జగనన్న కాల‌నీలో మౌలిక‌ సదుపాయాలు కల్పించాలి

వైయ‌స్ఆర్‌సీపీ యువ నాయకుడు డాక్టర్‌ ధర్మాన కృష్ణ చైతన్య

నరసన్నపేట: జగనన్న కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని యువ నాయకుడు డాక్టర్‌ ధర్మాన కృష్ణ చైతన్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నరసన్నపేట మండలం రావాడపేటలోని జగనన్న కాలనీని సందర్శించిన ఆయన, స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో తన తండ్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ మంత్రిగా ఉన్న సమయంలో నరసన్నపేట పట్టణ పరిధిలో 28 ఎకరాల భూమిని సుమారు రూ.5.60 కోట్లతో కొనుగోలు చేసి 1,200 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు కృష్ణ చైతన్య తెలిపారు. అలాగే రూ.1.40 కోట్లతో వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణం, ఇంటింటికీ కుళాయి సదుపాయాల పనులు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం జగనన్న కాలనీవాసులతో పాటు నరసన్నపేట పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు. కాలనీలో తక్షణమే తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని, స్మశానవాటికకు అవసరమైన స్థల సేకరణను వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు. నరసన్నపేటలో విలువైన భూములు ఆక్రమణలకు గురవుతున్నాయనే ఆరోపణలపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. నరసన్నపేట ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు గర్భిణులకు అవసరమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. జగనన్న కాలనీవాసుల సమస్యలను తక్షణమే పరిష్కరించి, కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డాక్టర్‌ ధర్మాన కృష్ణ చైతన్య డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Back to Top