మచిలీపట్నం: కృష్ణా యూనివర్సిటీలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యంపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కనీస సౌకర్యాలు కల్పించకుండా అరకొర ఏర్పాట్లతో చేతులు దులిపేసుకున్నారని మండిపడ్డారు. ఉదయం 6 గంటలకే విధులకు హాజరైన కౌంటింగ్ సిబ్బందికి గంటలు గడిచినా కనీసం టీ, టిఫిన్ కూడా అందించకపోవడంతో వారు ఆకలితో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఒకవైపు ఎన్నికల అధికారులు ఏసీ గదుల్లో కూర్చుంటే, మరోవైపు కౌంటింగ్ సిబ్బంది వర్షంలో తడుస్తూ, తిండి లేక అవస్థలు పడుతున్నారని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాలివాన బీభత్సం సృష్టిస్తున్న సమయంలో కౌంటింగ్ కేంద్రాలకు వచ్చే సిబ్బందికి ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో కౌంటింగ్ వాయిదా వేస్తే వచ్చే నష్టమేమిటని ఎన్నికల కమిషన్‌ను నిలదీశారు. ప్రజలు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి పరిస్థితులు అనుకూలించే వరకు కౌంటింగ్ వాయిదా వేయాలని పేర్ని నాని సూచించారు.