రాష్ట్రంలో రాజ్యమేలుతున్న ‘స్టేట్ టెర్రరిజం’.. 

పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న చంద్రబాబు:

వైయస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజం.

తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.

అభ్యర్థులపై దాడులు.. నామినేషన్ పత్రాల దహనం, అక్రమ తిరస్కరణలు

ఎన్నికల ప్రక్రియను ప్రహసనంగా మార్చిన ఎస్ ఈ సీ : 

సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్షేపణ

వైయస్సార్సీపీ అభ్యర్ధులు, ప్రజా ప్రతినిధులపై బరితెగించి దౌర్జన్యాలు

ఏమీ తెలియనట్లు సభలు, సమావేశాల్లో నంగనాచి కబుర్లు :

చంద్రబాబు తీరుపై సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ 

తాడేపల్లి : రాష్ట్రంలో జరుగుతున్న నగరపాలక, పురపాలక సంస్థల ఎన్నికల ప్రక్రియను అధికార తెలుగుదేశం పార్టీ పూర్తిగా ప్రహసనంగా మార్చేసిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి స్క్రూటినీ వరకు గత మూడు రోజులుగా రాష్ట్రంలో నడుస్తున్న తతంగం చూస్తే.. అధికారంలో ఉన్న ప్రభుత్వమే వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని 'స్టేట్ టెర్రరిజం'కు పాల్పడితే ఎలా ఉంటుందో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ప్రత్యక్షంగా చూపించారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులను అడ్డం పెట్టుకుని వైయస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకోవడం, నామినేషన్ కేంద్రాల్లోనే అభ్యర్థులపై టీడీపీ గుండాలతో భౌతిక దాడులు చేయించడం, నామినేషన్ పత్రాలు చించివేసి అక్రమంగా తిరస్కరించడం వంటి దుర్మార్గాలకు తెగబడ్డారని ఆరోపించారు. ఇంతటి అరాచకం సృష్టిస్తూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గంటల తరబడి ప్రెస్ మీట్లు పెట్టి, ఏమీ తెలియనట్లు నీతి వాక్యాలు వల్లెవేస్తూ, తాము చేసిన పాపాలను వైయస్సార్‌సీపీపై నెట్టే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సజ్జల ఆక్షేపించారు. 

ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే.. 

పోటీ చేయడమే నేరమా?.. ఎన్నికలంటే ఇంత భయమెందుకు?:  
ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ వేయడమే నేరమన్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అసలు ఇంత  పక్షపాతంగా జరుగుతున్న తతంగానికి  ఎన్నికలు అని పేరు పెట్టడం ఎందుకు? ప్రజల్లో మీకు ఆదరణ ఉంటే, అభివృద్ధి చేసి ఉంటే నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించి ప్రజల ఆశీర్వాదం పొందాలి. సాధారణ ఎన్నికలు వచ్చేది మరో రెండేళ్ల తర్వాత మాత్రమే, అయినా ఎన్నికలంటే చంద్రబాబుకు ఎందుకింత భయం? ప్రజల తీర్పుకు భయపడే పాలకులే ఎన్నికల్లో పోటీని అడ్డుకుంటారు. నామినేషన్ కేంద్రాల్లో టీడీపీ మూకలకు యథేచ్ఛగా ప్రవేశం కల్పిస్తూ, వైయస్సార్‌సీపీ అభ్యర్థులకు అడ్డంకులు సృష్టిస్తున్నారు.  స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం...  చంద్రబాబు పాలనలో  సీఎంఓలో  ఒక విభాగంలా మారిపోయింది.

పోలీసులే టీడీపీ మూకలకు రక్షణ కవచం.. ప్రొద్దుటూరులో దారుణం:   అభ్యర్థులను రక్షించాల్సిన పోలీసులే టీడీపీ గూండాలకు రక్షణ కవచంగా నిలబడి సహకరిస్తున్నారు. ప్రొద్దుటూరులో మా చైర్మన్ అభ్యర్థిని భద్రంగా తీసుకెళ్లి స్క్రూటినీ చేయిస్తామని నమ్మబలికిన పోలీసులే గేటు లోపలికి తీసుకెళ్లి టీడీపీ మూకలకు అప్పగించారు. పోలీసుల సమక్షంలోనే మా అభ్యర్థిపై దాడి చేసి, చొక్కా చించి, మెడలోని బంగారు గొలుసు లాక్కున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డితో ఎస్పీ హామీ ఇచ్చారని ఒప్పించి మరీ తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ దాడులకు నిరసన తెలిపిన మా శ్రేణులపై తిరిగి పోలీసులే లాఠీచార్జ్ చేశారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే కిరాయి మూకల్లా మారారు.

స్క్రూటినీ ముసుగులో విచ్చలవిడి తిరస్కరణలు:  
నామినేషన్ల సమయంలో అడ్డుకోవడమే కాకుండా, నేడు స్క్రూటినీలోనూ మా పార్టీ అభ్యర్థులను కొట్టి పత్రాలు అక్రమంగా తిరస్కరించారు:
నగరి: మా చైర్మన్ అభ్యర్థి నామినేషన్ ఆమోదించబడినట్లు మధ్యాహ్నం రసీదు ఇచ్చి, సాయంత్రం 5:30 గంటల జాబితాలో కేవలం టీడీపీ అభ్యర్థి మాత్రమే ఉన్నట్లు చూపి వైయస్సార్‌సీపీ నామినేషన్‌ను ఎగరగొట్టారు.

దాచేపల్లి: అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నట్లు డిపాజిట్ రసీదు ఇచ్చినప్పటికీ ఏకపక్షంగా రిజెక్ట్ చేశారు.
కనిగిరి & గుత్తి: కనిగిరిలో స్క్రూటినీ సందర్భంగా నామినేషన్ పత్రాలను చించేశారు. గుత్తిలో నిన్ననే కుల ధ్రువీకరణ పత్రం లాక్కొని చించివేసి, నేడు ఆ సర్టిఫికెట్ లేదంటూ తిరస్కరించారు.
రాజంపేట: ఆమోదించిన నామినేషన్ రసీదును లాక్కుని చించేసి, డిపాజిట్ చెల్లించలేదనే పచ్చి అబద్ధంతో రిజెక్ట్ చేశారు.
 నెల్లూరు: ఎన్నికల నిబంధనల్లో లేని 'పోలీస్ వెరిఫికేషన్' లేదని ఒకరిది, ఐటీ రిటర్న్స్‌లో కేవలం రూ. 400 తేడా ఉందంటూ మరొకరిది కొట్టేశారు. రాజీనామా అక్నాలెడ్జ్‌మెంట్ ఉన్నా ఓ ఆశా వర్కర్ నామినేషన్‌ను నిర్దాక్షిణ్యంగా తిరస్కరించారు.

పులివెందుల & కుప్పం: నామినేషన్లకు వెళ్తుంటే 'శాంతిభద్రతల సమస్య ఉంది, వెళ్లొద్దు' అని పోలీసులు అడ్డుకున్నారు. సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ అధికారులను సంప్రదించినా అభ్యర్థులను లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు.

మిత్రపక్షం బీజేపీనీ వదలని టీడీపీ అరాచకం:

కూటమి ధర్మం అని చెప్పే టీడీపీ నాయకులు చివరకు తమ మిత్రపక్షమైన బీజేపీని కూడా వదల్లేదు. గిద్దలూరు, కడపలలో బీజేపీకి కేటాయించిన స్థానాల్లో సైతం టీడీపీ నేతలు దౌర్జన్యాలు చేసి నామినేషన్ పత్రాలు చించేశారు. గిద్దలూరులో బీజేపీ శ్రేణులే స్వయంగా 'టీడీపీ డౌన్ డౌన్' అంటూ రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపాల్సిన పరిస్థితి వచ్చింది.

ప్రైవేట్ సెక్యూరిటీని 'హైర్డ్ కిల్లర్స్' అంటారా?:

రాయచోటిలో మంత్రి స్వయంగా ఫోన్ చేసి నామినేషన్ వేయవద్దని మా అభ్యర్థులను బెదిరించిన ఆడియోలు బయటకు వచ్చాయి. ప్రాణభయంతో చట్టబద్ధమైన లైసెన్స్డ్ ఏజెన్సీ నుంచి ప్రైవేట్ భద్రత ఏర్పాటు చేసుకుంటే.. బాధ్యతాయుతమైన సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి వారిని 'హైర్డ్ కిల్లర్స్' అనడం ఆయన స్థాయికి తగునా? నారా లోకేష్ పాదయాత్రలో వందల మంది ప్రైవేట్ బౌన్సర్లు ఉంటే తప్పులేదు కానీ, వైయస్సార్‌సీపీ నేతలు ఆత్మరక్షణ కోసం భద్రత పెట్టుకుంటే తప్పా? పోలీసులపై నమ్మకం లేకే ప్రైవేట్ భద్రత పెట్టుకోవాల్సి వస్తోంది.

ఎల్లో మీడియా వత్తాసు - దొంగ ఏకగ్రీవాల ప్రచారం:

పోటీ లేకుండా చేసుకుని ఏకగ్రీవాల పేరుతో విజయాలు ప్రకటించుకోవడం ప్రజాస్వామ్యమా? వైయస్సార్‌సీపీ నామినేషన్లు వేయలేదని కాదు, వేయకుండా అడ్డుకున్నారన్నదే పచ్చి నిజం. నామినేషన్లు వేయకుండా అడ్డుకుని సాధించిన ఏకగ్రీవాలు ప్రజాస్వామ్య విజయాలు కావు. ఎనిమిది చోట్ల ఏకగ్రీవాలంటూ ఎల్లో మీడియా సిగ్గులేకుండా ప్రచారం చేస్తోంది. బాధితులైన వైయస్సార్‌సీపీ నేతలనే నిందితులుగా చిత్రీకరిస్తూ చంద్రబాబు చేస్తున్న అబద్ధాల ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారు.

ఓటర్ల జాబితా మాయాజాలం.. దసరా పండుగ వేళ ఎందుకీ తొందర?:

ఎస్ఐఆర్ తుది ఓటర్ల జాబితా వచ్చేలోపే పాత జాబితాలతో ఎన్నికలకు వెళ్లాల్సిన తొందర ఎందుకు వచ్చింది? 44 లక్షలకు పైగా అనుమానాస్పద ఓట్లను, అందులో 15 లక్షలకు పైగా మృతుల పేర్లను గుర్తించినా.. ఆ పాత జాబితాలతోనే పోలింగ్ నిర్వహించడం దొంగ ఓట్లకు అవకాశం కల్పించడమే. తుది జాబితా విడుదల తేదీని పొడిగించిన సమాచారం ముందుగానే ఎస్ఈసీకి ఎలా తెలిసింది? మార్చిలోనే మున్సిపాలిటీల గడువు ముగిసినా ఇన్నాళ్లు ఎందుకు నిద్రపోయారు? కోట్ల మంది జరుపుకునే దసరా పండుగ వేళ కేవలం 10 రోజుల వ్యవధిలో ఈ ప్రక్రియను ఎందుకు ముగించాలనుకుంటున్నారు?

కేంద్ర బలగాలతోనే నిష్పాక్షిక ఎన్నికలు సాధ్యం:

రెడ్‌బుక్ పాలనతో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను రాజకీయ మాఫియాగా మార్చేశారు. పట్టణాల్లోనే ఇంతటి హింస జరిగితే.. రేపు రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో తీవ్ర హింసాకాండ, ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉంది. అందుకే ఈ స్థానిక ఎన్నికలన్నింటినీ రాష్ట్ర పోలీసులతో కాకుండా కేంద్ర పారామిలటరీ బలగాల పర్యవేక్షణలోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం.

చంద్రబాబుకు మొట్టికాయ కొట్టే అవకాశం వచ్చింది:

ఈ నేపధ్యంలో... జరుగుతున్నఈ ఎన్నికలతో ప్రభుత్వం మారకపోవచ్చు కానీ.. గత రెండున్నరేళ్ల పాలనలో మోసపోయిన రైతులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఇదొక చక్కని అవకాశమని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారానికి వచ్చే టీడీపీ నేతలను ఇచ్చిన హామీలపై నిలదీయాలని,  మోసపూరిత పాలన సాగిస్తున్న చంద్రబాబు నాయుడికి ప్రజలు ఓటు ద్వారా గట్టి మొట్టికాయ కొట్టి సరైన గుణపాఠం చెప్పాలి" అని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.

Back to Top