తిరుపతి: చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో రావోక్స్ అగ్రిటెక్ ఇండియా లిమిటెడ్ పేరుతో ఏర్పాటు చేస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు సంబంధించిన పెట్టుబడులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలపై స్పష్టత ఇవ్వాలని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి కోరారు. 41 ఎకరాల్లో రూ.1,400 కోట్ల పెట్టుబడితో యూనిట్ ఏర్పాటు చేసి వెయ్యి మందికి ప్రత్యక్షంగా, మరో 3 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తామని చెబుతున్నారని తెలిపారు. గత ఏడాది నవంబర్ 20న రూ.9 లక్షల మూలధనంతో సంస్థ ప్రారంభమైందని, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో సంస్థకు అనుభవం, పరిజ్ఞానం ఏ మేరకు ఉందో స్పష్టత లేదని భూమన పేర్కొన్నారు. రూ.1,400 కోట్ల పెట్టుబడికి ప్రభుత్వం రూ.592.22 కోట్ల మేర 46 శాతం ఇన్సెంటివ్‌లు ఇస్తోందని, ఇంత భారీ ప్రోత్సాహకాలకు అర్హతలు, పెట్టుబడి సామర్థ్యంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు. కంపెనీ నేపథ్యంపై స్పష్టత ఏది? ముల్లూరు దేవీప్రసాద్, కంభం పృథ్వీ వినాయక్ విశాఖపట్నానికి చెందినవారని, వారి వ్యాపార నేపథ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అనుభవంపై స్పష్టత అవసరమని భూమన పేర్కొన్నారు. కేవలం పరిశ్రమలు వస్తున్నాయనే ప్రచారంతో ప్రజలకు పూర్తి సమాచారం ఇవ్వకుండా అనుమతులు ఇవ్వడం సరికాదన్నారు. ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్’ పేరుతో భూముల కేటాయింపులా? ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్’ పేరుతో పరిశ్రమలు వస్తున్నాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, తమకు కావాల్సిన వారికి భూములు కట్టబెట్టే విధానం కొనసాగుతోందని భూమన విమర్శించారు. పెట్టుబడులకు వైయస్ఆర్‌సీపీ వ్యతిరేకం కాదని, అయితే ప్రజలకు మేలు చేస్తున్నామని చెప్పి వాస్తవాలను దాచడం సరికాదన్నారు. 2028లో ఉత్పత్తి ప్రారంభమంటున్న సంస్థపై విచారణ అవసరం ఈ నెలలోనే అనుమతులు పొందిన సంస్థ 2028లో ఉత్పత్తి ప్రారంభిస్తుందని చెప్పడం వెనుక ఉన్న వాస్తవాలను ప్రభుత్వం వెల్లడించాలని భూమన కోరారు. తొమ్మిది నెలల క్రితమే ప్రారంభమైన సంస్థ ఏడాదిన్నరలో ఉత్పత్తి ప్రారంభిస్తామని చెబుతున్న నేపథ్యంలో కంపెనీ ఆర్థిక సామర్థ్యం, అనుభవం, పెట్టుబడి ప్రణాళికలపై సమగ్ర పరిశీలన జరపాలని అన్నారు. పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసం చేయొద్దు చంద్రబాబు ప్రభుత్వంలో పరిశ్రమలు పెద్దఎత్తున వస్తున్నాయనే ప్రచారానికి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలకు పొంతన లేదని భూమన పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు, రైతుల భూముల విషయంలో పారదర్శకత పాటించాలని, రావోక్స్ అగ్రిటెక్ వ్యవహారం వెనుక ఉన్న వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని కోరారు.