సుప్రీం తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు

చంద్రబాబు బీసీల ద్రోహి అన్నది బట్టబయలు

మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఫైర్‌ 

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజమహేంద్రవరం రూరల్‌ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.

ఎన్టీఆర్‌కి పొడిచినట్టే బీసీలకు కూడా చంద్రబాబు వెన్నుపోటు  

అమరావతి చట్టబద్ధత కోసం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశం పెట్టించానని ప్రచారం చేసుకున్నాడు

అలాంటిది బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై ఎందుకు చిత్తశుద్ధి ప్రదర్శించలేదు?   

చట్టబద్ధమైన ప్రక్రియను పూర్తి చేయకుండా చంద్రబాబు కాలయాపన

ప్రధాని మోదీ, అమిత్‌ షాలను బీసీ రిజర్వేషన్ల గురించి ఎందుకు అడగలేదు?  

చంద్రబాబుకి చెల్లుబోయిన వేణు సూటి ప్రశ్నలు 

ఉద్దేశపూర్వకంగానే బీసీ రిజర్వేషన్లపై నిర్లక్ష్యం, కాలయాపన 

పవన్‌ కళ్యాణ్‌ అండ చూసుకుని బీసీలపై చంద్రబాబు చిన్న చూపు

పార్టీ పరంగా సీట్లిచ్చినంత మాత్రాన రిజర్వేషన్లు కిందకి రావు 

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 34 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలి

ప్రెస్‌మీట్‌లో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ డిమాండ్‌ 

రాజమహేంద్రవరం: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన చంద్రబాబు, ఇప్పుడు ఆ హామీని అమలు చేయకుండా బీసీలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి, తూర్పు గోదావరి జిల్లా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఫైర్‌ అయ్యారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం అనుసరించిన వైఖరిపై సుప్రీంకోర్టు తీర్పు తమ వాదనను మరోసారి బలపరిచిందని ఆయన స్పష్టం చేశారు. బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి, చట్టబద్ధమైన ప్రక్రియను పూర్తి చేయకుండా చంద్రబాబు కాలయాపన చేశారని ఆక్షేపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే భాగస్వామిగా ఉండి కూడా, ప్రధాని మోదీని గానీ అమిత్‌ షాను గానీ కలిసి బీసీ రిజర్వేషన్ల గురించి ఎందుకు అడగలేదని నిలదీశారు. ప్రభుత్వంలో పవన్‌ కళ్యాణ్‌ భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి తనకు బీసీలు అవసరం లేదని అహంకారంతోనే చంద్రబాబు బీసీలను పట్టించుకోవడం లేదని రాజమహేంద్రవరం రూరల్‌ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు.

ప్రెస్‌మీట్‌లో చెల్లుబోయన వేణుగోపాలకృష్ణ ఇంకా ఏం మాట్లాడారంటే..:

అమరావతి మీద శ్రద్ధ బీసీలపై లేదా?:  
    సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు. మేం మొదటి నుంచీ చెబుతున్నదే ఇప్పుడు మరోసారి స్పష్టమైంది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన చంద్రబాబు, ఆ హామీని అమలు చేయకుండా బీసీలను మోసం చేశారు. కె.అచ్చెన్నాయుడు, కె.పార్థసారథి, అనగాని సత్యప్రసాద్‌ వంటి బీసీ మంత్రులను ముందు పెట్టి బీసీలకే వెన్నుపోటు పొడిపించారు. అమరావతి బిల్లుకు చట్టబద్ధత కల్పించేందుకు ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలు నిర్వహించామని గొప్పగా ప్రచారం చేసుకున్నారు.
    మరి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేందుకు ఎందుకు అదే ప్రయత్నం చేయలేదు? ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిసినప్పుడు బీసీల రిజర్వేషన్ల అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదు? బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలనే చిత్తశుద్ధి ఉంటే మోదీ, అమిత్‌ షాల ముందు ఈ అంశాన్ని ఎందుకు బలంగా వినిపించలేదు?.

బీసీలకు ఎందుకు న్యాయం చేయడం లేదు?:
    కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి భాగస్వామిగా ఉండి కూడా బీసీలకు న్యాయం చేయలేకపోవడానికి కారణమేంటి? బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి, ఇప్పుడు వారినే నిర్లక్ష్యం చేయడం ద్రోహం కాదా? పవన్‌ కల్యాణ్‌ అండ ఉంది కాబట్టి బీసీలు అవసరం లేదన్నట్లుగా చంద్రబాబు భావిస్తున్నాడు. బీసీలను నమ్మించి, వారి మనోభావాలతో చెలగాటం ఆడుతున్నారు. బీసీ మంత్రులను ఢిల్లీకి పంపించి న్యాయవాదులతో చర్చలు జరిపించడం కాదు.. బీసీలకు న్యాయం చేయడానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. 

16,800 పదవులు పోయాయంటే కారణం మీరు కాదా?: 
    బీసీలకు జరిగిన నష్టానికి చంద్రబాబు ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి, ఎన్నికలు సమీపిస్తున్న వేళ రిజర్వేషన్ల పేరుతో రాజకీయ నాటకానికి తెర తీశారు. న్యాయపరమైన అంశాలపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, బీసీలను మభ్యపెట్టేందుకు జీవోలు ఇచ్చి కాలయాపన చేసింది. హైకోర్టు తీర్పుల తర్వాత కూడా బీసీలకు న్యాయం చేసే దిశగా అవసరమైన చట్టబద్ధమైన చర్యలు తీసుకోలేదు. 16,800 పదవులు పోయాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై నిందలు వేస్తున్నారు. అసలు ఆ పోస్టులు పోవడానికి కారణం బిర్రు ప్రతాప్‌రెడ్డి కాదా? ఆయనకు చంద్రబాబు, ఆయన తనయుడు, పవన్‌ కల్యాణ్‌లతో సంబంధాలు ఉన్న మాట వాస్తవం కాదా? వాస్తవాలను పక్కన పెట్టి వైఎస్‌ జగన్‌ గారిపై నిందలు వేస్తే బీసీలు నమ్ముతారని అనుకోవడం పొరపాటు.
    బీసీ యువత రాజకీయంగా ఎదగాలనుకుంటున్న సమయంలో వారి అవకాశాలను దెబ్బ తీశారు. ఈ ద్రోహాన్ని బీసీ సమాజం క్షమించదు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, తెలుగుదేశం పార్టీని గెలిపించిన బీసీలకు కూడా అదే విధంగా వెన్నుపోటు పొడిచాడు.

పార్టీ పరంగా సీట్లిస్తే రిజర్వేషన్లు కావు:  
    మోసం చేసింది చాలదన్నట్లు ఇప్పుడు పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెబుతున్నారు. పార్టీ పరంగా సీట్లు ఇవ్వడం వేరు, చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించడం వేరు. వైఎస్‌ జగన్‌ గారు పార్టీ పరంగా బీసీలకు 40 శాతం ప్రాధాన్యం కల్పించి చూపించారు. కానీ మేం కోరుతున్నది చట్టబద్ధమైన రిజర్వేషన్లు. చంద్రబాబుకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అవసరమైన మార్గాలు తెలుసు. ప్రత్యేక కమిషన్‌ నివేదికను బహిర్గతం చేసి, అవసరమైన అధ్యయనం పూర్తి చేసి, శాసనసభలో చర్చించి, చట్టబద్ధమైన ప్రక్రియను పూర్తి చేసి కేంద్రం ద్వారా రాజ్యాంగపరమైన రక్షణ కల్పించేందుకు ప్రయత్నించాలి. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబుకు ఈ అవకాశం ఉన్నా ఎందుకు వినియోగించుకోవడం లేదు?
    బీసీలను వాడుకుని ఓట్లు వేయించుకుని అధికారం పొందిన తర్వాత వారికే ద్రోహం చేయడం ఎంతవరకు సమంజసం? బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి. అలా చేయకపోతే చంద్రబాబు బీసీలను మోసం చేసినట్లే. బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు సాధించే వరకు వైయస్సార్‌సీపీ వారి తరపున పోరాడుతుందని చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వెల్లడించారు.

Back to Top