ఆత్మకూరులో వైయ‌స్ఆర్‌సీపీ ఎన్నికల సమరశంఖం

 32 వార్డుల్లో విజయం సాధించడమే లక్ష్యం: శిల్పా చక్రపాణి రెడ్డి

నంద్యాల జిల్లా: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆత్మకూరు పట్టణంలోని మొత్తం 32 వార్డుల్లో విజయం సాధించడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఆత్మకూరు పట్టణ వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, ఎన్నికల సన్నాహకాలపై అభిప్రాయాలు తెలుసుకుని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ.. ఆత్మకూరులోని 32 వార్డుల్లోనూ వైయ‌స్ఆర్‌సీపీ జెండా ఎగురవేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి నాయకుడికి, కార్యకర్తకు వ్యక్తిగతంగా, పార్టీ పరంగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యకర్తల కష్టసుఖాల్లో పార్టీ తోడుగా ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు.

నాయకులు, కార్యకర్తలు తమ మధ్య ఉన్న భేదాభిప్రాయాలను పక్కనపెట్టి ఐక్యంగా పనిచేయాలని సూచించారు. ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమిష్టి కృషితో రానున్న ఎన్నికల్లో టీడీపీని దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని అన్నారు. ఈ సమావేశంలో శ్రీశైలం నియోజకవర్గ నాయకుడు శిల్పా భువనేశ్వర్ రెడ్డితో పాటు పలువురు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

Back to Top