తాడేపల్లి: ఆర్టీసీని దశలవారీగా నిర్వీర్యం చేసి ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి ధ్వజమెత్తారు. నాడు సంస్థతో పాటు, ఆ ఉద్యోగుల శ్రేయస్సు ఆలోచించిన «శ్రీ వైయస్ జగన్, వారిని ప్రభుత్వంలో విలీనం చేశారని వెల్లడించారు. కాగా ఇప్పుడు చంద్రబాబు సంస్థను ప్రైవటుపురం చేసే కుట్రలకు తెర తీశారని గుర్తు చేశారు. ఖాళీగా ఉన్న వేలాది ఉద్యోగాలను భర్తీ చేయకుండా, బస్సుల సంఖ్యను తగ్గిస్తూ ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని చూపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఆన్‌కాల్ డ్రైవర్ల విధానం ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమని వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పూనూరు గౌతమ్‌రెడ్డి ఆక్షేపించారు. ప్రెస్‌మీట్‌లో పి.గౌతమ్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..: వెనక్కి తగ్గకపోతే ఉద్యమం తప్పదు: ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీ డిపోలు, మౌలిక వసతులను ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారు. తాజాగా డ్రైవర్లు, కండక్టర్ల నియామకం చేపట్టకుండా, వారిని ఔట్ సోర్సింగ్ విధానంలో నియమించాలని నిర్ణయించారు. ఇది చాలా తప్పుడు నిర్ణయం. ప్రభుత్వం వెంటనే డ్రైవర్ల అర్హతల సడలింపులు, ప్రైవేట్ సంస్థలకు డిపోలు అప్పగించే వ్యవహారంపై సమాధానం చెప్పాలి. ఈ చర్యలన్నింటిపై వెనక్కి తగ్గాలి. లేని పక్షంలో ప్రజా ఉద్యమం తప్పదు. ఆర్టీసీని దశలవారీగా ప్రైవేట్ పరం చేసే కుట్ర: మేకవన్నె పులి లాంటి చంద్రబాబు విధానం మరోసారి బట్టబయలైంది. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాల్సింది పోయి ప్రైవేట్ సంస్థలకు పెద్దపీట వేసి ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూస్తున్నాడు. ఆర్టీసీలో 15 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డ్రైవర్, కండక్టర్ పోస్టులు భర్తీ చేయకుండా, బస్సుల సంఖ్యను తగ్గిస్తూ, సంస్థకు నష్టాలు వస్తున్నాయని చూపించి చివరకు ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆర్టీసీని అమ్మకానికి పెట్టారు. ఆర్టీసీని దశలవారీగా ప్రైవేట్ పరం చేయడానికి కుట్ర జరుగుతోంది. ఆన్‌కాల్ డ్రైవర్ల విధానం మరింత ప్రమాదకరం. ఆర్టీసీ డ్రైవర్ నియామకానికి ఆరోగ్య పరీక్షలు, డ్రైవింగ్ నైపుణ్య పరీక్షలు, భద్రతా ప్రమాణాలు ఉంటాయి. అవేవీ పట్టించుకోకుండా ఆన్‌కాల్ డ్రైవర్లను బస్సులు నడపడానికి తీసుకొస్తే ప్రయాణికుల ప్రాణాలకు ఎవరు భరోసా ఇస్తారు? ఒక వ్యక్తి పగలు టాక్సీ నడిపి రాత్రి ఆర్టీసీ బస్సు నడిపే పరిస్థితి వస్తే, ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్న ఆర్టీసీ బస్సులను ఇలాంటి విధానంతో నడపడం ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడటమే. డిపోలు, రూట్ల ప్రైవేటీకరణతో మొదలుపెట్టి..: ఇక డిపోలు, రూట్ల ప్రైవేటీకరణతో ఆర్టీసీని మరింత బలహీన పరుస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో డిపోలను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారు. భూమి మనది, విద్యుత్ మనది, మౌలిక వసతులు మనవి, డిపాజిట్లు కూడా ఆర్టీసీ చెల్లిస్తుంది. అలాంటప్పుడు ఆర్టీసీ బస్సులను మనమే తిప్పుకోలేమా? ప్రజల ఆస్తులను, ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం ఎందుకు? ప్రైవేట్ సంస్థలు లాభాలు పొందాలి, ఆర్టీసీ మాత్రం నష్టాల్లో ఉండాలనే విధానం ఎందుకు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలతో ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీనే నడపవచ్చు. ప్రైవేట్ సంస్థకే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. అయినా ప్రజల ఆస్తులను ప్రైవేట్ కంపెనీలకు ఎందుకు అప్పగిస్తున్నారు?. ఇది పూర్తిగా అసమంజసమైన చర్య. టెండర్ నిబంధనల సడలింపు అందుకేనా?: కంపెనీలకు ఆర్టీసీ ఆస్తులను కట్టబెట్టే క్రమంలో టెండర్ నిబంధనలను సడలించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కంపెనీకి చట్టబద్ధత ఉందా? సంస్థ రిజిస్ట్రేషన్ పూర్తయ్యిందా? టెండర్ నిబంధనలను ఎందుకు సడలించారు? ఎవరి అనుమతితో సడలింపులు చేశారు? టెండర్లను ఎందుకు ముక్కలుగా విభజించారు? అనే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. డ్రైవర్ల అర్హతలకు సంబంధించిన నిబంధనలను కూడా సడలించారు. రెండు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉంటే సరిపోతుందని నిబంధనలు మార్చడం ఎవరి కోసం? ఈ నిబంధనలను ఎవరు ఆమోదించారు? ఆర్టీసీని బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం నిబంధనలను సడలిస్తూ ప్రైవేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరించడం ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగమే. ఆర్టీసీ ఆస్తులు ప్రైవేట్ సంస్థలకు, లాభాలు ప్రైవేట్ సంస్థలకు, నష్టాలు మాత్రం ఆర్టీసీకి వచ్చే విధానం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. ప్రైవేటీకరించే ప్రయత్నాలు విరమించుకోవాలి: ఖాళీగా ఉన్న డ్రైవర్, కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలి, కొత్త బస్సులు కొనాలి, బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలి, ఆర్టీసీని బలోపేతం చేయాలి. ఆర్టీసీని అమ్మకానికి పెట్టే విధానాన్ని వెంటనే విరమించుకోవాలి. ఆన్‌కాల్ డ్రైవర్ల విధానాన్ని నిలిపివేయాలి. డిపోలు, రూట్లు, ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ప్రజల ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ఆపాలి. ఆర్టీసీని ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేసే ప్రయత్నం కొనసాగితే వైఎస్సార్ టీయూసీ చూస్తూ ఊరుకోదు. గతంలో లూలూ సంస్థకు ఆర్టీసీని అప్పగించే ప్రయత్నాన్ని ఉద్యమంతో అడ్డుకున్నాం. ఇప్పుడు కూడా ఉద్యోగులు, ప్రజలు, ప్రజా సంఘాలతో కలిసి పోరాటం చేస్తాం. ఇప్పటికైనా చంద్రబాబు తన విధానం మార్చుకోకపోతే, ప్రజా ఉద్యమాన్ని ఎదుర్కోక తప్పదని పి.గౌతమ్‌రెడ్డి హెచ్చరించారు.