తాడేపల్లి: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే పలు కేంద్రాల్లో గందరగోళం, అవాంతరాలు చోటుచేసుకున్నాయి. వైయస్ఆర్ జిల్లా జమ్మలమడుగులోని గర్ల్స్ కాలేజీ కౌంటింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ వైయస్ఆర్‌సీపీ కౌంటింగ్‌ను బహిష్కరించింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రిగ్గింగ్ ద్వారా సాధించిన ఓట్లకు లెక్కింపు ప్రక్రియ నామమాత్రమేనని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. పార్వతీపురం మున్సిపల్ కౌంటింగ్ కేంద్రంలో స్ట్రాంగ్ రూమ్ తాళాలు కనిపించకపోవడంతో ఉదయం 9 గంటల వరకు లెక్కింపు ప్రారంభం కాలేదు. అనంతరం అభ్యర్థులు, పార్టీ ప్రతినిధులతో చర్చించి, వారి అంగీకారంతో తాళాలు పగలగొట్టి స్ట్రాంగ్ రూమ్ తెరవడానికి అధికారులు సన్నాహాలు చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కౌంటింగ్ ఏజెంట్లను హాల్‌లోకి అనుమతించకపోవడంతో వారు బయటే వేచి ఉండాల్సి వచ్చింది. మాచర్లలో కౌంటింగ్ కేంద్రం వద్దకు మీడియాను పోలీసులు అనుమతించకపోవడంతో జర్నలిస్టులు బయట నిరీక్షించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ శ్రీనివాసరావు అధికారులకు, పోలీసులకు ఆదేశాలు ఇస్తున్నట్లు సమాచారం రావడంతో కౌంటింగ్ కేంద్రం వద్ద చర్చనీయాంశమైంది. కృష్ణా యూనివర్సిటీలో మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ తుఫాను ప్రభావంతో ఆలస్యమైంది. కోనసీమ జిల్లా అమలాపురంలో విద్యుత్ సరఫరా సమస్యతో జనరేటర్ ద్వారా కౌంటింగ్ కేంద్రానికి విద్యుత్ అందించగా, జనరేటర్ మొరాయించడంతో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో అల్పాహారం అందక కౌంటింగ్ సిబ్బంది ఎదురుచూడటంతో లెక్కింపు ప్రక్రియ ఆలస్యమైంది.