రాజకీయాల్లో ఉండాలంటే చాలెంజింగ్‌గా పనిచేయాలి

భీమిలి నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఆత్మీయ సమావేశంలో సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ

విశాఖపట్నం: భీమిలి నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఆత్మీయ సమావేశం విశాఖలో ఉత్సాహంగా జరిగింది. సమావేశానికి మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, రీజినల్‌ కోఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, బూడి ముత్యాలనాయుడు, బొత్స ఝాన్సీ, బొత్స అనూష, కేకే రాజు, వరుదు కల్యాణి, బెల్లాన చంద్రశేఖర్‌ తదితరులు హాజరయ్యారు. భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లో ఉండాలి: బొత్స సత్యనారాయణ

మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాజకీయాల్లో ఉండేవారు చాలెంజింగ్‌గా పనిచేయాలని, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగాలని సూచించారు. భీమిలి నియోజకవర్గంలోని మూడున్నర లక్షల మంది ప్రజలతో నాయకులు మమేకం కావాలని, వారి సమస్యలను తెలుసుకుని నిరంతరం పోరాడాలని అన్నారు. భీమిలిలో మంచినీటి సమస్య ఉందని, ప్రజలకు కనీస అవసరాలు అందేలా ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు.

భీమిలి ప్రజలకు తమ కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బొత్స సత్యనారాయణ భరోసా ఇచ్చారు. బెదిరింపులకు భయపడకుండా కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, తాను వారి వెంట ఉంటానని చెప్పారు. తమ కుటుంబం నామినేటెడ్‌ పదవులు తీసుకోకుండా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి పదవులు పొందిందని పేర్కొన్నారు.

ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలి: కురసాల కన్నబాబు

వైయ‌స్ఆర్‌సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు మాట్లాడుతూ బొత్స అనూష పేరును నియోజకవర్గ నేతలు ఏకగ్రీవంగా ప్రతిపాదించారని తెలిపారు. అనూష వారసత్వంగా రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. విశాఖలో భూముల కేటాయింపులకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు.

జగన్‌ పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: బొత్స అనూష

బొత్స అనూష మాట్లాడుతూ తనపై వైఎస్‌ జగన్‌ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. భీమిలి నియోజకవర్గంతో బొత్స కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. జగన్‌ రూపంలో భీమిలి ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందని పేర్కొన్నారు. సూపర్‌ సిక్స్‌ హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటు, భీమిలిలోని సమస్యలపై పెద్దఎత్తున పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని చెప్పారు.

వైయ‌స్ఆర్‌సీపీ నదీ ప్రవాహం లాంటిది: వరుదు కల్యాణి

వరుదు కల్యాణి మాట్లాడుతూ వైయ‌స్ఆర్‌సీపీ నదీ ప్రవాహం లాంటిదని అన్నారు. నాయకులు వస్తుంటారు.. పోతుంటారని, కార్యకర్తలు మాత్రం పార్టీతోనే ఉంటారని చెప్పారు. వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో కార్యకర్తలు ఐక్యంగా పార్టీ బలోపేతానికి పనిచేస్తారని పేర్కొన్నారు.

యువతకు జగన్‌ పెద్దపీట: పుష్పశ్రీవాణి

మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ యువతకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. తక్కువ కాలంలోనే బొత్స అనూష తనదైన ముద్ర వేసుకున్నారని, భీమిలి నుంచి ఆమె రాజకీయ ప్రస్థానానికి తొలి అడుగు పడిందన్నారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

స్థానిక ఎన్నికల్లో పార్టీ జెండా ఎగరాలి: కేకే రాజు

విశాఖ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి, అధికారం పోయిన తర్వాత పార్టీని వీడుతున్న నాయకులు ఉన్నారని అన్నారు. బొత్స అనూషకు కార్యకర్తలు అండగా నిలవాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ జెండా ఎగరేలా అందరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

భీమిలిలో వైయ‌స్ఆర్‌సీపీకి బలమైన క్యాడర్‌: గుడివాడ అమర్‌నాథ్‌

మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ భీమిలిలో వైయ‌స్ఆర్‌సీపీకి బలమైన క్యాడర్‌ ఉందన్నారు. బొత్స అనూష పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని, ఆమెకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారని చెప్పారు. భీమిలిలో కొండలు, భూములకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు.

బొత్స బ్రాండ్‌ నుంచి మరో వారసురాలు: బూడి ముత్యాలనాయుడు

బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ ఒక బ్రాండ్‌ అని, ఆ బ్రాండ్‌ నుంచి మరో వారసురాలు రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. చిన్న వయసులోనే బొత్స అనూష భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టారని, పార్టీ శ్రేణులు ఆమెకు అండగా నిలవాలని కోరారు.

Back to Top