నాయి బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలి

సజ్జల రామకృష్ణారెడ్డికి వినతిపత్రం

 తాడేపల్లి: నాయి బ్రాహ్మణ సామాజికవర్గం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘాల సమన్వయ కమిటీ ప్రతినిధులు వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి చేపట్టిన పలు కార్యక్రమాలను ప్రతినిధులు సజ్జల దృష్టికి తీసుకెళ్లారు. క్షౌర వృత్తిదారులకు ఆర్థిక సహాయం, సెలూన్లకు ఉచిత విద్యుత్‌, నాయి బ్రాహ్మణ సంక్షేమానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు, దేవాలయాల్లో పనిచేస్తున్న క్షౌర వృత్తిదారులకు వేతనాల పెంపు వంటి అంశాలను ప్రస్తావించారు.

నాయి బ్రాహ్మణులకు 50 సంవత్సరాలకే పింఛన్‌ సదుపాయం కల్పించాలని, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్‌కు ప్రత్యేక నిధులు కేటాయించాలని, బీసీ రిజర్వేషన్‌ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. నాయి బ్రాహ్మణ కులవృత్తిదారులకు ఉచిత విద్యుత్‌ పరిమితిని పెంచడంతో పాటు, సెలూన్లకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయి బ్రాహ్మణులకు తగిన సంఖ్యలో సీట్లు కేటాయించి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని, నాయి బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సజ్జల రామకృష్ణారెడ్డిని కోరారు. తమ సమస్యలను సావధానంగా విన్న సజ్జల, నాయి బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.

Back to Top