కళ్యాణదుర్గం: బీటీపీ కాలువల నిర్మాణాన్ని రెండున్నరేళ్లలో పూర్తి చేసి నీటిని విడుదల చేస్తామని ఎమ్మెల్యే సురేంద్రబాబు ఇచ్చిన హామీ గడువు ముగుస్తున్నా పనులు పూర్తి కాకపోవడంపై మాజీ ఎంపీ తలారి రంగయ్య ప్రశ్నించారు. కుందుర్పిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కళ్యాణదుర్గం నియోజకవర్గ రైతుల సాగునీటి సమస్యలపై వైయస్ఆర్‌సీపీ రాజీలేని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. డిసెంబర్ 4లోగా బీటీపీ కాలువల పనులు పూర్తి చేసి నీటిని విడుదల చేయకపోతే డిసెంబర్ 5 నుంచి ‘చెరువు నీటి సత్యాగ్రహం’ చేపడతామని తలారి రంగయ్య ప్రకటించారు. నియోజకవర్గంలోని 114 చెరువులకు నీరు అందించాలనే డిమాండ్‌తో 114 వారాల పాటు ప్రతి శనివారం ఒక్కో మండలంలో దీక్ష చేపడతామని తెలిపారు. రైతుల సాగునీటి హక్కుల కోసం వైయస్ఆర్‌సీపీ శ్రేణులు ప్రజలతో కలిసి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. గతంలో ఇచ్చిన హామీలకు సంబంధించిన వీడియోలను ప్రజల ముందు ప్రదర్శించి, మాటలకు–చేతలకు ఉన్న తేడాను ప్రజాక్షేత్రంలోనే ఎండగడతామని రంగయ్య పేర్కొన్నారు. బీటీపీ కాలువల పనులు ఆలస్యం కావడంతో రైతులు నష్టపోతున్నారని, ఇకనైనా ప్రభుత్వం, ఎమ్మెల్యే స్పందించి పనులను పూర్తి చేసి చెరువులకు నీరు అందించాలని కోరారు.