తాడేపల్లి: గతంలో చేపట్టిన పనులకే మళ్లీ మళ్లీ ప్రారంభోత్సవాలు చేస్తున్న సీఎం చంద్రబాబు, ఇచ్చిన హామీల అమలును పక్కన పెట్టి కేవలం ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. పింఛన్లు, బీసీ రిజర్వేషన్లు, భోగాపురం విమానాశ్రయం, పట్టాదారు పాస్ పుస్తకాలు, రైతుల సమస్యలు, డీఎస్సీ నియామకాలపై ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దమ్ముంటే సమాధానం చెప్పాలని, అలాగే జగన్‌గారి పాలనపై బహిరంగ చర్చకు రావాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన లక్ష్మీపార్వతి సవాల్ చేశారు. ప్రెస్‌మీట్‌లో నందమూరి లక్ష్మీపార్వతి ఇంకా ఏం మాట్లాడారంటే..: పని తక్కువ. ప్రచారం ఎక్కువ. ఇదే చంద్రబాబు పాలన: ఒకే పింఛన్ పథకాన్ని 22 సార్లు ప్రారంభించడమేనా అభివృద్ధి? కొత్త పింఛన్లు ఇవ్వకుండా, పాత పింఛన్లలో లబ్ధిదారులను తగ్గిస్తూ ప్రచారానికి మాత్రం పెద్దపీట వేస్తున్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల్లో ఒక్కటైనా పూర్తిస్థాయిలో అమలు చేశారా? గ్యాస్ సబ్సిడీ సహా ఇచ్చిన హామీల పరిస్థితి ఏమిటి? స్థానిక సంస్థల ఎన్నికలు సమీపించగానే 34 శాతం బీసీ రిజర్వేషన్ల పేరుతో రాజకీయ ప్రచారం మొదలుపెట్టారు. బీసీలకు నిజంగా మేలు చేయాలంటే చట్టబద్ధమైన పరిష్కారం చూపాలి. జగన్‌గారి హయాంలో బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, నామినేటెడ్ పదవులు, పనుల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించాం. బీసీ సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే ప్రచారానికి పరిమితం కాకుండా ఆచరణలో చూపించాలి. భోగాపురం, పట్టాదారు పాస్‌పుస్తకాలు. క్రెడిట్ చోరీ: భోగాపురం విమానాశ్రయానికి భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం, నిర్మాణ పనుల పురోగతిలో వైయస్ జగన్ ప్రభుత్వం కీలకంగా పని చేసింది. గతంలో చేపట్టిన పనులకు ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేసి, మొత్తం ఘనతను తన ఖాతాలో వేసుకోవడం ఏమిటి? వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో సాంకేతికతను ఉపయోగించి భూముల రీసర్వే చేపట్టి పట్టాదారు పాస్‌పుస్తకాలను రైతులకు అందించాం. అప్పట్లో వాటిపై దుష్ప్రచారం చేసినవారే ఇప్పుడు మళ్లీ ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారు. పాస్‌పుస్తకాలపై ఫొటోలు మార్చడం కాదు.. భూముల వివరాల్లో సమస్యలుంటే పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలి. ఇతరులు చేసిన పనులకు క్రెడిట్ తీసుకోవడం మానేసి, కొత్తగా సాధించిన అభివృద్ధి ఏమిటో చంద్రబాబు చెప్పాలి. రాష్ట్రంలో కరవు సహాయక పనులేవి?. ఎన్నికల హామీల అమలు లేదు: రాయలసీమలో కరువు పరిస్థితులు నెలకొని, తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ఉద్యానవన రంగానికి లక్ష కోట్లు ఖర్చు చేశామంటూ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరం. కరువు పరిస్థితులను ముందుగానే అంచనా వేసి రైతులకు సాగునీరు అందించే చర్యలు తీసుకోవాలి. పంటలు ఎండిపోతుంటే సాగునీరు అందించకుండా, పంటలకు మద్దతు ధర కల్పించకుండా అభివృద్ధి గురించి గొప్పలు చెప్పడం వల్ల ప్రయోజనం ఏమిటి?. అలాగే డీఎస్సీ నియామకాలపై అభ్యర్థుల్లో ఉన్న ఆందోళనను నివృత్తి చేసి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలి. జగన్‌గారి హయాంలో మహిళలకు చేయూత, ఆసరా పథకాల ద్వారా ఆర్థిక భరోసా కల్పించాం. రైతులకు విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడంతో పాటు, పంటలకు కచ్చితమైన మద్దతు ధర అందించడంతో పాటు రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా సేవలు అందించాం. ఇప్పుడు ఆ వ్యవస్థల పరిస్థితి ఏమిటి? మహిళలు, రైతులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు?. రెడ్‌బుక్ పాలన. ప్రజాధనం ఖర్చులపై సమాధానం చెప్పాలి: మంచి జరిగితే తన ఖాతాలో వేసుకుని, సమస్యలు వస్తే అధికారులపై నెపం నెట్టడం చంద్రబాబుకు పరిపాటిగా మారింది. విశాఖలో వర్షం తన ప్రార్థనల వల్లే కురిసిందంటూ చెప్పుకోవడం ఏమిటి? ముఖ్యమంత్రి, మంత్రుల ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల పర్యటనలకు చేస్తున్న ఖర్చులపై ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించే వారిపై కేసులు, అరెస్టుల పేరుతో వేధింపులు జరుగుతున్నాయి. మహిళలపై నేరాలు, హత్యలు, భూకబ్జాల వంటి సమస్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మద్యం విక్రయాల్లో పారదర్శకత ఉందని చెబుతున్న ప్రభుత్వం, బెల్ట్‌షాపులు, అక్రమ విక్రయాలపై ఏం చర్యలు తీసుకుందో వివరించాలి. జగన్‌గారి పాలనపై విమర్శలు చేస్తున్న చంద్రబాబు బహిరంగ చర్చకు రావాలి. ఆయన రాలేకపోతే లోకేశ్‌ను పంపాలి. హామీల అమలుపై సమాధానం చెప్పకుండా పాత ప్రభుత్వంపై నిందలు వేయడం మానుకోవాలి. ప్రచారంతో ప్రజలను ఎప్పటికీ మభ్యపెట్టలేరు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని నందమూరి లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు.