ఆక్వా ఫీడ్‌పై మరోసారి ధరల భారం

టన్నుకు రూ.11 వేలు పెంపు హేయం

వడ్డి రఘురాం ధ్వజం

తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడిన నియోజకవర్గ వైయస్సార్‌సీపీ సమన్వయకర్త, ‘అప్సడా’ మాజీ వైస్‌ చైర్మన్‌ వడ్డి రఘరాం.

వెన్నుపోటు పార్టీ కూటమి పాలనలో సంక్షోభంలో ఆక్వా రంగం 

కార్పొరేట్‌ కంపెనీలకు తొత్తుగా మారిన చంద్రబాబు ప్రభుత్వం

వడ్డి రఘురాం ఫైర్‌

ఆక్వా ఫీడ్‌ కంపెనీలకు మేలు చేయడమే చంద్రబాబు లక్ష్యం

అందుకే కోర్టులను సైతం ఆయన తప్పుదోవ పట్టించారు

ఆక్వా రైతుల నోట్లో మట్టి కొడుతూ జీఓ నెం:180 జారీ

వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ తీరు దారుణం

నిరసనగా త్వరలోనే జిల్లా కలెక్టరేట్లు ముట్టడిస్తాం

ప్రెస్‌మీట్‌లో వడ్డి రఘురాం స్పష్టీకరణ

తాడేపల్లిగూడెం: ఆక్వా ఫీడ్‌పై మరోసారి ధరల భారం పడిందని, టన్నుకు రూ.11 వేలు పెంపు హేయం అని తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైయస్సార్‌సీపీ సమన్వయకర్త, ‘అప్సడా’ (ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆక్వా సాగు అభివృద్ధి సంస్థ) మాజీ వైస్‌ చైర్మన్‌ వడ్డి రఘురాం ఫైర్‌ అయ్యారు. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆక్వా రంగాన్ని ఉద్దేశపూర్వకంగా తీవ్ర సంక్షోభంలోకి నెడుతోందని ఆయన ధ్వజమెత్తారు. ఫీడ్‌ కంపెనీలు, ప్రాసెసింగ్‌ ప్లాంట్లు, హేచరీలకు అనుకూలంగా వ్యవహరిస్తూ, చిన్న ఆక్వా రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
    చివరికి న్యాయస్థానాలను సైతం తప్పుదోవ పట్టించి, తప్పుడు నివేదికలు, దొంగ సంతకాలతో రైతులకు తీరని ద్రోహం చేస్తున్న వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం నయవంచనకు గురి చేస్తోందని ఆక్షేపించారు. జగన్‌గారి హయాంలో ఆక్వా రంగానికి రక్షణగా తీసుకొచ్చిన చట్టాలను బలహీనపరుస్తూ సాగిస్తున్న ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ మరో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతుందని తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడిన వడ్డి రఘురాం స్పష్టం చేశారు.
ప్రెస్‌మీట్‌లో వడ్డి రఘురాం ఇంకా ఏమన్నారంటే..

అప్సడా చట్టాన్ని నిర్వీర్యం చేసిన జీఓ నెం:180
    వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధితో ఫీడ్, సీడ్, ప్రొక్యూర్మెంట్, హేచరీలను ఒకే గొడుగు కిందకు తెస్తూ ’అప్సడా చట్టం 2020’ని తీసుకువచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు ఆ బలమైన చట్టాన్ని నీరుగార్చేలా జీఓ నెం:180 తీసుకొచ్చారు. ఫీడ్‌ కంపెనీలకు మేలు చేసే విధంగా ముగ్గురు రైతు ప్రతినిధులు, ముగ్గురు ఫీడ్‌ కంపెనీల ప్రతినిధులంటూ ఓ వ్యవస్థను తెరపైకి తెచ్చారు. ఆ జీవో ఆధారంగానే కోర్టును కూడా మేనేజ్‌ చేసే ప్రయత్నం చేశారు.

దొంగ సంతకాలతో కోర్టుకు నివేదికలు. ఆ ముగ్గురు రైతులెవరు?:
    కోర్టు ఆదేశాల ప్రకారం ముఖ్యమంత్రి సమక్షంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేసి ధరలపై నిర్ణయం తీసుకోవాలి. కానీ చంద్రబాబు గారు అసలు రైతులతో ఎక్కడైనా ఫిజికల్‌ మీటింగ్‌ పెట్టారా? ఒక్క ఆధారమైనా చూపించగలరా? కోస్తాంధ్ర, ఉమ్మడి పశ్చిమ గోదావరి, కోనసీమల్లో ఎక్కడైనా రైతులతో చర్చించారా? ఏ చర్చలూ లేకుండానే ముగ్గురు రైతు ప్రతినిధుల పేర్లతో దొంగ సంతకాలు పెట్టించి కోర్టుకు సమర్పించారు. ఆ ముగ్గురు రైతులు ఎవరో, వారి పేర్లేమిటో ప్రభుత్వం తక్షణమే బయటపెట్టాలి. టీడీపీ ముసుగులో ఉన్న నాయకుల లొసుగులన్నీ త్వరలోనే బట్టబయలు చేస్తాం.

ఫీడ్‌ రేట్లతో రైతులపై కేజీకి రూ.27 భారం:
    గత ఎనిమిది మాసాల్లోనే రెండు దఫాలుగా రూ.16 పెంచారు. ఇప్పుడు మళ్లీ రూ.11 పెంచుకునేందుకు కుట్రలు పన్ని, మొత్తంగా రూ.27 మేర ఫీడ్‌ భారాన్ని రైతులపై మోపారు. గతంలో అప్సడా చట్టం ద్వారా మేం ప్రతి పది రోజులకు ఒకసారి రేట్లను సమీక్షించేవాళ్లం. కౌంట్‌ ఆధారంగా ధరలు నిర్ణయించి ప్రాసెసింగ్‌ కంపెనీలను ఒప్పించి రైతులకు లాభం చేకూర్చాం. కానీ నేడు ప్రభుత్వం ఫీడ్‌ కంపెనీలకు తొత్తుగా మారి రైతుల రక్తాన్ని తాగుతోంది.

విద్యుత్‌ సబ్సిడీ పేరిట పచ్చి మోసం:
    జీవో 57 ద్వారా జూన్‌ 1వ తేదీ నుంచే రూపాయిన్నర విద్యుత్‌ సబ్సిడీ ఇస్తున్నామని మంత్రులు అట్టహాసంగా ప్రచారం చేసుకున్నారు. తీరా చూస్తే జూన్, జూలై రెండు నెలల సబ్సిడీని ఎగ్గొట్టారు. ఆగస్టు నుంచి ఇచ్చామని చెబుతూనే, 0.90 నుంచి 0.95 పవర్‌ ఫ్యాక్టర్‌ కెపాసిటర్ల నిబంధన పేరుతో మెజారిటీ చిన్న రైతులకు సబ్సిడీని పూర్తిగా ఎత్తేశారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించి మోసగిస్తున్నారు.

క్రాప్‌ హాలిడే పేరిట కౌలు రైతులకు వెన్నుపోటు:
    టీడీపీ ముసుగులో ఉన్న కొందరు అసోసియేషన్‌ పెద్దలే ఫీడ్, హేచరీ, ప్రొక్యూర్మెంట్‌ డీలర్లుగా అవతారమెత్తారు. వీళ్లే క్రాప్‌ హాలిడే అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షలు ముందుగానే లీజు చెల్లించిన పేద, కౌలు రైతులు క్రాప్‌ హాలిడే పాటిస్తే ఏమైపోవాలి? వారి బతుకులు రోడ్డున పడవా? ఇలాంటి ద్వంద్వ వైఖరితో చిన్న రైతుల ఉసురు పోసుకోవద్దు.

కలెక్టరేట్ల ముట్టడికి సిద్ధం. సుప్రీంకోర్టు దాకా పోరాడతాం:
    ఈ నేపధ్యంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇప్పటికే హైకోర్టులో రైతుల పక్షాన న్యాయ పోరాటం చేశామని.. అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తామని... ఆక్వా రంగానికి సంబంధించి పార్టీలకు అతీతంగా త్వరలోనే ఐక్య వేదికను ఏర్పాటు చేసి, పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని వడ్డీ రఘురాం స్పష్టం చేశారు ప్రతి జిల్లాలో పర్యటించి, కలెక్టరేట్లను ముట్టడించి ఆక్వా రైతుల హక్కుల సాధన కోసం పోరాటం ఉ«ధృతం చేస్తామని హెచ్చరించారు.

Back to Top