34% రిజర్వేషన్ల పేరుతో రాజకీయ డ్రామా

ప్రెస్‌మీట్‌లో స్ప‌ష్టం చేసిన మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం: చట్టం చేయకుండా రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారు చంద్రబాబూ? కోర్టులో నిలబడని జీవో ఇచ్చి.. సుప్రీంకోర్టుకు వెళ్తామంటూ బీసీలను మభ్యపెట్టే నాటకం ఎందుకు? అని వైయ‌స్ఆర్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ నిలదీశారు. రాజమహేంద్రవరంలోని క్యాంపు కార్యాలయంలో ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ.. 34 శాతం బీసీ రిజర్వేషన్ల విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు. బీసీలకు నిజంగా న్యాయం చేయాలంటే కోర్టులో నిలిచేలా చట్టబద్ధమైన ప్రక్రియను పూర్తి చేయాలని, బీసీ కమిషన్ నివేదికను బహిర్గతం చేసి, కులగణన లెక్కలను ఆధారంగా పెట్టుకుని రిజర్వేషన్లకు న్యాయపరమైన సమర్థన చూపించాలని స్పష్టం చేశారు. బీసీలను అమాయకులుగా భావించి జీవోలతో రాజకీయ నాటకాలు ఆడటం కాకుండా శాశ్వత చట్టబద్ధ పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
మీడియాతో మాజీ మంత్రి చెల్లుబోయిన ఏమ‌న్నారంటే..
 
- కోర్టులో నిలబడని జీవోతో బీసీలను ఎలా నమ్మిస్తారు?

“చట్టం చేయకుండా రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారు చంద్రబాబూ? 34 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించాలంటే బీసీ కమిషన్ ఏర్పాటు చేసి, బీసీ జనాభాకు సంబంధించిన లెక్కలను ఆధారంగా తీసుకుని సమగ్ర నివేదిక ఇవ్వాలి. ఇంద్ర సహాని కేసులో 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించాలంటే కమిషన్ స్పష్టమైన నివేదిక, తగిన జస్టిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా డెడికేటెడ్ కమిషన్ ఎందుకు వేశారు? ఆ కమిషన్ నివేదికను ఎందుకు బహిర్గతం చేయలేదు? కోర్టు కూడా ఇదే అంశాన్ని ప్రశ్నించింది. గత ప్రభుత్వం నిర్వహించిన కులగణనకు సంబంధించిన లెక్కలు ప్రభుత్వం వద్దే ఉన్నాయి. ఆ లెక్కలను కమిషన్‌కు అందించి, 34 శాతం రిజర్వేషన్ల అవసరాన్ని కోర్టు ముందు సమర్థించే అవకాశం ఉంది. అలాంటి చర్యలు తీసుకోకుండా కోర్టులో నిలబడని జీవో జారీ చేసి, ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్తామనడం బీసీలను మోసం చేయడం కాదా?”

- చట్టబద్ధత కల్పించే మార్గం తెలిసి కూడా ఎందుకు చేయరు?

“బీసీలకు నిజంగా 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే చిత్తశుద్ధి ఉంటే చట్టం చేయాలి. ఆ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించేలా చేసి, నైన్త్ షెడ్యూల్‌లో చేర్చే ప్రయత్నం చేయాలి. నైన్త్ షెడ్యూల్‌లో చేర్చడం ద్వారా న్యాయ సమీక్ష పరిధికి రాకుండా రిజర్వేషన్లకు చట్టబద్ధమైన రక్షణ కల్పించే అవకాశం ఉంది. అమరావతి కోసం కేంద్రాన్ని ఒప్పించి చట్టం చేయించిన చంద్రబాబు.. బీసీల రిజర్వేషన్ల విషయంలో కేంద్రంపై ఎందుకు అదే స్థాయిలో ఒత్తిడి చేయడం లేదు? బీసీల కోసం నిజంగా ఆరాటపడే వ్యక్తి అయితే కేంద్రానికి ఫైల్ పంపించి, పార్లమెంట్‌లో చట్టం చేయించి శాశ్వత పరిష్కారం చూపాలి. చట్టం చేయకుండా కేవలం జీవో ఇచ్చి, అది కోర్టు పరిధిలో నిలబడదని తెలిసి సుప్రీంకోర్టుకు వెళ్తామనడం వల్ల బీసీలకు ఏం ప్రయోజనం? మాటలు, జీవోలు కాకుండా బీసీల రిజర్వేషన్లకు చట్టబద్ధమైన రక్షణ కల్పించాలి.”

- సుప్రీంకోర్టుకు వెళ్తామన్నది రాజకీయ నాటకమే

“హైకోర్టు తీర్పు తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్తామన్నది స్థానిక సంస్థల ఎన్నికల కోసం చంద్రబాబు ఆడుతున్న రాజకీయ నాటకమే. చట్టం చేయకుండా రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారు? బీసీలను అమాయకులుగా భావించొద్దు. బీసీ సమాజంలోని యువత తమ అవకాశాల గురించి ఆలోచించాలి. 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెబుతూ ఒకవైపు చట్టం చేయకుండా జీవో ఇవ్వడం, మరోవైపు సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పడం వల్ల సమస్య పరిష్కారం కాదు. పవన్‌కల్యాణ్‌ మద్దతుతో బీసీలు అవసరం లేదన్న ధోరణిలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మేము భావిస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల కోసం 34 శాతం రిజర్వేషన్ల పేరుతో జరుగుతున్న పరిణామాలను బీసీ వర్గాలు గమనించాలి. కోర్టులో నిలబడని జీవోతో బీసీలను మభ్యపెట్టడం కాకుండా, చట్టబద్ధమైన శాశ్వత పరిష్కారం చూపాలి.”

Back to Top