అనంతపురం: శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంకటాపురం గ్రామానికి చెందిన వైయస్ఆర్సీపీ మద్దతుదారులైన దళిత దంపతులు వరకూటి కాటమయ్య, దేవిలపై ఇటీవల జరిగిన స్కూల్ కమిటీ ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు దాడి చేశారని, ఈ ఘటనపై ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయడానికి వెనకడుగు వేస్తున్నారని వైయస్ఆర్సీపీ వర్గాలు ఆరోపించాయి. టీడీపీ నేతలు జొన్నా రామయ్య, జొన్నా వేణుగోపాల్, బుక్కరాయసముద్రం సీఐ సుబ్బారాయుడు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్తున్నామంటూ కాటమయ్య, దేవి సెల్ఫీ వీడియో విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనతో దంపతులు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలిపారు. టీడీపీ నేతల కనుసన్నల్లోనే బుక్కరాయసముద్రం పోలీసులు పనిచేస్తున్నారని వైయస్ఆర్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత దంపతుల ఫిర్యాదుపై వెంటనే స్పందించి, దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.