న్యాయస్థానాల్లో నిలవని జీవోలు.. బీసీలకు చంద్రబాబు మరోసారి వెన్నుపోటు!

34 శాతం రిజర్వేషన్ల పేరుతో బీసీలకు నయవంచన 

 కూటమి ప్రభుత్వ తీరుపై భగ్గుమన్న బీసీలు 

బీసీ రిజ‌ర్వేష‌న్ల పేరుతో మ‌భ్య‌పెడుతున్న చంద్ర‌బాబు తీరును నిర‌సిస్తూ అనంత‌పురం న‌గ‌రంలో వైఎస్సార్‌సీపీ 
బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా నిర్వ‌హించి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం స‌మ‌ర్ప‌ణ‌. 

పార్లమెంట్‌లో చట్ట సవరణతోనే బీసీలకు న్యాయం చేయాలి 

వైయ‌స్ఆర్‌సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రమేష్‌ గౌడ్‌ డిమాండ్ 

అనంతపురం: బీసీల పట్ల చిత్తశుద్ధి లేని కూటమి ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్ల పేరుతో న్యాయస్థానాల్లో నిలవని జీవోలు జారీ చేసి బీసీలను మభ్యపెడుతోందని వైయ‌స్ఆర్‌సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రమేష్‌ గౌడ్‌ మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగడుతూ, బీసీలకు న్యాయం చేయాలంటే పార్లమెంట్‌లో చట్ట సవరణకు కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయం వద్ద వైయ‌స్ఆర్‌సీపీ బీసీ సెల్‌ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించి, అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

నిరసన కార్యక్రమంలో రమేష్‌ గౌడ్‌ ఏమన్నారంటే..

- 34 శాతం రిజర్వేషన్ల హామీ ఏమైంది?

“బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి, వారి ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు అదే బీసీలకు వెన్నుపోటు పొడుస్తున్నారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయన్న కారణంతో హైకోర్టు బీసీ రిజర్వేషన్ల జీవోలను కొట్టివేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కూడా కొట్టివేసింది. న్యాయపరమైన పరిమితులు ముందే తెలిసి ఉంటే పార్లమెంట్‌లో చట్టం కోసం ఎందుకు ప్రయత్నించలేదు? బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూడటం మానుకోవాలి”.

- ఢిల్లీ పర్యటనలు కాదు.. పార్లమెంట్‌లో చట్టం చేయాలి!

“కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రులు ఢిల్లీకి వెళ్లి కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెబుతున్నారు. మరి బీసీ రిజర్వేషన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు పార్లమెంట్‌లో చట్ట సవరణ కోసం ఎందుకు ముందడుగు వేయడం లేదు? బీసీలకు నిజంగా న్యాయం చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ప్రధానితో మాట్లాడి, అవసరమైన చట్టపరమైన చర్యలు చేపట్టాలి. బీసీల హక్కులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం మానుకోవాలి”.

- బీసీల హక్కుల కోసం రాష్ట్రవ్యాప్త పోరాటం

“వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, గౌరవం కల్పించారు. కానీ ఇప్పుడు బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. బీసీలకు న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం ఆగదు. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఖబడ్దార్‌ చంద్రబాబూ.. బీసీలను మోసం చేస్తే ఊరుకునేది లేదు” అని రమేష్‌ గౌడ్‌ హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర బీసీ నాయకులు కేవీ రమణ, మీసాల రంగన్న, రిలాక్స్‌ నాగరాజు, చింతకుంట మధు, జిల్లా నాయ‌కులు కొగటం విజయ భాస్కర్‌ రెడ్డి, చింత సోమశేఖర్‌ రెడ్డి, సాకే చంద్రశేఖర్‌, ఓబిరెడ్డి, చామలూరు రాజగోపాల్‌, సంపంగి రామాంజనేయులు, ఎద్దుల అమర్‌నాథ్‌ రెడ్డి, వేముల నదీం, ఉమ్మడి మదన్‌ మోహన్‌ రెడ్డి, అనిల్‌ కుమార్‌ గౌడ్‌, మొఘల్‌ సైపుల్లా బేగ్‌, ధన, సీఎం బాలాజీ, హేమ కిరణ్‌, నరేంద్ర, అంజలి, భారతి, కృష్ణవేణి, కమర్తాజ్‌, దేశాయి భారతి రెడ్డి, రాధా యాదవ్‌, శోభా భాయ్‌, మాలపాటి శ్రీనివాసులు, శ్రీనివాస్‌ దత్తా, మాజీ జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ నాగరత్నమ్మ, పార్వతి, ఫణీంద్ర, లబ్బె రాఘవ, గోగుల పుల్లయ్య, బెస్త వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top