కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్‌.. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా

 హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం.. 

రాయచోటిని జిల్లా కేంద్రంగా తొలగించి ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్నారు: గడికోట శ్రీకాంత్‌రెడ్డి

రాయచోటి:  కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకునేది లేదని, ప్రతి కార్యకర్తకు ఎల్లవేళలా అండగా ఉంటానని, ప్రజల కోసం, పార్టీ కోసం చివరి శ్వాస వరకు పోరాడతానని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సంబేపల్లె మండలం గుట్టపల్లె కళ్యాణ మండపంలో సోమవారం వైయ‌స్ఆర్‌సీపీ వివిధ హోదాల్లో బాధ్యతలు స్వీకరించిన నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాంత్‌రెడ్డి కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. Pasted text

 హామీల అమలులో కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన శ్రీకాంత్‌రెడ్డి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 30 నెలలు గడుస్తున్నా ఎన్నికల హామీల అమలు ఎక్కడని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1,500, 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్‌, నిరుద్యోగ యువతకు రూ.3 వేల భృతి ఏమైందని నిలదీశారు. కూటమి ప్రభుత్వం ఒక్క కొత్త పెన్షన్‌, ఒక్క కొత్త ఇల్లు అయినా మంజూరు చేసిందా అని ప్రశ్నించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో చట్టం తీసుకురావాలని, వైయ‌స్ఆర్‌సీపీ మద్దతిస్తుందని స్పష్టం చేశారు.  

 రాయచోటి జిల్లా కేంద్రం తొలగింపుతో ప్రాంతానికి నష్టం

రాయచోటిని జిల్లా కేంద్రంగా తొలగించడం వల్ల ఈ ప్రాంత అభివృద్ధికి తీవ్ర నష్టం జరిగిందని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రం కొనసాగి ఉంటే ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగులు, వ్యాపార కార్యకలాపాలతో ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించేదని పేర్కొన్నారు. జిల్లా కేంద్రం తొలగింపుతో వ్యాపారాలు దెబ్బతిన్నాయని, నిర్మాణ రంగం మందగించడంతో భవన నిర్మాణ కార్మికులకు పనులు తగ్గాయని తెలిపారు.  

 కార్యకర్తలే నా ప్రాణం

తన 18 ఏళ్ల రాజకీయ జీవితంలో వ్యక్తిగత దూషణలకు, అగౌరవ రాజకీయాలకు తావివ్వలేదని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. తనకంటే చిన్నవారినైనా గౌరవంగా సంబోధించడం తమ పెద్దలు నేర్పిన సంస్కారమని చెప్పారు. అయితే వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తల జోలికి వస్తే మాత్రం సహించేది లేదని, ప్రతి కార్యకర్తకు ఎల్లవేళలా తోడుగా ఉంటానని స్పష్టం చేశారు.  

 స్థానిక ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ జెండా ఎగరాలి

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొని నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో వైయ‌స్ఆర్‌సీపీ జెండా ఎగరేలా ప్రతి కార్యకర్త కష్టపడాలని శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే కార్యకర్తలు, ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పాలన సాగిస్తామని అన్నారు. శ్రీనివాసపురం, జరికోన కాలువల అసంపూర్తి పనులను అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా పూర్తి చేసి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. 

కరువు పరిస్థితులపై ప్రభుత్వాన్ని నిలదీత

సంబేపల్లె మండలంతో పాటు నియోజకవర్గంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మామిడి, ఇతర పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం రైతులను ఆదుకునే చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు, పంటలు సాగు చేయలేని రైతులకు ఎకరాకు రూ.15 వేల చొప్పున తక్షణ పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. 

కార్యకర్తల గుర్తింపు కార్డులు కేవలం పార్టీ పదవికి గుర్తింపు మాత్రమే కాకుండా పార్టీ తమపై ఉంచిన బాధ్యతకు ప్రతీక అని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. గుర్తింపు కార్డుదారులు ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ అందిస్తారని తెలిపారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. 

కార్యక్రమంలో ఆవుల విష్ణువర్ధన్‌రెడ్డి, చిదంబర్‌రెడ్డి, గొర్ల ఉపేంద్రారెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఆనందరెడ్డి, సేఠ్‌ వెంకటరమణారెడ్డి, వడ్డీ వెంకటరమణారెడ్డి, గొర్ల రమేష్‌రెడ్డి, ఆవుల మల్లికార్జునరెడ్డి, గుండా సురేంద్ర, చుక్కా అంజనప్ప తదితర నాయకులు పాల్గొన్నారు. శ్రీకాంత్‌రెడ్డికి నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. 

Back to Top