34 శాతం రిజర్వేషన్ల పేరుతో బీసీలకు  చంద్రబాబు దగా

అమలుకు చట్ట సవరణ చేయాలని చంద్రబాబుకు తెలియదా..?

 శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజం

విజయనగరంలోని జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శాసనమండలి విపక్ష నేత బొత్స  సత్యనారాయణ.

నిజంగా చిత్తశుద్ధి ఉంటే డబుల్ ఇంజిన్ సర్కారులో రాజ్యాంగ సవరణ చేయలేరా..?

ప్రధాని మోడీతో భేటీల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించలేదేం..?

 సూటిగా ప్రశ్నించిన బొత్స సత్యనారాయణ 

బీసీలు అమాయకులనే రిజర్వేషన్ల పేరుతో బాబు రాజకీయాలు

చంద్రబాబు గారిడీని గుర్తించి తగిన బుద్ధి చెప్పాల్సిందే..

 బొత్స సత్యనారాయణ  పిలుపు

వెనుక వడిన వర్గాలకు పెద్దపీట వేసింది జగన్ మాత్రమే..

కావాలంటే లెక్కలు తీయండి.. బహిరంగ చర్చకు సిద్ధం

 బొత్స సత్యనారాయణ స్పష్టీకరణ

స్థానిక ఎన్నికలకు వై యస్సార్ సీపీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది

చంద్రబాబులా చెతులేత్తేసి భయపడి పారిపోలేదు

 బొత్స సత్యనారాయణ ఎద్దేవా

సామాన్యుల సమస్యలు గాలికి వదిలేసి ఎన్నికల రాజకీయాలా.?

నిత్యావసర ధరలను అదుపు చేయలేరా..?

ప్రెస్ మీట్ లో బొత్స నిలదీత

విజయనగరం:  రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు న్యాయం చేస్తామని  34 శాతం రిజర్వేషన్ల పేరుతో హామీ ఇచ్చి ఇప్పుడు  వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి మోసానికి గురి చేశారని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు.  బీసీలకు నిజంగా న్యాయం చేయాలనే చిత్తశుద్ధి ఉంటే, డబుల్ ఇంజిన్ సర్కారుగా చెప్పుకునే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి రాజ్యాంగ సవరణ చేయించాలని ఆయన చంద్రబాబుకు సవాల్ చేసారు.  అంతేకానీ కోర్టుల్లో నిలబడవని తెలిసి కూడా మభ్య పెట్టేలా నిర్ణయాలు తీసుకుని బీసీ వర్గాలను దగా చేయడం సరికాదని స్పష్టం చేశారు. విజయనగరంలోని జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మీడియాతో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు  నిర్ణయం న్యాయపరంగా నిలబడుతుందా లేదా అనే విషయాన్ని ముందుగానే ఆలోచించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై లేదా అని ప్రశ్నించారు.  రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులకు రాజ్యాంగపరమైన హక్కులు, చట్టపరమైన అంశాలు తెలియవని భావించి ప్రభుత్వం ఏది చెప్పినా నమ్ముతారని అనుకోవడం చంద్రబాబు రాజకీయ అహంకారానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేసారు.  బీసీ వర్గాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి, ఆ హామీని అమలు చేసే దిశగా స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు మభ్య పెడితే మోసపోవడానికి బీసీలు సిద్ధంగా లేరని, చంద్రబాబు కుట్రలకు తగిన బుద్ధి చెబుతారని బొత్స హెచ్చరించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం మాత్రమే సరిపోదని హితవు పలికారు. న్యాయపరమైన అడ్డంకులను అధిగమించి, రాజ్యాంగబద్ధమైన మార్గంలో రిజర్వేషన్లు అమలయ్యేలా చూడటం ప్రభుత్వ బాధ్యత అని బొత్స గుర్తు చేసారు.  బీసీలకు ఇచ్చిన హామీలపై చంద్రబాబు నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని,  లేకుంటే    బలహీన వర్గాలకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ  పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేసారు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన ఇంకా ఏం మాట్లాడరంటే.. 
 
మోదీతో  బీసీ రిజర్వేషన్లపై చర్చించలేదేం..?:
కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు కొనసాగుతున్న నేపథ్యంలో  ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి ముఖ్యమంత్రి  రాష్ట్రంలోని బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ అవసరమని ఎందుకు కోరలేదు.  బీసీలకు న్యాయం చేయడం కోసం కేంద్రంతో చర్చలు జరిపి, అవసరమైన రాజ్యాంగపరమైన మార్పులకు ప్రయత్నించారా..? చిత్తశుద్ధితో ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా రాష్ట్రంలో ప్రకటనలు చేయడం, ఆ తర్వాత న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పుడు ప్రతిపక్షాలపై నిందలు వేయడం ఏమిటి..?  
బీసీలకు ఇచ్చిన హామీల అమలుపై ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలి.  కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రిజర్వేషన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి.  చంద్రబాబు నాయుడు బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఇందుకు 34 శాతం రిజర్వేషన్లపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించి, అవసరమైన రాజ్యాంగ సవరణ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి.  బీసీలను ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఉపయోగించుకుని, ఆ తర్వాత వారి సమస్యలను పట్టించుకోకపోవడం సరికాదు. బీసీ వర్గాలకు నిజమైన న్యాయం జరగాలంటే రాజకీయ ప్రకటనల కంటే చట్టబద్ధమైన చర్యలు ముఖ్యం.  వైఎస్సార్‌సీపీ బీసీల హక్కుల కోసం నిరంతరం పోరాడుతుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో బీసీలకు అన్యాయం జరిగితే ప్రతిపక్షంగా ప్రశ్నిస్తాం.. నిలదీస్తాం.. పోరాడుతాం..
 
ఎవరేం చేసారో.. బహిరంగ చర్చకు సిద్ధమా..?: 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు రాజకీయంగా, సామాజికంగా ప్రాధాన్యత కల్పించాం. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవులు సహా వివిధ రంగాల్లో బీసీలకు అవకాశాలు కల్పించేందుకు జగన్ హయాంలో  ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు  చేపట్టింది.  గత ఐదేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బీసీలకు ఎన్ని పదవులు ఇచ్చిందో, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎంతమందికి అవకాశాలు కల్పించిందో బహిరంగంగా లెక్కలు వెల్లడించాలని సవాల్ చేస్తున్నా.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు కల్పించిన అవకాశాలపై బహిరంగ చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం. బీసీల సంక్షేమం గురించి మాటల్లో చెప్పడం కాకుండా, ఆచరణలో ఎవరెంత చేశారో గణాంకాలతో నిరూపణ చేయాలి. రిజర్వేషన్ల విషయంలో చట్టపరమైన పరిమితులు ఉన్నాయని తెలిసినప్పుడు, వాటిని అధిగమించేందుకు రాజ్యాంగబద్ధమైన పరిష్కారాలను అన్వేషించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. బీసీలకు ఎక్కువ అవకాశాలు కల్పించేందుకు మా పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదు. 

స్థానిక  ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సిద్ధం: 
స్థానిక సంస్థల ఎన్నికలను వైఎస్సార్‌సీపీ వాయిదా వేయాలని ఏనాడూ అనుకోలేదు. ఏ సమయంలో ఎన్నికలు నిర్వహించినా తమ పార్టీ పోటీకి సిద్ధంగా ఉంది. ప్రజల సమస్యలపై పోరాడటమే ప్రతిపక్ష పార్టీ బాధ్యత.  ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో తప్పులు ఉంటే వాటిని ప్రశ్నించడం మా ప్రజాస్వామ్య హక్కు. వైఎస్సార్‌సీపీ ఎన్నికలకు భయపడి వెనక్కి తగ్గే పార్టీ కాదు.  ఎన్నికలు నిర్వహించే ముందు ప్రభుత్వం చట్టపరమైన అంశాలను స్పష్టంగా పరిష్కరించాలి. ఒకవైపు రిజర్వేషన్లపై న్యాయపరమైన అభ్యంతరాలు ఉండగా, మరోవైపు ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించడం ప్రజల్లో అనుమానాలను కల్పించే ఉద్దేశ్యం  కాదా..? వైఎస్ జగన్ హయాంలో బీసీలకు అనేక పదవుల్లో పార్టీ పరంగా 50 శాతానికి మించి పదవులు అందించారు.   ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. మా పార్టీ అధ్యక్షులు జగన్ గారు వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్నారు. చంద్రబాబు తరహాలో స్థానికలకు చేతులేత్తయేలేదు.

ప్రజా సమస్యలను గాలికి వదిలేసి రాజకీయాలా..? : 
రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు దారుణంగా  పెరుగుతున్నాయి.  కూరగాయల ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి  ప్రజల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్న ధరల పెరుగుదలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి.  ధరల నియంత్రణ, ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా చూడటం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. సామాన్య కుటుంబాలు తమ రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నప్పుడు, ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. రెండేళ్ల వ్యవధిలో కూరగాయల ధరలు 62 శాతం పెరిగాయి. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా రాజకీయ విమర్శలకే పరిమితమవడం వల్ల ప్రజలకు ప్రయోజనం ఉండదు. ధరల పెరుగుదల, ప్రజల జీవన వ్యయం, ఉద్యోగ సంఘాల సమస్యలు వంటి అంశాలపై ప్రభుత్వం సమగ్రంగా స్పందించాలి అని బొత్స హితవు పలికారు.

Back to Top