ఢిల్లీ: ఐక్యరాజ్యసమితి 81వ సర్వసభ్య సమావేశంలో వైయస్ఆర్‌సీపీ అరకు ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజారాణికి అరుదైన అవకాశం లభించింది. 18 మంది ఎంపీలతో కూడిన భారత ప్రతినిధి బృందంలో సభ్యురాలిగా ఆమె ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించారు. ఐక్యరాజ్యసమితి పరిపాలనా, బడ్జెటరీ కమిటీ (ఫిఫ్త్ కమిటీ) తొలి అధికారిక సమావేశంలో ‘పని సంస్థీకరణ’ అజెండా అంశంపై భారతదేశం తరఫున డాక్టర్ గుమ్మ తనూజారాణి ప్రకటన చేశారు. 81వ సమావేశంలో సంస్కరణల ఎజెండాను కొనసాగించాల్సిన అవసరాన్ని ఆమె ప్రస్తావించారు. కమిటీ ఫర్ ప్రోగ్రామ్ అండ్ కోఆర్డినేషన్ (సీపీసీ), అడ్వైజరీ కమిటీ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ బడ్జెటరీ క్వశ్చన్స్ (ఏసీఏబీక్యూ) ప్రత్యేక అధికారాలు ఫిఫ్త్ కమిటీ పనితీరుకు కీలకమని పేర్కొన్నారు. అన్ని సభ్య దేశాలు తమ అసెస్డ్ కంట్రిబ్యూషన్లను పూర్తిగా, సకాలంలో, ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా చెల్లించాలని డాక్టర్ తనూజారాణి స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి స్తంభానికి తగినన్ని ఆర్థిక వనరులు అందించడంతో పాటు, యూఎన్80 ఇనిషియేటివ్‌ను ఉపయోగించి అభివృద్ధి స్తంభాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఫిఫ్త్ కమిటీ పనిలో ఏకాభిప్రాయంతో వచ్చే ఫలితాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని కూడా ఆమె ప్రస్తావించారు.