రాష్ట్రంలో భయంకరమైన కరవు..

నిలువునా ఎండిన పంటలు, వలసబాటలో పల్లెలు:

తక్షణం ఎకరానికి రూ.25 వేల పరిహారం చెల్లించాలి: 

వైయస్సార్సీపీ జనరల్ సెక్రటరీ ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్

తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ జనరల్ సెక్రటరీ( వ్యవసాయం, రైతు సంక్షేమం) ఎం వీ యస్ నాగిరెడ్డి.

రికార్డు స్థాయిలో లోటు వర్షపాతం..

కరవు మండలాల ప్రకటనకే పరిమితమైన ప్రభుత్వం:

అన్నదాతలను నిలువునా మంచిన వెన్నుపోటు పార్టీ కూటమి : 

ఎంవీఎస్ నాగిరెడ్డి ధ్వజం

రైతులను ఆదుకునే రోడ్‌మ్యాప్ లేదు..

ప్రత్యామ్నాయ ప్రణాళికా శూన్యం: 

లక్ష కోట్ల ప్రాజెక్టుల పేరిట ఒట్టి ప్రచార ఆర్భాటమే

కరువు బారిన పడిన రైతు ఖాతాలో వేసింది మాత్రం శూన్యం:

ప్రభుత్వ తీరుపై నాగిరెడ్డి తీవ్ర ఆక్షేపణ 

తాడేపల్లి : రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు దాపురించి, అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నా కూటమి ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్లయినా లేదని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర (వ్యవసాయ, రైతు సంక్షేమ విభాగం) జనరల్ సెక్రటరీ ఎంవీఎస్ నాగిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో లోటు వర్షపాతం నమోదైందని, ప్రధానంగా రాయలసీమ జిల్లాలైన కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, నంద్యాల జిల్లాల్లో వర్షాధార పంటలు నిలువునా ఎండిపోయి రైతాంగం తీవ్ర నిరాశానిస్పృహల్లో కూరుకుపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దుర్భిక్ష పరిస్థితులున్నా ప్రభుత్వం మొక్కుబడిగా కొన్ని కరవు మండలాలను ప్రకటించి చేతులు దులుపుకుందే తప్ప, కష్టాల్లో ఉన్న అన్నదాతలకు ఒక్క పైసా ఆర్థిక సాయం అందించలేదని దుయ్యబట్టారు. ఎండిపోయిన పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఎలాంటి స్పష్టమైన రోడ్‌మ్యాప్ ఇవ్వకపోవడమే కాకుండా, కనీసం రబీ సీజన్‌కు అవసరమైన సబ్సిడీ విత్తనాలు కూడా సరఫరా చేయలేని నిస్సహాయ స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని విమర్శించారు. పశుగ్రాసం కొరతతో రైతులు పశువులను సంతల్లో తెగనమ్ముకుంటున్నారని, బతుకుదెరువు లేక నగరాలకు వలసబాట పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ, పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి రూ.25,000 పరిహారం తక్షణమే చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే.. 

దేశంలోనే రెండో అత్యంత తీవ్ర లోటు వర్షపాతం:

ఈ ఖరీఫ్‌లో దేశంలోనే తీవ్ర దుర్భిక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడిచింది. మిజోరాంలో మైనస్ 58 శాతం లోటు వర్షపాతం ఉంటే, మైనస్ 55.4 శాతంతో దేశంలోనే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. జూన్ 25 నుంచి సెప్టెంబర్ 12 దాకా నిరంతరాయంగా సుదీర్ఘ డ్రై స్పెల్ నడిచింది. అసలు ఇంతటి తీవ్ర సంక్షోభాన్ని ఎప్పుడూ చూడలేదు. జూలై, ఆగస్టు నెలలు కలిపితే రాష్ట్రవ్యాప్తంగా 61.8 శాతం లోటు వర్షపాతం ఉంది. మరీ ముఖ్యంగా రాయలసీమలో జూలైలో మైనస్ 73.58 శాతం, ఆగస్టులో మైనస్ 57.7 శాతం మేర వర్షపాతం లోటు ఏర్పడింది. ఒక్క నెల్లూరు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు వర్షాభావ సంక్షోభంలో మునిగిపోయాయి.

రాయలసీమలో నిలువునా ఎండిన పైర్లు – పల్లెల్లో వలసలు:

నేను స్వయంగా కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో 200 కిలోమీటర్లకు పైగా క్షేత్రస్థాయి పర్యటన చేసి వాస్తవాలు చూశాను. పైకి పొలాలు పచ్చగా కనిపిస్తున్నా, లోపలికి వెళ్లి చూస్తే చేలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. పెద్దవడుగూరులో ఎకరానికి రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టిన పత్తి రైతు పంటను నష్టపోయి రోటోవేటర్లతో దున్నేస్తున్నాడు. నీరు లేక కంది, సజ్జ చేలన్నీ 'స్ట్రెస్ ఫ్లవరింగ్‌'కు వచ్చి కంకులన్నీ తప్పలుగా మిగిలాయి. వంద బోర్లు ఉన్న చోట పది మాత్రమే పనిచేస్తున్నాయి. రాయలసీమ సంతల్లో పశువుల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి. పశుగ్రాసం లేక పశువులను అమ్ముకుని కూలీలుగా ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు.

కరవు మండలాల ప్రకటనలోనూ అన్యాయం – రోడ్‌మ్యాప్ శూన్యం:

తీవ్ర వర్షాభావం, డ్రై స్పెల్ నిబంధనల ప్రకారం రాష్ట్రం మొత్తాన్ని కరవు రాష్ట్రంగా ప్రకటించాల్సి ఉంది. ప్రభుత్వం 388 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకుంది తప్ప, రైతులకు పైసా విదిల్చలేదు. పోలవరం నియోజకవర్గంలో కేవలం 48 శాతమే సాగు జరిగిందని ప్రభుత్వ అధికారిక లెక్కలే చెబుతున్నాయి. పాత ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలు, సున్నా వడ్డీ, అన్నదాత సుఖీభవ నిధులు ఇంతవరకు ఇవ్వలేదు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం లేదు. కనీసం ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక లేదు. రాబోయే రబీకి విత్తనాలు దొరక్క రైతులు వ్యవసాయ కార్యాలయాల ముందు ధర్నాలు చేసే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. దశాబ్దాల నాటి చినీ తోటలు వర్షాకాలంలోనే ఎండిపోయాయి.

మాయమాటలు, ప్రచార ఆర్భాటాలకే పరిమితం:

గతంలో కుప్పంలో ఇజ్రాయెల్ వ్యవసాయం అన్నారు, రెయిన్ గన్లతో కరవును జయించామని గొప్పలు చెప్పుకున్నారు.. మరి ఆ రెయిన్ గన్లు ఏమయ్యాయి? నంద్యాలను సీడ్ హబ్ చేస్తామన్న హామీ రెండేళ్లు దాటినా అతీగతీ లేదు. ప్రార్థనలు చేస్తే వర్షాలు పడతాయని చెబుతున్న ముఖ్యమంత్రి, జూలై, ఆగస్టుల్లో కరవు విలయతాండవం చేస్తుంటే ఎందుకు ప్రార్థనలు చేయలేదు? ఇప్పుడు కొత్తగా లక్ష కోట్లతో హార్టికల్చర్ హబ్ అంటూ ప్రకటనలు చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు కేవలం రూ.2,900 కోట్లే ప్రిలిమినరీగా ఇస్తే, మిగతా రూ.37 వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పే దిక్కులేదు. ప్రచార ఆర్భాటాలతో ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలి.

ప్రభుత్వానికి ప్రధాన డిమాండ్లు:

కరువు పరిస్థితుల్లో పంటలు ఎండిపోయి, వలసల బాటలో ఉన్న రైతులను ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యత తప్ప దయ కాదు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం తక్షణమే పంట వేసి పూర్తిగా నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి రూ.25,000 తక్షణ పరిహారం చెల్లించాలి.  వర్షాభావంతో దుక్కి దున్ని విత్తనం వేయలేకపోయిన రైతులకు ఎకరానికి రూ.15,000 ఆర్థిక సాయం అందించాలి.  ఎండిపోతున్న పండ్ల తోటలకు లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ ద్వారా నీటి వసతి కల్పించాలి. రబీ సీజన్ కోసం రైతులకు 75 శాతం సబ్సిడీపై విత్తనాలు వెంటనే సరఫరా చేయాలి.  కరవు ప్రాంతాల్లో ఉచితంగా పశుగ్రాసం, తాగునీటి సరఫరాను యుద్ధప్రాతిపదికన చేపట్టడంతో పాటు...  ఉపాధి హామీ పథకం పని దినాలను 150 రోజులకు పెంచి, వ్యవసాయ అనుసంధాన పనులకు వినియోగించాలని ఎం వీ యస్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. 

Back to Top