స్థానిక ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను అడ్డుకునే కుట్రలు

ఎస్ఈసీ తక్షణమే జోక్యం చేసుకోవాలి: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి

 
 తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు పోటీ చేయకుండా అడ్డుకునేందుకు కుల ధ్రువీకరణ పత్రాలు, ఎన్‌వోసీలు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సచివాలయాల్లో సర్వర్లు పనిచేయడం లేదని, అధికారులు అందుబాటులో లేరని చెబుతూ అభ్యర్థులను తిప్పుతున్నారని అన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆస్తి పన్ను చెల్లించిన తర్వాత ఇవ్వాల్సిన ఎన్‌వోసీలు కూడా జారీ చేయడం లేదని లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. సెప్టెంబర్‌ 1న ఇదే అంశంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, అయినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా ఎస్ఈసీ తక్షణమే జోక్యం చేసుకుని సర్టిఫికెట్ల జారీలో జాప్యంపై విచారణ చేపట్టాలని కోరారు.

సర్వర్‌ సమస్యలకు ప్రత్యామ్నాయంగా అవసరమైన ధ్రువీకరణ పత్రాలను మాన్యువల్‌గా జారీ చేసేలా ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలని లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నాలు మానుకుని వైయ‌స్ఆర్‌సీపీని ప్రజా తీర్పుతో ఎదుర్కోవాలని అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వైయ‌స్ఆర్‌సీపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.

Back to Top