అనంతపురం: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని పంటలు ఎండిపోతున్నా ఎంపీఆర్ ఆయకట్టు రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైయస్ఆర్‌సీపీ సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి, పార్టీ పీఏసీ నేత డా. సాకే శైలజానాథ్ మండిపడ్డారు. రైతుల సమస్యలపై ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన “చలో ఎంపీఆర్ ట్యాంక్” కార్యక్రమంలో పార్టీ నాయకులు, వామపక్ష నేతలు, రైతు ప్రతినిధులతో కలిసి ఎంపీఆర్ రిజర్వాయర్, కాలువలు, ఆయకట్టు ప్రాంతాలను పరిశీలించారు. రైతులు నీటిని భిక్షగా అడగడం లేదని, హక్కుగా రావాల్సిన కృష్ణా జలాలను కోరుతున్నారని శైలజానాథ్ పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో సాగునీరు అందించలేని పరిస్థితి ఉంటే కనీసం ఆరుతడి పంటలను కాపాడేందుకు అవసరమైన నీటిని వెంటనే విడుదల చేయాలని కోరారు. రిజర్వాయర్‌లో అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలతో సమన్వయం చేసుకుంటూనే పంటలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతు పంట ఎండిపోయిన తర్వాత పరిహారాల పేరుతో ప్రకటనలు చేయడం కాదని, ముందుగానే నీరు అందించి పంటలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని శైలజానాథ్ స్పష్టం చేశారు. రాయలసీమ రైతులకు హక్కుగా రావాల్సిన కృష్ణా జలాలను సక్రమంగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని, కాలువల నిర్వహణ, పూడికతీత, మరమ్మతులపై దృష్టి పెట్టాలని కోరారు. రైతుల ప్రయోజనాల విషయంలో నిర్లక్ష్యం కొనసాగితే వైయస్ఆర్‌సీపీ రైతుల తరఫున మరింత బలంగా పోరాడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్లు ఎల్లారెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, పరంధామరెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు నారాయణరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మన శ్రీరామరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ప్రతాప్‌రెడ్డి, ఐటీ విభాగం జోనల్ ఇన్‌చార్జ్ మంజునాథ్ యాదవ్, ఎస్టీ సెల్ శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.