34% రిజర్వేషన్ల పేరిట బీసీలను నిలువునా ముంచిన చంద్రబాబు : 

సుప్రీంకోర్టు తీర్పుతో బట్టబయలైన కూటమి సర్కార్ నయవంచన : 

ధ్వజమెత్తిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు.

శ్రీకాకుళంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు.

50 శాతం పరిమితి తెలిసి కూడా మేనిఫెస్టోలో పెట్టి మోసగించారు..

కోర్టుల్లో వీగిపోయే జీవోలతో బీసీలకు చంద్రబాబు దగా: 

చంద్రబాబు కపటనీతిని ఎండగట్టిన ధర్మాన ప్రసాదరావు 

వెన్నుపోటు పార్టీ కూటమి బీసీలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి

చట్టబద్ధమైన కమిషన్‌తోనే సమగ్ర సర్వే జరపాలి: 

మాజీ మంత్రి ధర్మాన డిమాండ్. 

శ్రీకాకుళం: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానాలు పచ్చి బూటకమని, సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఆయన నయవంచన పూర్తిగా బట్టబయలైందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రిజర్వేషన్ల పరిమితి 50 శాతానికి మించకూడదన్న రాజ్యాంగ సూత్రం, సుప్రీంకోర్టు తీర్పులు దేశమంతటికీ తెలిసినప్పటికీ, కేవలం బీసీలను దగా చేసి ఓట్లు దండుకోవడానికే టీడీపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఈ హామీని చేర్చిందని విమర్శించారు. చట్టానికి విరుద్ధంగా 34 శాతం జీవోను జారీ చేసి, అది హైకోర్టులో కొట్టివేతకు గురైనా బుద్ధి తెచ్చుకోకుండా సుప్రీంకోర్టు దాకా వెళ్లి అభాసుపాలయ్యారని మండిపడ్డారు. అధికారుల హెచ్చరికలను పెడచెవిన పెట్టి, ప్రజల సొమ్మును కోర్టుల కోసం వృథా చేస్తూ నాటకాలాడిన చంద్రబాబు తక్షణమే రాష్ట్రంలోని బీసీ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ ధర్మాన ఇంకా ఏమన్నారంటే..

చట్టం స్పష్టంగా ఉన్నా అయోమయం ఎందుకు?

ఈ రాష్ట్రంలో అమల్లో ఉన్న వెనుకబడిన తరగతుల చట్టంలో బీసీల గణాంకాలు సేకరించడానికి కమిషన్ స్వరూపం ఏ విధంగా ఉండాలనేది చాలా స్పష్టంగా పొందుపరిచారు. అలాంటప్పుడు ఈ ప్రభుత్వానికి వచ్చిన అయోమయం ఏమిటి? ఒకరోజు ఏకసభ్య కమిషన్ అంటారు. అది కోర్టు ముందు నిలబడదని తెలిశాక, మళ్లీ కుటుంబ వివరాల లెక్కలంటూ కొత్త నాటకానికి తెరతీశారు. ఈ అసంబద్ధ అధ్యయనాలు, లెక్కలు న్యాయస్థానాల విచారణ ముందు నిలబడతాయా? ఇది ముందే తెలియదా? అంతా తెలిసి కూడా బీసీలను ఎందుకు మోసం చేస్తున్నారు? చట్టబద్ధంగా కమిషన్‌ను ఏర్పాటు చేసి అధ్యయనం చేయాల్సిన బాధ్యత మీపై లేదా? రాజ్యాంగంలోని 73, 74 సవరణలు జరిగి 20 ఏళ్లు దాటినా, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పద్ధతి ప్రకారం ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఇది ప్రభుత్వ పూర్తి వైఫల్యం కాదా? అసలు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని చంద్రబాబు ఎప్పుడైనా సీరియస్‌గా తీసుకున్నారా?.

ప్రజాధనం వృథా.. అధికారులపై దబాయింపులు..

కోర్టు ఫీజుల రూపంలో, న్యాయవాదుల ఫీజుల రూపంలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని, అమూల్యమైన కాలాన్ని ప్రభుత్వం వృథా చేయడం ఏ రకమైన పరిపాలన? కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసిన మీ ప్రతినిధి బృందం బీసీ రిజర్వేషన్ల గురించి ఏం సాధించింది? అక్కడ నోరు మెదపని చంద్రబాబు, ఇక్కడ వ్యవస్థాగత చట్టాలకు వ్యతిరేకంగా జీవోలు ఎందుకు జారీ చేశారు? చట్టవ్యతిరేకమని అధికారులు హెచ్చరిస్తున్నా, వారిని దబాయించి మరీ జీవోలు తెచ్చారంటే.. బీసీలను ఎలాగైనా మభ్యపెట్టవచ్చనే కదా మీ ఆలోచన? 'నేను తెలిసే తప్పు చేశాను, అబద్ధాలు చెప్పి ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చాను' అని చంద్రబాబు రాష్ట్రంలోని బీసీలకు నేరుగా క్షమాపణ చెప్పాలి.

బీసీల పట్ల వైఎస్ జగన్‌ది నిజమైన చిత్తశుద్ధి..

మా ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు కేవలం కాగితాల మీద చట్టాలకే పరిమితం కాకుండా, చేతల్లో బీసీలకు 34 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించి చూపించారు. కేబినెట్ కూర్పు మొదలుకుని, రాజ్యసభ సీట్లు, కార్పొరేషన్ చైర్మన్లు, మేయర్లు, జడ్పీ చైర్మన్లు, అర్బన్-రూరల్ లోకల్ బాడీలలో బీసీలకే పెద్దపీట వేశారు. బీసీల పట్ల రాజకీయ పార్టీకి నిజమైన చిత్తశుద్ధి ఉంటే పదవుల్లో న్యాయం చేయవచ్చని జగన్ నిరూపించారు. కానీ చంద్రబాబు నాయుడు కేవలం మోసపూరిత రాజకీయాలు, దగా చేసే విధానాలనే ఎంచుకున్నారు.

కుటుంబ లెక్కలు కాదు.. చట్టబద్ధ కమిషన్‌తోనే సమగ్ర సర్వే జరగాలి.

ప్రస్తుతం ప్రభుత్వం కుటుంబ వివరాలను సేకరించి, ఆ లెక్కలతో రిజర్వేషన్లు ఇస్తామనడానికి న్యాయపరంగా చట్టబద్ధత ఉందా? హైకోర్టు గానీ, సుప్రీంకోర్టు గానీ కోరిన సర్వే ఇదేనా? బీసీ కమిషన్ నిర్వహించాల్సిన సర్వేను తప్పదోవ పట్టించి, మళ్లీ కుటుంబ లెక్కలతో మాయ చేయాలని చూస్తున్నారు. తప్పుడు లెక్కలతో ప్రజలను ఎక్కువ కాలం మోసగించలేరు. వెంటనే చట్టం నిర్దేశించిన నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి కమిషన్‌ను ఏర్పాటు చేసి, పారదర్శకమైన సమగ్ర సర్వే జరిపించాలి. సజావుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. 

అనంతరం మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు బదులిస్తూ..

సుప్రీంకోర్టులో మోసం బట్టబయలైంది.. ఓటర్ల జాబితాపై నిర్లక్ష్యం తగదు.

రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్నది దేశంలో స్థిరపడిన ప్రాథమిక న్యాయ సూత్రం. అది తెలిసి కూడా వెన్నుపోటు పార్టీ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో ఎలా పెట్టారు? ఎన్నికలు అయిపోయాక ఆ జీవో ఎందుకు విడుదల చేశారు? కేవలం ప్రజలను నమ్మించి మోసగించడానికే కదా? హైకోర్టు మొట్టికాయలు వేసినా సిగ్గుపడకుండా సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. చివరకు సుప్రీంకోర్టు కూడా ఎన్నికలు నిర్వహించే నాటికి ఓటర్ల జాబితా తయారైతే దాన్నే వాడాలని, లేదంటే అప్పటికే అందుబాటులో ఉన్న జాబితాతోనే వెళ్లాలని స్పష్టం చేసింది. అంటే మా వాదన సరైనదేనని న్యాయస్థానం స్పష్టం చేసినట్లే కదా? ప్రజాస్వామ్యంలో ఓటరే కీలకమైనప్పుడు, ఓటర్ల జాబితా తయారీలో ఇంత నిర్లక్ష్యం మంచిది కాదు. ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకమైన ఓటర్ల జాబితాలను సిద్ధం చేసి ప్రజాస్వామ్య పునాదులను కాపాడాలి.

Back to Top