పోలాకి: పోలాకి మండలంలో వైయస్ఆర్సీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, యువ నాయకుడు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమష్టిగా సన్నద్ధం కావాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలో పార్టీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా పార్టీ శ్రేణులు ఐక్యంగా కృషి చేయాలని కోరారు. యువ నాయకుడు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు. కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసే అధికారులపై, కూటమి నాయకులపై ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తామని చెప్పారు. పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న కార్యకర్తలకు ఐడీ కార్డులు అందజేస్తామని తెలిపారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డులను పంపిణీ చేశారు. ఐదేళ్ల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసిన మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలను ఘనంగా సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.