జల్‌జీవన్ మిషన్‌పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పిన‌వ‌న్నీ అబద్ధాలు 

రాచమల్లు శివప్రసాదరెడ్డి ఫైర్ 

 జగన్ హయాంలోనే 87 శాతం జల్‌జీవన్ పనులు పూర్తి చేశాం 

జ‌ల్ జీవ‌న్ మిష‌న్‌తో ప్రొద్దుటూరుకి సంబంధమే లేదు 

 రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద రెడ్డి స్ప‌ష్టీక‌ర‌ణ 
 
ప్రొద్దుటూరు లోని త‌న క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైఎస్సార్సీపీ అధికార ప్ర‌తినిధి, మాజీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద రెడ్డి

 2019-24 మధ్య జల్‌జీవన్ మిషన్ రద్దయిందని చెప్పడం పచ్చి అబద్ధం

మోదీతో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడి ఆ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చినట్టు పవన్ కళ్యాణ్ బిల్డ‌ప్ 

 2028 డిసెంబర్ వరకు జలజీవన్ మిషన్‌ను కేంద్ర ప్రభుత్వమే దేశవ్యాప్తంగా పొడిగించింది

 40 వేల ఇళ్లకు నీళ్లిచ్చింది జగన్ ప్రభుత్వం.. దానికి ఇప్పుడు చంద్ర‌బాబు క్రెడిట్ చోరీ 

 ప్రొద్దుటూరుకు చంద్రబాబు ఎందుకొచ్చారు.. ఏం చేశారో ప్ర‌జ‌ల‌కు చెప్పాలి 

  రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద‌రెడ్డి డిమాండ్ 

 రాయలసీమ పేరుతో మరోసారి మోసం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు

 అమ‌రావ‌తికి జ‌గ‌న్‌, చంద్ర‌బాబులు ఏం చేశారో ప్ర‌జ‌ల ముందు చ‌ర్చ‌కు వెళ‌దామా? 

 చంద్ర‌బాబు ఉన్నంత కాలం నాలుగు ఇంజిన్లు పెట్టినా రాష్ట్రంలో అభివృద్ధి జ‌ర‌గ‌దు 

 మద్యం, మాంసం, డబ్బు పంచినా స‌భ‌కు జనాన్ని రప్పించలేక పోతున్నారు 

 చంద్రబాబు పాల‌న అంతా మేకప్.. మీడియా మేనేజ్మెంట్ 

 ⁠అబ‌ద్ధాల‌తో ప్రజలను ఇక మోసంOkay.  చేయ‌లేరు 

 ప‌్రెస్‌మీట్‌లో చంద్ర‌బాబును కడిగి పారేసిన రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద రెడ్డి

ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరుకు వ‌చ్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు ప్రజలకు అబద్ధాలు, మాయమాటలు చెప్పి వెళ్లారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. ప్రొద్దుటూరులోని త‌న క్యాంప్ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల ప్రొద్దుటూరు పర్యటన పూర్తిగా పైన పటారం లోన లొటారం అని తేల్చిచెప్పారు.  జల్‌జీవన్ మిషన్ పేరుతో ప్రొద్దుటూరులో కార్యక్రమం నిర్వహించినా, ఆ పథకానికి ప్రొద్దుటూరు పట్టణానికి అసలు సంబంధమే లేదన్నారు. 2019-24 మధ్య జల్‌జీవన్ మిషన్ రద్దయిందని చెప్పడం పచ్చి అబద్ధమని, చంద్రబాబు ప్రత్యేకంగా నరేంద్ర మోడీతో మాట్లాడి ఆ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చినట్టు పవన్ కళ్యాణ్ చెప్పడం కూడా వాస్తవాలకు విరుద్ధమని మండిపడ్డారు. 2028 డిసెంబర్ వరకు జలజీవన్ మిషన్‌ను కేంద్ర ప్రభుత్వమే దేశవ్యాప్తంగా పొడిగించిందని, చంద్రబాబు ప్రత్యేకంగా సాధించిన ఘనత ఏమీ లేదని స్ప‌ష్టం చేశారు. వైఎస్ జగన్ గారి ప్రభుత్వ హ‌యాంలోనే జల్‌జీవన్ మిషన్, అమృత్ పథకాల కింద భారీగా పనులు చేపట్టి, ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు. ప్రొద్దుటూరు లోనే 40 వేల ఇళ్లకు శుద్ధి చేసిన తాగునీటిని అందించామని తెలిపారు. 
     జగన్ హయాంలోనే వేల కోట్ల రూపాయలతో జల్‌జీవన్ పనుల్లో 87 శాతం వరకు పూర్తి చేశామని, ఇప్పుడు మిగిలిన పనులకు చంద్రబాబు ప్రభుత్వం కొత్త ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. ప్రొద్దుటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులపై కూటమి ప్రభుత్వం క్రెడిట్ తీసుకోవడం ఆపి, తాము చేసిన పనుల లెక్కను ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరుకు ఇచ్చిన హామీల్లో రెండేళ్లలో ఏవి నెరవేర్చారో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. రాష్ట్రంలో రెండేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, కేవలం అబద్ధాలు, మోసాలతో కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఒక్క మంచిపనీ చేయని కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, రాయలసీమకు చేసిన ద్రోహాన్ని ఆయన ప్రజల ముందు ఉంచారు. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని, నేడు రాయ‌ల‌సీమ‌కు జరుగుతున్న దోపిడీని ఎండగడుతూ రాబోయే రోజుల్లో జగన్ గారి నాయకత్వంలోనే రాష్ట్రానికి మేలు జ‌రుగుతుంద‌ని స్పష్టం చేశారు.

ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే... 

జ‌ల్‌జీవ‌న్ మిష‌న్‌తో ప్రొద్దుటూరుకి సంబంధమే లేదు:  
చంద్రబాబు ప్రొద్దుటూరుకు వ‌చ్చి జల్‌జీవన్ మిషన్ పేరుతో ఇక్కడ కార్యక్రమం చేశారు. కానీ ప్రొద్దుటూరు పట్టణానికి జల్‌జీవన్ మిషన్‌తో అసలు సంబంధమే లేదు. ఏ పనులు ఎక్కడ చేస్తున్నారు? వాటి వల్ల ప్రొద్దుటూరు ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏమిటో చంద్రబాబు స‌మాధానం చెప్పాలి. 2019-24 మధ్య జల్‌జీవన్ మిషన్ రద్దయిందని చెప్పడం పచ్చి అబద్ధం. చంద్రబాబు ప్రత్యేకంగా నరేంద్ర మోడీతో మాట్లాడి జల్‌జీవన్ మిషన్‌ను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చినట్టు పవన్ కళ్యాణ్ చెప్పడం కూడా వాస్తవాలకు విరుద్ధం. కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న పథకాన్ని చంద్రబాబు తన ఘనతగా చెప్పుకోవడం ఏమిటి? జ‌లజీవన్ మిషన్ అనేది వైఎస్ జగన్ గారి ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వం ద్వారా 26 వేల కోట్ల రూపాయలతో శాంక్షన్ అయిన పనులు. పులివెందుల తాలూకాలో 480 కోట్లతో చేపట్టిన పనులను మా ప్రభుత్వంలోనే 86 నుండి 87 శాతం పూర్తి చేశాం. కేంద్ర ప్రభుత్వమే దేశమంతా జలజీవన్ మిషన్ గడువును 2028 డిసెంబర్ వరకు పొడిగిస్తే, ఇది ఏదో చంద్రబాబు తెచ్చినట్లు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అవే అబద్ధాలు వల్లించారు. 2019 ఫిబ్రవరి నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 30,72,000 కొళాయి కనెక్షన్లు ఉంటే, జగన్ హయాంలో మరో 38,74,000 ఇళ్లకు నీళ్లు ఇచ్చాం. ఇప్పుడు మిగిలిపోయిన పనులకు కొత్త రంగులు వేసుకుని, కొత్త ప్రచారం చేసుకుంటూ తామే చేశామని చెప్పుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.

వైఎస్సార్సీపీ హ‌యాంలో ప్రొద్దుటూరులోనే 40 వేల ఇళ్ల‌కు తాగునీరు: 

ఇంటింటికీ కుళాయి కనెక్షన్లపై అసలు వాస్తవాలు ప్రజలకు తెలియాలి. ప్రొద్దుటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 40 వేల ఇళ్లకు శుద్ధి చేసిన తాగునీటిని అందించింది. శ్రీశైలం నుంచి గండికోటకు, గండికోట నుంచి మైలవరానికి, అక్కడి నుంచి ప్రొద్దుటూరుకు నీటిని తీసుకొచ్చాం. 2023 ఆగస్టులోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాం. శ్రీశైలం నీటి మట్టం పడిపోయినా రాయలసీమకు కృష్ణా జలాలు అందించాలనే లక్ష్యంతో జగన్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం తెచ్చింది. మేము చేసిన పనులకు ఇప్పుడు కొత్త రంగులు వేసుకుని చంద్రబాబు ప్రచారం చేసుకుంటూ క్రెడిట్ చోరీకి పాల్ప‌డుతున్నాడు. ప్రొద్దుటూరుకు కూట‌మి ఇచ్చిన హామీలు రెండేళ్లలో ఏమయ్యాయి? ఎస్వీఎన్‌ఆర్ గవర్నమెంట్ కాలేజీ అభివృద్ధి పనులు ఏమయ్యాయి? కొత్త బస్‌స్టాండ్ పరిస్థితి ఏమిటి? మీరు పూర్తి చేసిన పనులు ఏవి? ప్రజలకు లెక్క చెప్పండి. రాష్ట్ర ప్రజలకు రూ.30 వేల కోట్లతో నీళ్లు తెస్తామని చెబుతున్నారు. ఆ లెక్క ఏమిటో చెప్పండి. మేము చేసిన పనులను మాత్రం చూపించకుండా మీ ప్రచారం మాత్రమే చూపించుకుంటే ప్రజలు నమ్మరు. తాలమాపురం గ్రామానికి మా ఐదు సంవత్సరాల కాలంలో 33 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఇచ్చి, కోటి 20 లక్షలతో స్కూల్ డెవలప్మెంట్ చేశాం. కానీ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఇసుక దొంగలు రాజ్యమేలుతున్నారు. ఒక్క చౌడూరు గ్రామంలోనే రోజూ 30 లక్షల రూపాయల ఇసుక అమ్ముకుంటున్నారు. 

రాయ‌ల‌సీమ‌కు మాట‌లు.. అమ‌రావ‌తికి డ‌బ్బుల మూట‌లు: 

రాయలసీమ పేరుతో మరోసారి ప్రజలను మోసం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. అమరావతికి డబ్బుల మూటలు.. రాయలసీమకు మాటలు అన్నట్టుగా మీ ప్రభుత్వ విధానం ఉంది. రాయలసీమకు వైఎస్ రాజశేఖరరెడ్డి గారు, వైఎస్ జగన్ గారు చేసిన మేలును రాయలసీమ ప్రజలు మర్చిపోలేరు. చంద్రబాబు రాయలసీమకు చేసింది ఏంటి? ఈ రెండు అంశాలపై బహిరంగంగా చర్చకు రావడానికి మీరు సిద్ధమా? రాయలసీమ నుంచి అమరావతికి సంస్థలను తరలించే ప్రయత్నాలపై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వర్కుల పంపకంలో రాయలసీమకు జరిగిన అన్యాయంపై కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. తిరుపతిలో మేము తెచ్చిన స్కిల్ యూనివర్సిటీని, నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీని అమరావతికి తరలించి సీమకు తీవ్ర ద్రోహం చేశారు. రాయలసీమకు నిజమైన బిడ్డలు వైయస్సార్, జగన్మోహన్ రెడ్డి మాత్రమే. రాయలసీమకు ద్రోహం చేసింది మాత్రం చంద్రబాబే. జగన్ గారు రాయలసీమకు చేయనిది ఏంటి? చంద్రబాబు గారు, మీరు చేసినది ఏంటి? బహిరంగ చర్చకు రండి. ప్రజల ముందే లెక్కలు తేల్చుకుందాం.

గొడ్డ‌లి పార్టీ ఎవ‌రిదో ప్ర‌జ‌ల‌కు తెలుసు: 

వైఎస్సార్సీపీని గొడ్డ‌లి పార్టీ అని విమ‌ర్శించే చంద్ర‌బాబు.. రెండున్న‌రేళ్లుగా ఆయ‌న పాల‌న‌లో రాయ‌ల‌సీమ ప్రాంతంలో జ‌రిగిన వంద‌కు పైగా హ‌త్య‌ల‌కు స‌మాధానం చెప్పాలి. కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత రెండున్నర సంవత్సరాల కాలంలో కర్నూలు జిల్లాలో 29, అనంతపురంలో 42, సత్యసాయి జిల్లాలో 54 మందిని చంపారు. కనీసం 125 నుంచి 150 మందిని హత్య చేసింది మీరు కాదా? వైఎస్సార్‌సీపీ నాయకత్వంలో ప్రొద్దుటూరు పట్టణానికి మేము తెచ్చిన అభివృద్ధి కార్యక్రమాలను ఈ ప్రభుత్వం గాలికి వదిలేసింది. వంగవీటి రంగా హత్య నుంచి పింగళి దశరథరామ, మల్లెల బాబ్జీ హత్యల వరకు అన్ని వేళ్ళు చంద్రబాబు వైపే చూపిస్తున్నాయి. బామ్మ‌ర్ది నంద‌మూరి బాల‌కృష్ణ ఇంట్లో జ‌రిగిన కాల్పుల‌కు కూడా ప్ర‌జ‌ల‌కు వివ‌ర‌ణ ఇచ్చుకోవాలి. అప్పుడు ఎవ‌రిది గొడ్డ‌లి పార్టీ అనేది ప్ర‌జ‌లే నిర్ణ‌యిస్తారు. ప్రజలను భయపెట్టి, రాజకీయ ప్రత్యర్థులను అణచివేసి అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. చంద్ర‌బాబు వెన్నుపోటు రాజకీయ చరిత్రను కూడా ప్రజ‌లు ఎప్ప‌టిక మ‌ర్చిపోరు. ప్రొద్దుటూరు సభ కోసం రాష్ట్రం నలుమూలల నుంచి 2000 బస్సులు తెప్పించి, 3000 మంది పోలీసులను పెట్టి ప్రజలతో బలవంతంగా ఊడిగం చేయించారు. ప్రొద్దుటూరుకు వచ్చి మా మీద విమర్శలు చేస్తున్నారే, గొడ్డల పార్టీ మీదా? మాదా? 

మేక‌ప్ మాట‌ల‌తో ప్ర‌జ‌ల‌ను మేనేజ్ చేయ‌లేరు: 

ప్రొద్దుటూరులో కూటమి ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమానికి జనాన్ని తరలించేందుకు ఐదు రోజుల పాటు ఉద్యోగులను ఇబ్బంది పెట్టారు. రెండు వేల బస్సులు పెట్టి కూలీలు, బిర్యానీలు, మద్యం ఇచ్చి జనాన్ని తీసుకొచ్చారు. ఇంత చేసినా కనీసం 30 వేల మంది కూడా రాలేదు. వచ్చిన వాళ్లలో ప్రొద్దుటూరు వాళ్లు ఎంతమంది ఉన్నారో కూడా చెప్పాలి. జగన్ గారు రాష్ట్రంలో ఎక్క‌డికైనా పరామర్శకు వెళ్లినా ఇంతకంటే ఎక్కువ మంది స్వచ్ఛందంగా వస్తారు. కూటమి ప్రభుత్వం దింపుడు కళ్లం ఆశలు పెట్టుకుంటోంది. జనాన్ని రప్పించడానికి హీరోలు, హీరోయిన్లు కావాలి. అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు ప్రభుత్వ డబ్బుతో విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతూ ప్రచారం చేసుకోవాలి. మద్యం, మాంసం, డబ్బు ఇచ్చినా జనాన్ని రప్పించలేని పరిస్థితి మీకు వచ్చింది. వచ్చిన వాళ్లు కూడా మీటింగ్ మొదలవగానే వెళ్లిపోతున్నారు. మీ ప్రచారానికి, ప్రజల్లో మీ పలుకుబడికి ఏమాత్రం పొంతన లేదు. చంద్రబాబు గారికి అంతా మేకప్ మాత్రమే. మేకప్ వేసుకుని ఎంత గొప్పగా కనిపించినా ప్రజల తీర్పును మేనేజ్ చేయలేరు.

మోడీతో చంద్ర‌బాబుది ఇచ్చిపుచ్చుకునే బంధం:

డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో ప్రజలను మభ్యపెట్టడం ఆపండి. నరేంద్ర మోడీ గారిది చంద్రబాబుకు సహకారం కాదు.. ఇచ్చిపుచ్చుకోవడం మాత్రమే. పవన్ కళ్యాణ్ తపన ప్ర‌జల కోసం కాదు.. చంద్రబాబు పట్ల బానిసత్వం. ఈ ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజలు ఎలా నమ్మాలి? చంద్రబాబు అనుభవం ప్ర‌తి మంగళవారం అప్పులు తీసుకురావడంలో మాత్రమే పనికొస్తోంది. అప్పులు చేయడం తప్ప రాష్ట్ర ప్రజలను సుభిక్షంగా, సంతోషంగా, శాంతియుతంగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి మీ అనుభవం ఏ మాత్రం ఉపయోగపడలేదు. చంద్రబాబుది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు. ఆయ‌న చేతుల్లో అధికారం ఉన్నంతకాలం నాలుగు ఇంజిన్లు పెట్టినా రాష్ట్రం అభివృద్ధి చెందదు. జగన్ గారి చేతుల్లోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన రోజే రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పథంలోకి వస్తుంది.

పైకి హెచ్చ‌రిక‌లు.. లోలోప‌ల విచ్చ‌ల‌విడి దోపిడీ: 

సంక్షేమ పథకాల అమలు గురించి పైకి పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. కానీ లోపల దోపిడీ, విచ్చలవిడి అవినీతి జరుగుతోంది. మద్యం, గంజాయి, భూములు, పంచాయతీలు, గ్రావెల్, మట్టి వంటి వ్యవహారాల్లో అవినీతి, లంచగొండితనం జరుగుతోంది. బయటకు కొరడా చూపిస్తూ, తెర వెనుక దోపిడీకి పాల్పడుతున్నారు. చౌడూరు గ్రామంలో రోజుకు రూ.30 లక్షల విలువైన ఇసుక అక్రమంగా అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి గారు అక్కడే ఉన్నారు. ఆయన కుమారుడు కొండారెడ్డి గారు కూడా అక్కడే ఉన్నారు. ఇంత పెద్ద స్థాయిలో ఇసుక దందా జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది? ఎస్పీ ఏం చేస్తున్నారు? కలెక్టర్ ఏం చేస్తున్నారు? రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులపై ఆరోపణలు వస్తే చర్యలు తీసుకునే ధైర్యం మీకు ఉందా? ఇది నా సవాల్. చంద్రబాబు ప్రచారం ఎంత చేసుకున్నా, విమానాలు ఎన్ని ఎక్కినా, హెలికాప్టర్లు ఎన్ని ఉపయోగించినా, డబ్బు, మద్యం, మాంసం పెట్టి జనాన్ని తీసుకొచ్చినా ప్రజల మనసుల్లో ఉన్న జగన్ గారి స్థానాన్ని మార్చలేరు. అబద్ధాలు, అప్పులు, క్రెడిట్ చోరీలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లలేరు. జగన్ గారి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజే రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పథంలోకి వస్తుందని రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Back to Top