తాడేపల్లి : డీఎస్సీ కుంభకోణంలో కూరుకుపోయిన తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్‌లు ప్రజల దృష్టిని మళ్లించేందుకే అనుకూల ఎల్లో మీడియా ద్వారా రోజుకో కట్టుకథను, కొత్త చిలకలను తెరపైకి తెస్తున్నారని..వైయస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీ జే ఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. తాడేపల్లి వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ హయాంలో రూ. లక్ష కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందని అడ్డగోలు ప్రచారం చేసిన వెన్నుపోటు పార్టీ కూటమి నేతలు, తీరా అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచాక తమ ఆధ్వర్యంలోని సిట్ చార్జ్‌షీట్‌లో కేవలం రూ. 3 వేల కోట్లేనని పేర్కొనడం ద్వారా పచ్చి అబద్ధాలతో ప్రజలను మోసం చేయాలని చూసిన వైనం బట్టబయలైందని సుధాకర్ బాబు తేల్చి చెప్పారు. వాస్తవానికి కూటమి పాలనలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయని... ఎంఆర్‌పీ కంటే బాటిల్‌కు రూ. 20 - రూ.40 అదనంగా వసూలు చేస్తున్నారన్న సుధాకర్ బాబు రాష్ట్రంలో 'సిండికేట్ - సూట్‌కేస్ - రాకేష్ - లోకేష్' నెట్‌వర్క్ నడుస్తోందని తేల్చి చెప్పారు. మరోవైపు చంద్రబాబు, లోకేష్ ఆదేశాలతోనే సిట్ నిర్దిష్ట వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని దర్యాప్తు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసిన సుధాకర్ బాబు... తిరుపతిలో రిటైర్డ్ పోలీస్ అధికారి సుబ్రమణ్యం రెడ్డిని నిర్బంధించి ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాజీ గన్‌మెన్ మదన్‌మోహన్‌రెడ్డిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆయన... హైదరాబాద్ ఫార్మ్‌హౌస్‌లో లభించిన రూ.11 కోట్లు రాజ్ కసిరెడ్డివేనంటూ ప్రచారం చేసిన సిట్, కోర్టులో బ్యాంకు రసీదులు చూపలేకపోయిందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే... లక్ష కోట్లు ఏమైంది? అంకెలు ఎలా మారాయి? ఎన్నికలకు ముందు టీడీపీ, ఎన్డీయే కూటమి నాయకులు పదే,పదే వైయస్సార్సీపీ హయాంలో రూ. లక్ష కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందని అడ్డగోలుగా ఆరోపించారు. తీరా ఎన్నికలయ్యాక పవన్ కళ్యాణ్ రూ. 44 వేల కోట్లు అని, చంద్రబాబు అసెంబ్లీలో రూ. 33 వేల కోట్లని, ఎల్లో పేపర్ పేరుతో రూ. 18 వేల కోట్లని పూటకో లెక్క చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు వేసిన సిట్ ఏమో రూ. 3 వేల కోట్లు అంటోంది. అసలు లక్ష కోట్ల ఆరోపణ ఏమైంది? ఈ రూ. 3 వేల కోట్ల కుంభకోణానికైనా ఆధారాలు చూపారా? ఒక్క రూపాయి అయినా నిరూపించగలిగారా? రెండేళ్లుగా విచారణ పేరిట కాలయాపన చేస్తుంటే సుప్రీం కోర్టు సైతం చీవాట్లు పెట్టింది వాస్తవం కాదా?. డీఎస్సీ కుంభకోణం నుంచి డైవర్షన్ కోసమే ఈ చిలక పలుకులు.. డీఎస్సీ స్కామ్‌లో తండ్రీకొడుకులు పీకల్లోతు కూరుకుపోయారు. ఆ బురద నుంచి బయటపడేందుకే ఎదుటివారిపై బురదజల్లే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అందుకోసమే ఎల్లో మీడియాలో కొత్త కొత్త చిలకలను తీసుకొచ్చి కథనాలు రాయిస్తున్నారు. మొన్న ఎక్సైజ్ ఉద్యోగి సత్యప్రసాద్‌ను, నిన్న రిటైర్డ్ ఐఏఎస్ రజత్ భార్గవ్‌ను తెరపైకి తెచ్చారు. ఆగస్టు 2025 చార్జ్‌షీట్ సమయంలో రజత్ భార్గవ్‌ను విచారించినప్పుడు లేని అంశాలు.. 14 నెలల తర్వాత ఇప్పుడు కొత్తగా ఎలా పుట్టుకొచ్చాయి? చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను సిట్ అనే గూట్లోని చిలకలతో పలికిస్తున్నారు. సిట్ చెప్పే వాంగ్మూలాలకు, స్టేట్‌మెంట్లకు అసలు విలువే లేదు. బేసిక్ రేట్లు పెంచలేదు.. ప్రభుత్వానికే రాబడి తెచ్చాం.. వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం క్వార్టర్ బేసిక్ ధరలను ఎక్కడా పెంచలేదు. కేవలం డిస్టిలరీలపై ట్యాక్స్‌లు మాత్రమే పెంచాం. తద్వారా ప్రభుత్వానికే నేరుగా రూ. 18 వేల కోట్ల నుంచి రూ. 20 వేల కోట్ల వరకు రాబడి వచ్చింది తప్ప వ్యక్తులకు కాదు. ప్రభుత్వమే దుకాణాలు నిర్వహించి అమ్మకాలు చేపడితే లంచాలు ఎలా వస్తాయి? గతంలో టీడీపీ హయాంలో 4,380 దుకాణాలు ఉంటే, వైఎస్సార్‌సీపీ హయాంలో వాటిని 2,934కి తగ్గించాం. 43,000 బెల్ట్ షాపులను రద్దు చేశాం. ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకే సమయం పరిమితం చేశాం. మద్యం విక్రయాలు తగ్గిస్తే లంచాలు వస్తాయా? లేక ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నట్లు మద్యం ఏరులై పారిస్తే వస్తాయా?. సిట్ థర్డ్ డిగ్రీ వేధింపులు.. కోర్టుల్లో బట్టబయలైన నిజాలు.. ఒక టార్గెట్‌ను ఫిక్స్ చేసుకుని, జగన్ మోహన్ రెడ్డి గారితో పనిచేసిన అధికారులు, నేతలను వేధించడమే సిట్ పనిగా పెట్టుకుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్‌మన్లలో ఒకరికి 55 శాతం జీతం పెంచి ప్రమోషన్ ఇస్తే, తాము చెప్పిన అబద్ధాలపై సంతకం పెట్టనందుకు మరో గన్‌మన్ మదన్ మోహన్ రెడ్డికి థర్డ్ డిగ్రీ ప్రయోగించి కొట్టారు. ఆ బాధితుడే స్వయంగా కోర్టును ఆశ్రయించాడు. టీడీపీతో సంబంధమున్న వెంకటేష్ నాయుడుకు రూ. 2 కోట్లు ఆశచూపి తప్పుడు వాంగ్మూలం ఇవ్వమంటే ఒప్పుకోలేదని చిత్రహింసలు పెట్టారు. హైదరాబాద్ వర్ధమాన్ కాలేజీ వద్ద ఫామ్‌హౌస్‌లో రాజ్ కాసిరెడ్డికి చెందిన రూ. 11 కోట్లు పట్టుకున్నామని ప్రచారం చేసి, చివరకు ఆ డబ్బుల డిపాజిట్ రసీదులు చూపించలేక కోర్టు ముందు పోలీసులు తెల్లమొహం వేశారు. నిందితుల ల్యాప్‌టాప్‌లు, ఫోన్లను సీజ్ చేసి అందులో అక్రమంగా డేటా ఎక్కించి తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. స్కామ్ జరుగుతున్నది కూటమి పాలనలోనే! రాష్ట్రంలో ఉన్న 20 డిస్టిలరీలలో 14 డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చింది చంద్రబాబే. టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, పుట్టా సుధాకర్ యాదవ్, ఎస్పీవై రెడ్డి కుటుంబాల ఆధ్వర్యంలోనే అవి ఉన్నాయి. 2014-19 మధ్య నాలుగు డిస్టిలరీల నుంచే 53 శాతానికి పైగా కొనుగోళ్లు చేశారు. ప్రస్తుతం కూటమి పాలనలో బార్లు, మార్ట్లు, పర్మిట్ రూములు, ఏకంగా 60 వేలకు పైగా బెల్ట్ షాపులు కలిపి రాష్ట్రవ్యాప్తంగా 64,722 కేంద్రాల్లో మద్యం ఏరులై పారుతోంది. ఎంఆర్‌పీ కంటే బాటిల్‌కు రూ. 20 నుంచి రూ. 40 అదనంగా వసూలు చేస్తూ 'సిండికేట్ - సూట్‌కేస్ - రాకేష్ - లోకేష్' నెట్‌వర్క్ నడుపుతున్నారు. ఫేక్, కల్తీ మద్యం తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి స్కామ్‌ను చట్టప్రకారం బట్టబయలు చేసి తీరుతామని సుధాకర్ బాబు స్పష్టం చేశారు.