ఎల్‌నినో ప్రభావంతో అల్లాడుతున్న నెల్లూరు జిల్లా

కరువు జిల్లాగా ప్రకటించకుండా తీరని ద్రోహం చేసిన కూటమి ప్రభుత్వం

ప్రభుత్వ తీరుపై కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజం

ఎల్‌నినో ప్రభావం, కరువు మండలాలపై నెల్లూరు జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించిన వైయస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి  జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం విజయ్‌కుమార్‌తో పాటు, పలువురు వైయస్సార్సీపీ నేతలు.

అనంతరం నెల్లూరు కలెక్టరేట్‌ వద్ద మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి. 

వైయస్‌.జగన్‌ కట్టించిన ఇళ్లకు రిబ్బన్‌ కటింగ్‌లు 

తాను చేయని పనులకు క్రెడిట్‌ కొట్టేస్తున్న ‘దగుల్బాజీ సీఎం’ చంద్రబాబు:

కాకాణి గోవర్థన్‌రెడ్డి ఫైర్‌

నెల్లూరు: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నా, నెల్లూరు జిల్లాలోని 35 గ్రామీణ మండలాల్లో ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించకపోవడం కూటమి ప్రభుత్వ దుర్మార్గ వైఖరికి నిదర్శనమని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖర్‌ రెడ్డి, ఆనం విజయ్‌ కుమార్‌లతో కూడిన వైఎస్సార్సీపీ బృందం జిల్లా కలెక్టర్‌కు సమగ్ర వినతి పత్రం అందజేసింది. 
    ఈ సందర్బంగా నెల్లూరు జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులను వివరిస్తూ కరువు మండలాలను వెంటనే ప్రకటించాలని, అదే విధంగా నెల్లూరు నగర కార్పొరేషన్‌ పరిధిలోని వివిధ డివిజన్లలో జరుగుతున్న భారీ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిరుపేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థల పట్టాలకు కేవలం రంగులు, పేర్లు మార్చి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సమక్షంలో సీఎం చంద్రబాబు నాయుడు డబ్బా కొట్టుకుంటూ క్రెడిట్‌ చోరీకి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై కేంద్ర మంత్రికి తప్పుడు నివేదికలు ఇచ్చి అభాసుపాలు చేశారని, ఇతరులు చేసిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకుంటూ చంద్రబాబు దగుల్బాజీ ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోవడం ఖాయమని చురకలంటించారు.
ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే..:

కరువు మండలాల ప్రకటనలో తీవ్ర నిర్లక్ష్యం:
    ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో రైతులు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. నెల్లూరు జిల్లాలో 35 గ్రామీణ మండలాలు ఉంటే ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించకపోవడం అత్యంత దుర్మార్గం. కరువు మండలాల ప్రకటనలో తీవ్ర జాప్యం చేసి, తీరా ఒక రోజు వర్షం పడగానే భూమిలో తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి సాకులు వెతకడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. రాష్ట్రమంతటా జులైలో సాగు మొదలైతే, నెల్లూరు జిల్లాలో తొలి పంట అక్టోబర్, నవంబర్‌ నెలల్లో ప్రారంభమవుతుంది. నెల్లూరు జిల్లా వాతావరణ పరిస్థితులు, ప్రత్యేక సాగు సీజన్లపై ఈ ప్రభుత్వానికి కనీస అవగాహన లేదు.

నీటి యాజమాన్య వైఫల్యంతో తొలి పంటకు తీరని అన్యాయం:
    5.20 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్న ప్రధానమైన తొలి పంటకు నీళ్లివ్వకుండా కూటమి ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేసింది. సోమశిల, కండలేరు జలాశయాల్లో 93 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నా, సరైన నీటి యాజమాన్య పద్ధతులు పాటించకుండా వథా చేశారు. కేవలం 18 నుంచి 20 టీఎంసీలతో పూర్తయ్యే రెండో పంటకు ఏకంగా 64 టీఎంసీల నీటిని ఖర్చు చేసి చేతులెత్తేశారు. శ్రీశైలం నుంచి సోమశిలకు నీళ్లు తరలించే అవకాశం ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వనని మొండికేశారు. పెన్నా పరివాహక ప్రాంత రైతుల రిపేరియన్‌ హక్కుల కోసం నెల్లూరు బ్యారేజీ వద్ద పోరాడితే మాపై అక్రమ కేసులు బనాయించారు. రైతుల సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపుతామన్నట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పుట్టి వడ్లు రూ. 28 వేల నుంచి రూ. 30 వేలు పలుకుతున్న ప్రస్తుత తరుణంలో తొలి పంటకు నీళ్లు ఎగ్గొట్టి అన్నదాతల పొట్ట కొట్టారు. 

చంద్రబాబు అడుగుపెడితే కరువే.. సాగుపై అవగాహన లేని మంత్రులు:
    వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి హయాంలో ఉచిత పంటల బీమా అమలు చేసి రైతులను కంటికి రెప్పలా కాపాడుకున్నాం. చంద్రబాబు అడుగుపెట్టిన ప్రతిసారీ రాష్ట్రంలో కరువు కాటకాలు తాండవిస్తాయన్నది జగమెరిగిన సత్యం. చంద్రబాబు, కరువు కవల పిల్లల్లాంటి వారు. విశాఖలో ప్రార్థిస్తే 27 సెంటీమీటర్ల వర్షం పడిందని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు, మొన్న ఉదయగిరి వచ్చినప్పుడు ఎందుకు ప్రార్థన చేయలేదు? జిల్లా ప్రజలు ఏం పాపం చేశారు?. వ్యవసాయంపై జిల్లా మంత్రులకు ఏమాత్రం అవగాహన లేదు, రైతు కష్టాలను వారు ఏకోశానా పట్టించుకోవడం లేదు. 

కేంద్ర మంత్రితో పరస్పర భజనలు. కరువుపై తప్పుడు నివేదికలు:
    కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ రాష్ట్రానికి వస్తే ఆయనకు కరువు పరిస్థితులపై తప్పుడు నివేదికలు ఇచ్చి అభాసుపాలు చేశారు. కేంద్ర మంత్రితో రాష్ట్ర ప్రభుత్వం పరస్పర భజనలు చేయించుకోవడానికే సరిపోయింది తప్ప రైతులను ఆదుకునే ఆలోచనే చేయలేదు. ఎన్నికల హామీల్లో చెప్పినట్లుగా పేదలకు రెండు సెంట్లు, మూడు సెంట్ల స్థలాల్లో ఇప్పటివరకు ఒక్క గజమైనా ఇచ్చారా?. 

వైయస్‌ జగన్‌ కట్టిన ఇళ్లకు చంద్రబాబు రిబ్బన్‌ కటింగ్‌లు:
    వైఎస్సార్సీపీ హయాంలో కట్టిన జగనన్న కాలనీలకు పేర్లు మార్చి పీఎంఏవై–ఎన్టీఆర్‌ నగర్‌లుగా ప్రచారం చేసుకుంటున్నారు. 5.50 లక్షల గహ ప్రవేశాలు చేశామని చంద్రబాబు చెబుతున్నవన్నీ జగన్‌ గారి హయాంలో పూర్తయిన ఇళ్లే, ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు, పట్టాలు నా వద్ద ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన నివేశన స్థల పట్టాలకు కేవలం రంగులు మార్చి తామే ఇచ్చినట్లుగా డబ్బా కొట్టుకుంటున్నారు. జగన్‌ మోహన్‌ రెడ్డి గారి ఆలోచనతో 17 వేలకు పైగా జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి 19 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఒక్కో ఇంటి నిర్మాణానికి జగన్‌ గారు రూ. 1.80 లక్షల నగదు, ఉచిత ఇసుక, సబ్సిడీ మెటీరియల్‌తో కలిపి రూ. 2.70 లక్షల మేర లబ్ధి చేకూర్చారు. అమరావతిలో 50,793 మంది పేదలకు జగన్‌ గారు ఇళ్లు ఇస్తే చంద్రబాబు కోర్టులకు వెళ్లి అడ్డుపడ్డారు. పేదలకు పట్టాలిచ్చేందుకు మా హయాంలో తెచ్చిన జీవోలకే (జీవో 55, జీవో 23) టెర్మినాలజీ మార్చి, తానేదో కొత్తగా చేసినట్టు జీవో నెం. 306 పేరిట చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. నిన్న బుర్రపాలెంలో జగన్‌ గారు కట్టించిన ఇళ్లకు కేంద్ర మంత్రితో చంద్రబాబు రిబ్బన్‌ కటింగ్‌లు చేయించడం సిగ్గుచేటు. ఇళ్లు ఇచ్చింది జగన్‌ గారైతే.. క్రెడిట్‌ కొట్టేయాలని చూడటం దగుల్బాజీ తనం. 27 నెలల్లో రూ. 4 లక్షల కోట్ల అప్పులు తెచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ లక్ష కోట్లతో హబ్‌లు పెడతానంటే ప్రజలు ఎవరూ నమ్మరు. 
    ఈ నేపధ్యంలో నెల్లూరు జిల్లాలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉన్న మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని జిల్లా కలెక్టర్‌ స్పష్టమైన హామీ ఇచ్చారని కాకాని గోవర్ధన్‌ రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు కార్పొరేషన్‌ పరిధిలోని డివిజన్లలో జరుగుతున్న అక్రమాలపై త్రీమెన్‌ కమిటీ వేసి సమగ్ర విచారణకు హామీ ఇచ్చారని చెప్పారు.

Back to Top