రైల్వేకోడూరు: వరదల నుంచి ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించేందుకు చేపట్టిన గుంజునేరు ప్రొటెక్షన్ వాల్ నిర్మాణ పనులను వేగవంతం చేసి, త్వరగా పూర్తి చేయాలని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రైల్వేకోడూరు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. నరసరాంపేట ఏటి పరివాహక ప్రాంతంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. గతంలో వరదల కారణంగా పలు ఇళ్లు కొట్టుకుపోవడం, ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయాల్సిన పరిస్థితులు ఎదురుకావడంతో, గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.40 కోట్ల వ్యయంతో గుంజునేరు ప్రొటెక్షన్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించినట్లు కోరముట్ల తెలిపారు. అయితే ప్రస్తుతం పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతినగర్ బ్రిడ్జి నుంచి నరసరాంపేట పాత కోర్టు వరకు నడుచుకుంటూ వెళ్లి నిర్మాణ పనుల పురోగతిని, నాణ్యతను పరిశీలించారు. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాదినేని వెంకట్‌రెడ్డి, మందల నాగేంద్ర, భరత్‌కుమార్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సీహెచ్ రమేష్, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ సుబ్బరామరాజు, మాజీ జెడ్పీటీసీ రత్నమ్మ, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.