నెల్లూరు కార్పొరేషన్‌లో ఎక్కడిక్కడ పచ్చి దోపిడి

ఇంకా రూ.66 కోట్ల పన్నులు రూ.154 కోట్లకు పెంచారు

కాకాణి గోవర్థన్‌రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఫైర్‌

నెల్లూరులోని వైయస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి.

చెత్త సేకరణలో ‘క్లాప్‌’ ఆటోలు ఏకపక్షంగా తొలగింపు

మంత్రి అనుచరుల ట్రాక్టర్లతో చెత్త సేకరణ, తరలింపు

అందులో ఏకంగా రూ.20 కోట్ల అవినీతి 

స్వీపింగ్‌ మిషన్లు, కాంపాక్టర్లతో నిధుల లూటీ

ప్రెస్‌మీట్‌లో కాకాణి గోవర్థన్‌రెడ్డి, పి.చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజం

నెల్లూరు: నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కనుసన్నల్లోనే బడ్జెట్‌ అంచనాలను అడ్డగోలుగా పెంచేసి, ప్రజల మెడపై కత్తిపెట్టి ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తూ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో దోపిడీకి పాల్పడుతున్నారని వైయస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. టెండర్లు పిలవాల్సిన అవసరం లేకుండా పనులను రూ.4.90 లక్షల బాటా రేట్లుగా విభజించి సొంత మనుషులకు కట్టబెడుతున్నారని, చెట్లు, చెత్త, వాహనాల నిర్వహణ, కాంపాక్టర్లు, బస్సుల పేర్లతో రోజుకో కుంభకోణానికి తెర లేపారని వారు ధ్వజమెత్తారు. ఈ మేరకు నెల్లూరు కార్పొరేషన్‌ బడ్జెట్‌ పుస్తకాలు, టెండర్‌ ప్రతులు, ఎజెండా కాపీలను ఆధారాలతో సహా చూపిన వారు, అన్ని ఆధారాలతో నిలదీస్తున్నా సమాధానం చెప్పకుండా మంత్రి నారాయణ పారిపోతున్నారని ఆక్షేపించారు. 
    నెల్లూరులోని వైయస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కాకాణి గోవర్థన్‌రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..

నారాయణ హయాం అంతా అవినీతిమయం
దోపిడికి అడ్డాగా మారిన నెల్లూరు కార్పొరేషన్‌.
:కాకాణి గోవర్థన్‌రెడ్డి. మాజీ మంత్రి:

– నెల్లూరు మున్సిపాలిటీ పరిస్థితి చూస్తుంటే వినికిడి లేని చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు తయారైంది. మంత్రి నారాయణ ముందు ఎంత మొత్తుకున్నా ఆయనలో కనీస చలనం రావడం లేదు. తీవ్ర ఫ్రస్ట్రేషన్‌లో వైఎస్సార్‌సీపీని, మా నాయకుడు జగన్‌గారిని, మమ్మల్ని దూషిస్తూ ఇంకా ఇంకా స్థాయిని దిగజార్చుకుంటున్నారు. ఎమ్మెల్సీ పి.చంద్రశేఖర్‌రెడ్డి అన్ని ఆధారాలతో వినీతిని నిరూపిస్తే.. స్పందించాల్సిన మంత్రి.. ‘నేను మీకు సమాధానం చెప్పను’ అంటూ తప్పించుకుని తిరుగుతున్నారు.
ఒక్కో చెట్టుకు రూ.12 వేల చొప్పున లూటీ ప్లాన్‌:
    చెట్ల పెంపకం పేరుతో ఒక్కో మొక్క నాటేందుకు రూ.5 వేలు, దాని పెంపకానికి రూ.7 వేలు కలిపి మొత్తం రూ.12 వేలు లూటీ చేయడానికి స్కెచ్‌ వేసిన మాట వాస్తవం కాదా? సీఎస్‌ఆర్‌ నిధులైనా, మున్సిపల్‌ నిధులైనా ప్రజల సొమ్మే కదా! దీనిపై ఎందుకు వివరణ ఇవ్వలేకపోతున్నారు? టెండర్లు పిలవాల్సి వస్తుందనే ఉద్దేశంతో రూ.4.90 లక్షల బాటా రేట్లతో విభజించి సొంత మనుషులకే పనులు కట్టబెడుతూ ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నారు.
నిజాయితీ ఉంటే కమిషనర్‌పై చర్యలేవి?:
    పాఠశాల విద్యార్థులకు పాఠాలు చెప్పడంలో ఎంత అప్‌డేట్‌ అవుతున్నారో తెలియదు కానీ, కార్పొరేషన్‌లో స్కామ్‌లు చేయడంలో రోజుకో రకంగా అప్‌డేట్‌ అవుతున్నారు. బస్సుల కొనుగోలు వ్యవహారంలో ఆధారాలతో పట్టుబడటంతోనే ఒప్పందాన్ని పక్కనపెట్టి, ఇప్పుడు నాకేం సంబంధం లేదని బుకాయిస్తున్నారు. ఈ అవినీతితో మీకు సంబంధం లేకపోతే, మీ పేరు వాడుకున్న కమిషనర్‌పై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆయన్ను ఆ కుర్చీలో ఎలా కొనసాగిస్తున్నారు?‘
టీ తాగి, టిఫిన్లు తింటే అభివృద్ధి అయిపోతుందా?:
    పేదరికం నుంచి వచ్చానని కల్లబొల్లి మాటలు చెప్పే మీరు, పేదల మెడపై కత్తిపెట్టి పన్నుల రూపంలో కమిషన్లు దండుకుంటున్నారు. రోడ్ల మీద నడవడం, ఎక్కడో ఒకచోట టీ తాగి, టిఫిన్‌ చేసి, మీడియా కెమెరాల ముందు పోజులిస్తే అభివృద్ధి అయిపోతుందా? లక్షల ప్రజాధనం తగలేసి కట్టిన ఏసీ బస్‌ షెల్టర్లలో నేడు కుక్కలు, తాగుబోతులు సేద తీరుతున్నారు. వేల కోట్ల వ్యాపారాలు, అహంకారం నెత్తికెక్కి  జగన్‌గారిపై అవాకులు చవాకులు పేలితే ఖబర్దార్‌. నెల్లూరు కార్పొరేషన్‌లో జరిగిన ప్రతి పైసా అవినీతిని లెక్కలతో సహా ప్రజల ముందు నిలబెడతాం.

ఒక్కసారిగా పన్నుల పెంపుతో ప్రజల నడ్డి విరుస్తున్నారు.
:పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి. ఎమ్మెల్సీ.

– 2019 నుంచి మున్సిపల్‌ బడ్జెట్‌ రికార్డులను పరిశీలిస్తే వాస్తవాలు కళ్లకు కడతాయి. వైఎస్సార్‌సీపీ హయాంలో రూ.44 కోట్ల నుంచి రూ.66 కోట్ల వరకు ఉన్న వార్షిక పన్నుల వసూళ్లను, కూటమి ప్రభుత్వం రాగానే నారాయణ ఆధ్వర్యంలో గతేడాది రూ.111 కోట్లు వసూలు చేసి, ఈ ఏడాది ఏకంగా రూ.154 కోట్లకు టార్గెట్‌ పెంచారు. పన్నులు కట్టలేదని సామాన్యులను, రేకుల ఇళ్లలో ఉండే నిరుపేదలను లోక్‌ అదాలత్‌లకు, కోర్టులకు పిలిపించి వేధిస్తున్నారు. కార్పొరేట్‌ కాలేజీల్లో ఫీజులు వసూలు చేసినట్లుగా ఇళ్లపై పడి సీజ్‌ చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. మంచి నీటి పన్నును రూ.7 కోట్ల నుంచి ఏకంగా రూ.30 కోట్లకు పెంచేశారు.
‘క్లాప్‌’ ఆటోలు నిలిపేసి అనుచరుల ట్రాక్టర్లతో రూ.20 కోట్ల దోపిడీ:
    గత ప్రభుత్వంలో జగన్‌గారి హయాంలో ‘క్లాప్‌’ ఆటోల ద్వారా నేరుగా ఇళ్ల వద్దకే వెళ్లి క్లోజ్డ్‌ వాహనాల్లో చెత్త సేకరించే పద్ధతి తెచ్చాం. అప్పట్లో 95 ఆటోలకు నెలకు రూ.58.90 లక్షలు, ఏడాదికి రూ.7.06 కోట్లు మాత్రమే ఖర్చయ్యేది. కానీ ఈ ప్రభుత్వం రాగానే క్లాప్‌ వాహనాలకు అద్దె చెల్లించకుండా కుట్రపూరితంగా నిలిపివేసి, మంత్రి పి.నారాయణ అనుచరుడైన పృథ్వీరాజ్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు చెందిన 126 ట్రాక్టర్లను తెరపైకి తెచ్చారు. ఒక్కో ట్రాక్టర్‌కు నెలకు రూ.1,32,750 చెల్లిస్తూ, నెలకు రూ.1.67 కోట్లు, ఏడాదికి ఏకంగా రూ.20.07 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా ఓపెన్‌ ట్రాక్టర్లలో చెత్తను తరలిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు.
స్వీపింగ్‌ మిషన్లు, కాంపాక్టర్ల పేరిట కోట్ల రూపాయల లూటీ:
    నెల్లూరు నగరంలో 19 స్వీపింగ్‌ మిషన్ల నిర్వహణ కోసం నిబంధనలు మార్చి, టీపీఎస్‌ సంస్థకు ఏకంగా రూ.26.74 కోట్లకు అగ్రీమెంట్లు ఇచ్చారు. నెల్లూరు వంటి నగరానికి నాలుగైదు మిషన్లు సరిపోతాయి. ఆ రూ.26 కోట్లతో వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చు. ఇక డంపింగ్‌ యార్డుకు చెత్త తరలించేందుకు 3 కాంపాక్టర్లు సరిపోతుంటే, 6 కాంపాక్టర్ల నిర్వహణ కోసం ఎస్సీ గ్రీన్‌ వర్క్స్‌ సంస్థకు రూ.11.90 కోట్లు కట్టబెట్టారు. అజెండాలో ఏకంగా 24 కాంపాక్టర్లు కొన్నట్లు చూపి నిధులను కాజేస్తున్నారు.
అన్ని చోట్లా అదుపులేని దందా:
    విద్యార్థుల రవాణా పేరుతో 13 బస్సులను నెలకు ఒక్కో బస్సుకు రూ.1.40 లక్షల చొప్పున సులక్ష కన్‌స్ట్రక్షన్స్‌కు అప్పగించి ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారు. స్మార్ట్‌ సిటీ వెండింగ్‌ జోన్‌ ప్రాజెక్టు కింద జనరల్‌ ఫండ్స్‌ నుంచి రూ.4 కోట్లతో బడ్డీ కొట్లు తయారు చేయించి తమ అనుయాయులకే అప్పగించారు. విద్యా వాలంటీర్లకు నెలకు రూ.10 వేలు కూడా సరిగ్గా ఇవ్వలేని వీరు, నిర్వహణ, పెయింటింగ్స్‌ పేరుతో రూ.4.80 లక్షల చొప్పున కోట్లాది రూపాయల నిధులు డ్రా చేస్తున్నారు. నెల్లూరు జిల్లాకు మంత్రి పి.నారాయణ ఇప్పటి వరకు ఒక్క శాశ్వత అభివృద్ధి పని చేయలేదు. దమ్ముంటే దీనిపై ఆయన చర్చకు రావాలి.

Back to Top